జారుడుబండపై జనాకర్షణ

ABN , First Publish Date - 2021-08-22T06:48:19+05:30 IST

రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి.. హత్యలు ఉండవు అని అంటారు. తిరుగులేని జనాదరణతో అధికారంలోకి వచ్చిన ముగ్గురు నాయకులు ఈ సామెతను నిజం చేస్తున్నారా...

జారుడుబండపై జనాకర్షణ

రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి.. హత్యలు ఉండవు అని అంటారు. తిరుగులేని జనాదరణతో అధికారంలోకి వచ్చిన ముగ్గురు నాయకులు ఈ సామెతను నిజం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువ శాతం మంది నుంచి వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకుందాం. పదేళ్ల యూపీఏ పాలనపై ప్రజా వ్యతిరేకతను రగిలించి 2014లో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ తన వాక్చాతుర్యం, గిమ్మిక్కులతో తనకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు కల్పించుకున్నారు. ఫలితంగా ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. దేశంలో హిందువులను సంఘటితం చేయడం ద్వారా భారతీయ జనతాపార్టీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దారు. అయితే ప్రధానమంత్రిగా ఆయన రెండవ పర్యాయం అనేక అంశాలలో విఫలమవుతున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయటమే నరేంద్ర మోదీ సాధించిన అతి పెద్ద విజయంగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అంటే ప్రభుత్వాధినేతగా ఆయన చేసిన గొప్ప పనులు మరేవీ లేవని ప్రజలు భావిస్తున్నారనుకోవాలి. మతపరమైన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడంలో సఫలమవుతున్న మోదీ, కొవిడ్‌ మహమ్మారి వంటి సమస్యలను అధిగమించడంలో మాత్రం ప్రజల హృదయాలను దోచుకోలేకపోయారని వివిధ సర్వేల ద్వారా స్పష్టమవుతోంది. కరోనా మహమ్మారి రెండో దశను ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి విఫలమయ్యారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఆయన పరపతి క్షీణించడం మొదలైంది. దీనికితోడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతూ పోవడం, నిత్యావసరాల ధరల పెరుగుదలపై అదుపు లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలన్న పట్టుదలతో తానొక ప్రధానమంత్రిని అన్న విషయం విస్మరించి ఆయన చేసిన రాజకీయ విన్యాసాల వల్ల అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. ప్రధానమంత్రి ప్రస్తుత ఆహార్యం కూడా ప్రజలకు నచ్చడంలేదు. ఆహార్యం వ్యక్తిగతమే అయినప్పటికీ, నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి. దేశ ప్రధానిని ఫలానా విధంగా చూడాలని ప్రజలు భావిస్తారు. కారణం ఏమిటో తెలియదు గానీ, మోదీ జులపాలు, గడ్డం పెంచుతున్నారు. దీంతో ఆయన ప్రజలకు, ముఖ్యంగా యువతకు వృద్ధుడుగా కనిపిస్తున్నారు. అంతకు ముందు ట్రిమ్మింగ్‌ చేసిన గడ్డంతో తనదైన శైలిలో దుస్తులను ధరించిన నరేంద్ర మోదీ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. ట్రిమ్మింగ్‌ చేసే గడ్డం ఇప్పటి ట్రెండ్‌ కనుక యువత ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. మోదీని ప్రస్తుత గెటప్‌లో చూడ్డానికి యువత ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ ముఖ్యులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే జుట్టు, గడ్డం అదే పనిగా ఎందుకు పెంచుకుంటున్నారని ఆయనను అడిగే సాహసం ఎవరికీ లేదు. దీనికితోడు ప్రధానమంత్రి వాక్చాతుర్యం కూడా ఇప్పుడు ప్రజలను అంతగా ఆకట్టుకోవడం లేదు. హిందూ భావోద్వేగాలను వ్యాపింపజేయడం ద్వారా భారతీయ జనతాపార్టీకి బలమైన పునాది వేసిన నరేంద్ర మోదీ ఇలాంటి అనేక కారణాల వల్ల, నాయకుడిగా మాత్రం బలహీనపడుతున్నారని వివిధ సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ప్రధానమంత్రి పదవికి మోదీ తర్వాత ఎవరు అంటే, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేరు వినవస్తోందంటేనే దేశ ప్రజలలో హిందూ భావజాలం బలంగా నాటుకుందని భావించాలి. లేని పక్షంలో కాషాయ దుస్తులలో కనిపించే యోగి ఆదిత్యనాథ్‌ గురించి ఇతర రాష్ర్టాల ప్రజలకు ఏం తెలుసు? అయినా ఆయన ద్వితీయ స్థానంలో రావడం ఆశ్చర్యం కలిగించే అంశమే.


