కారుకూతలు.. రోత నీతులు!

ABN , First Publish Date - 2021-08-29T06:01:01+05:30 IST

మూడుమీడియా సంస్థలపై యుద్ధం చేస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆ మూడు సంస్థలకు స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. మీడియా పైన ఏమి ఖర్మ! ‘మీరు చేస్తున్నది తప్పు...

కారుకూతలు.. రోత నీతులు!

మూడుమీడియా సంస్థలపై యుద్ధం చేస్తున్నాం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆ మూడు సంస్థలకు స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. మీడియా పైన ఏమి ఖర్మ! ‘మీరు చేస్తున్నది తప్పు’ అని చెబుతున్న ప్రతి ఒక్కరి పైనా ప్రతి వ్యవస్థ పైనా ముఖ్యమంత్రి యుద్ధం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్‌ రెడ్డి చెప్పే మాటలు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని మాటలు కొందరి నోటి నుంచి వెలువడితే ముచ్చటగా ఉంటాయి. మరికొందరి నోటి నుంచి వెలువడితే వినడానికే రోతగా ఉంటాయి. తనను తప్పుపడుతున్న మీడియాకు స్వప్రయోజనాలే ఎజెండా అయిందని నిందిస్తున్న ముఖ్యమంత్రి, ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుంది. ‘ఆంధ్రజ్యోతి’ గానీ మరొక మీడియా సంస్థ గానీ తప్పుడు రాతలు రాస్తే కేసు పెట్టడానికి ప్రత్యేకంగా జీవో జారీ చేయించిన జగన్‌రెడ్డి ఇప్పటివరకు నిర్దుష్ట ఆధారాలతో ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు ఎందుకో? చెవిలో జోరీగలాగా మారిన సొంతపార్టీ ఎంపీ రఘురామరాజుపై కక్ష తీర్చుకోవడం కోసం రాజద్రోహం కేసు పెట్టి, పనిలో పనిగా రెండు టీవీ చానళ్లను కూడా నిందితులుగా చేర్పించి సుప్రీంకోర్టుతో తలంటు పోయించుకున్నారు. జగన్‌ సర్కారుపై రోజుకు సగటున 450 కేసులు నమోదవుతున్నాయని పీటీఐ వార్తాసంస్థ శుక్రవారం నాడు ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. తన ప్రభుత్వంపై ఇంత అసాధారణ సంఖ్యలో కేసులు దాఖలు కావడానికి కారణం ఏమిటో జగన్‌రెడ్డి చెప్పగలరా? ఇందులో ఆయన ఆరోపిస్తున్న మీడియా పాత్ర లేదుగా? అధికారులు తరచుగా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవడానికి కారణం జగన్‌రెడ్డి అసంబద్ధ నిర్ణయాలు కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌రెడ్డి మీడియా ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసిందో, ఎలా అవాస్తవ కథనాలను ప్రచురించి ప్రసారం చేసిందో మరచిపోయారా? చంద్రబాబు ప్రభుత్వం ఆరులక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అప్పట్లో నిందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా రుజువు చేయలేకపోయారెందుకు? సొంత ఇంట్లో బాబాయ్‌ హత్యకు గురైతే నారాసుర రక్తచరిత్ర అని రాసుకున్నారు. అదే నిజమైతే చంద్రబాబుపై కేసు పెట్టి లోపలెయ్యలేదు ఎందుకు? విశాఖ ఎయిర్‌పోర్టులో ఎవరో కోడి కత్తితో దాడి చేస్తే చంద్రబాబు చేయించాడని నిందించారు కదా? మరి ఆయనపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ వస్తే ‘కారుమబ్బులు’ అన్న శీర్షికన చెత్తంతా రాసిన విషపత్రిక గతం మర్చిపోతే ఎలా జగన్‌రెడ్డీ? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే కియా కార్ల పరిశ్రమ రాజశేఖర రెడ్డి కారణంగా వచ్చిందని చెప్పుకోవడం లేదా? ఆంధ్రప్రదేశ్‌ పౌరుల డేటాను లోకేష్‌ సన్నిహితుడి కంపెనీ చౌర్యం చేసిందని ఊరూవాడా ఏకం చేశారు కదా? అప్పట్లో మీకు మార్గదర్శిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పి కేసు పెట్టించి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజించే స్టీఫెన్‌ రవీంద్ర అనే పోలీసు అధికారిని విచారణ అధికారిగా నియమించుకున్నారు కదా? మరి ఆ కేసులో పురోగతి ఏమిటో చెప్పరెందుకు? నిజంగా పౌరుల డేటా చౌర్యం జరిగిందో? లేదో? చెప్పాలి కదా! ఇప్పుడు మీరు నిందిస్తున్న మీడియా సంస్థలు, ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్‌’ చానల్‌