కేసీఆర్‌.. విషమ పరీక్ష!

ఇక రెండవ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్‌, తన రాజకీయ టక్కుటమార విద్యలతో బలమైన నాయకుడిగా ఎదిగారు. ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడటమే కాకుండా వాటిని బలహీనం చేశారు. ఒక వ్యక్తిని ఒకేసారి మోసం చేయవచ్చునని అంటారు. కేసీఆర్‌ మాత్రం ఒకే వ్యక్తిని అనేకమార్లు మభ్యపెట్టగలరు. వినూత్న సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు కాళేశ్వరం సహా పలు నీటి ప్రాజెక్టులను చేపట్టడం, మిషన్‌ భగీరథ పూర్తిచేసి ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయడం వంటి విజయాలు ఆయన సొంతం. ఆరునెలలు ముందుగానే 2018లో ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన బలహీనపడుతూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికలు జరిగిన ఆరునెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు షాక్‌ ఇచ్చారు. ఈ అనూహ్య ఫలితాలతో మేల్కొని విరుగుడు చర్యలు తీసుకోవాల్సిన కేసీఆర్‌, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో మరింత అప్రతిష్ఠపాలయ్యారు. కేసీఆర్‌ మాటల గారడీతో విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రసమితిని అపజయాలు పలకరించడం మొదలైంది. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంతో పాటు సాగు, తాగునీటి రంగాలలో అద్భుత ఫలితాలు సాధించినప్పటికీ ప్రజల్లో ఆయన పట్ల మొహం మొత్తుతోంది. మరోవైపు రాజకీయంగా శత్రువులను పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కేసీఆర్‌కు విషమపరీక్షగా మారింది. నిజానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అయినా ఇప్పుడు అక్కడ ఎన్నిక జరుగుతున్నట్టుగానే అధికార పార్టీ హడావిడి చేస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి నిన్నటి వరకు తనతో కలిసి నడిచిన ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం కేసీఆర్‌ నానా హైరానా పడుతున్నారు. జిల్లా యంత్రాంగం హుజూరాబాద్‌లో తిష్ట వేసి టీఆర్‌ఎస్‌ విజయం కోసం శ్రమిస్తోంది. ఈటల రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకుని ‘దళితబంధు’ పథకాన్ని కూడా ముందూ వెనుకా ఆలోచించకుండా కేసీఆర్‌ తీసుకువచ్చారు. దీంతో ఆయనకు మరిన్ని చిక్కులు మొదలయ్యాయి. బీసీలు, ఆదివాసీలు, ముస్లింలు తమకు కూడా ‘బంధు’ పథకాన్ని అమలుచేయాలని గొంతెత్తుతున్నారు. ఈ పరిణామాన్ని కేసీఆర్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. దళితబంధు పథకం కేసీఆర్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. ఏది ఏమైనా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారన్న విషయం పక్కన పెడితే ఇప్పటికైతే ఈటల రాజేందర్‌ నైతికంగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ను ఇంతలా కలవరపెట్టిన నాయకుడు ఈటల రాజేందర్‌ మాత్రమేనని చెప్పవచ్చు. మొత్తమ్మీద కేసీఆర్‌ తన చర్యల ద్వారా ప్రజల్లో పట్టును కోల్పోతున్నారు. నరేంద్ర మోదీకి గానీ, కేసీఆర్‌కు గానీ ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం వారిద్దరికీ ప్రజాస్వామ్య వాసనలు పడకపోవడమే. బహు నాయకత్వంతో నడిచిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు జాతీయస్థాయికి విస్తరించిన ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ప్రధాని మోదీనే ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియగా మారిపోయారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల మనోభావాల గురించి ఆయనకు చెప్పగలిగే చనువు ఎవరికీ లేదు. ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా ఆయనకు భయపడుతుండడం విశేషం. నియంతృత్వ పోకడలు ప్రవేశించిన తర్వాత ఏ నాయకుడైనా ప్రజలకు దూరమవుతాడు. కేసీఆర్‌ది కూడా ఇంచుమించుగా ఇదే ధోరణి. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా కేసీఆర్‌ పరిగణిస్తుంటారు. ఇతర ప్రాంతీయపార్టీల తరహాలోనే టీఆర్‌ఎస్‌లో కూడా మిగతా నాయకుల అభిప్రాయాలకు విలువ ఉండదు. మంత్రివర్గ సమావేశమైనా, పార్టీ సమావేశమైనా కేసీఆర్‌ ఉపన్యాసం విని చప్పట్లు కొట్టాల్సిందే. ఇతరులకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం కేసీఆర్‌ ఇవ్వరు. శాసనసభ్యులు, ఎంపీలు కూడా ఆయనను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోలేరు. ఇటువంటి వాతావరణాన్ని తన చుట్టూ సృష్టించుకోవడం వల్ల తప్పొప్పులు తెలుసుకునే అవకాశం కేసీఆర్‌కు లేకుండా పోయింది. ఎన్నికలకు చాలా వ్యవధి ఉన్నందున అటు నరేంద్ర మోదీ, ఇటు కేసీఆర్‌ తమ పరిస్థితిని మెరుగుపర్చుకుంటారా లేక మరింత పరపతి కోల్పోతారా అన్నది ఇప్పుడే చెప్పలేం. అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా బలంగానే కనపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఇందుకు తాజా ఉదాహరణ. ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేయలేదు. పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోలేదు. నాయకులకు తగినంత సమయం ఇచ్చేవారు కాదు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం దగ్గర నుంచి అక్కడ చేపట్టబోయే కార్యక్రమాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయలేదు. ఇలాంటి అనేక కారణాల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత సుడిగాలిలా వ్యాపించి గత ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ కోలుకుని పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబుకు రెండేళ్లు పట్టింది.


జగన్‌.. చెదురుతున్న కల!

నరేంద్ర మోదీ, కేసీఆర్‌తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది భిన్నమైన నేపథ్యం. ప్రారంభంలో వ్యాపారాలకే పరిమితమైన ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంతో పాటు రాజకీయ అరంగేట్రం కూడా చేశారు. తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి పదవిపై మక్కువ పెంచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ససేమిరా అనడంతో సొంతపార్టీ పెట్టుకున్నారు. మధ్యలో ఆర్థికనేరాలకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లారు. అధైర్యపడకుండా బయటకు వచ్చి 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అయినా కుంగిపోకుండా ప్రతిపక్ష నాయకుడిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కలబడి నిలిచారు. ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల మనసు గెలుచుకున్నారు. రాజశేఖరరెడ్డిపై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు జగన్‌కు ఓట్లుగా మారాయి. ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వ్యూహకర్తల సహాయంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంతో పాటు ప్రజల్లో సానుభూతి సంపాదించుకుని తెలుగునాట ఇప్పటివరకూ ఎవరికీ లభించనంతటి ఘన విజయాన్ని జగన్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. చంద్రబాబు తర్వాత రెండవ అతి పిన్నవయస్కుడిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు వయసు మీద పడడంతో జగన్‌ రెడ్డికి సువర్ణావకాశం లభించింది. శాసనసభలో తిరుగులేని మెజారిటీ, ప్రజల్లో అంతులేని ఆదరణ, మరోవైపు బలహీనపడిన తెలుగుదేశం పార్టీ... ఏ నాయకుడికైనా ఇంతకంటే గొప్ప అవకాశం ఏముంటుంది? సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి ఆయనకు లభించిన సదవకాశం ఇది. అయితే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అన్నట్టుగా జనరంజక పాలన అందించవలసిన జగన్‌రెడ్డి కక్షలూ కార్పణ్యాలతో రగలిపోతున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకుపోయే ఆలోచన చేయకుండా కేవలం సంక్షేమం పేరిట డబ్బు పంపిణీకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో అభివృద్ధి సాంతం కుంటుపడి మధ్య తరగతి ప్రజలకు దూరమయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి కొనితెచ్చుకోవడంతో ఆ వర్గాలు కూడా ఆయనకు దూరమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ప్రభుత్వాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయం పెరగడానికి దోహదపడే పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టకుండా ఉన్న పరిశ్రమలకు కూడా తన కక్షపూరిత ఆలోచనలతో పొగబెట్టారు. ఈ చర్యలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారుల్లో ప్రతిష్ఠ కోల్పోయారు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా భావించి వివిధ రాజ్యాంగ వ్యవస్థలపై కత్తి దూశారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పటికీ రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు లోబడే పరిపాలించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించారు. తన చర్యలను తప్పుబట్టిన వారిపై ఎదురుదాడి చేశారు. ఇందుకు న్యాయవ్యవస్థ కూడా మినహాయింపు కాకుండా పోయింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు వంటి కీలక విషయాలలో సాధించింది శూన్యం కావడంతో చెప్పుకోదగిన విజయం ఆయన ఖాతాలో లేకుండా పోయింది. సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ రెండేళ్లు కాలక్షేపం చేశారు. ఏ ప్రచారమైనా అతి అయితే వెగటు పుడుతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ప్రకటించుకున్న షెడ్యూల్‌ ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లోకి మీట నొక్కి డబ్బులు జమ చేయడమే గొప్పగా భావించారు. సంక్షేమ వ్యయం పెరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న మార్గాలపై దృష్టి పెట్టలేదు. ఇటీవలే జిల్లాకలెక్టర్లు, ఇతర అధికారులతో మాట్లాడుతూ ఆదాయం పెంచుకునే అవకాశాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రభుత్వాధినేత పర్యవేక్షణ లేనప్పుడు ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. జగన్‌రెడ్డి ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. ఒక్కరే ఆలోచించుకుని వాటి అమలు బాధ్యత సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తారు. ఇందులో రాష్ర్టాభివృద్ధికి దోహదపడే ఆలోచనలు మచ్చుకు కూడా ఉండవని చెబుతారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం ఎలా? అనే అంశాలపైనే ఆయన ఎక్కువగా ఆలోచిస్తారట. షెడ్యూల్‌ ప్రకారం మీట నొక్కడానికి అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యతను ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణకు అప్పగిస్తుంటారు. దీంతో అప్పుల కోసం అడ్డదారులు తొక్కారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి భవిష్యత్‌ ఆదాయాన్ని కూడా కుదువపెట్టి మరీ అప్పులు చేశారు. ఈ వ్యవహారం ప్రధానమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన మండిపడినట్టు తెలిసింది. మిగతా రాష్ర్టాలు కూడా ఇదేవిధంగా దొడ్డిదారిన అడ్డగోలుగా అప్పులు చేస్తే దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందని ప్రధాని ఆగ్రహించారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అప్పు ఇవ్వడానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన గ్యారంటీ ఇవ్వలేని స్థితి. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు ఇష్టం వచ్చినట్టు రుణసహాయం చేయడం కుదరదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెగేసి చెప్పారు. దీంతో ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మరో రెండు మాసాల తర్వాత సంక్షేమం సంగతి అటుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా సమస్య కాబోతోంది. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి మధ్యలోనే ఎవరో గండికొడుతున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు ఏడాది కాలంగా మద్యం ఆదాయాన్ని ఖజానాకు సక్రమంగా జమ చేయడం లేదన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? చేస్తున్న అప్పులు ఏమవుతున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాలన పూర్తిగా పడకేసినప్పుడే ఇలాంటివి జరుగుతాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడం గురించి విన్నాం. ఇలా ఖజానాకు చేరవలసిన ఆదాయాన్ని మధ్యలో గద్దలు తన్నుకుపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. రాష్ట్రంలో ఏం జరుగుతోందో జగన్‌రెడ్డికి అర్థమవుతోందా? ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అధికారులు తెలంగాణలోని తమ సహచర అధికారులకు ఫోన్‌ చేసి ‘మా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చేయి దాటిపోయింది. మీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?’ అని ఆరా తీస్తున్నారు. కంపెనీలు, కార్పొరేషన్ల పేరిట అప్పులు చేసే పరిస్థితి మాకింకా రాలేదని తెలంగాణ అధికారులు బదులిచ్చారట. ‘ప్రధానమంత్రి ఆగ్రహంగా ఉన్నందున ఇకపై మాకు అప్పు పుట్టదు. మరో రెండు నెలలపాటు బండి నడుస్తుంది. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటో మాకే తెలియదు’ అని ఆంధ్రా అధికారులు ఈ సందర్భంగా నిట్టూర్చారు. రాష్ట్ర పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ పథకం ప్రవేశపెడతారా అని దేశంలోని మిగతా ముఖ్యమంత్రులు ఆసక్తిగా ఏపీ వైపు చూస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పుకోవడం వారికే చెల్లుతుంది. మరోవైపు పదిహేనేళ్ల పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని కుదువ పెట్టి అప్పు చేసిన జగన్‌రెడ్డి 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ, కుటుంబాల్లో సంతోషాన్ని నింపడం కోసం మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. బహుశా జగన్‌రెడ్డి మాత్రమే ఇలా వంచనతో కూడిన ప్రకటనలు చేయగలరేమో తెలియదు. మనం అనుసరించే విధానాలను ఇతర రాష్ర్టాలు నమూనాగా తీసుకునే రోజు రావాలని అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అధికారులను ఉద్దేశించి అన్నారు. ఈ ముక్క చెప్పిన రెండేళ్లకే మిగతా రాష్ర్టాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ బాటలో పయనిస్తే ఎలా? అని ఏకంగా ప్రధానమంత్రి ఆందోళన చెందే పరిస్థితి కల్పించిన ఘనత జగన్‌రెడ్డిదే. రాజధాని అమరావతిని పీక నులిమి చంపేయకుండా అభివృద్ధి చేసి ఉంటే రాష్ర్టానికి ప్రస్తుత ఆర్థిక దుస్థితి వచ్చి ఉండేది కాదు. అమరావతిలో అభివృద్ధి జరిగితే ప్రభుత్వ ఆదాయం పెరిగేది. మరోవైపు అభివృద్ధి చేసిన భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండేది. అలా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను అమలుచేసే వెసులుబాటు జగన్‌రెడ్డికి లభించి ఉండేది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు మోడల్‌ను అనుసరిస్తూనే హైదరాబాద్‌, విశాఖలోని భూములను విక్రయించి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేశారు. ఆయన కుమారుడైన జగన్‌రెడ్డికి ఇటువంటి ఆలోచన రాలేదెందుకో? ఉత్తమ ఆలోచనలు చేయకుండా మొరటుగా వ్యవహరించడం వల్లనే జగన్‌రెడ్డి ప్రతిష్ఠ దిగజారింది. నరేంద్ర మోదీ, కేసీఆర్‌ ఏడేళ్లుగా అధికారంలో ఉన్నారు. వారిపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడటం సహజం. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయింది. ఈ స్వల్ప వ్యవధిలోనే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చి బలహీనపడటం జగన్‌ విషయంలోనే చూస్తున్నాం. జగన్‌రెడ్డి ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని చెప్పడం కూడా సరైంది కాదు. అయితే 2019 ఎన్నికలతో పోల్చితే తాము ఐదు నుంచి పది శాతం ఓట్లు కోల్పోయామని అధికార పార్టీ శాసనసభ్యులు సైతం అంగీకరిస్తున్నారు. అదే నిజమైతే ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న జగన్‌రెడ్డి కల అర్ధంతరంగా చెదిరిపోతుందేమో! కోల్పోతున్న ప్రతిష్ఠను తిరిగి పొందడానికై జగన్‌రెడ్డి విరుగుడు చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నదానిపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more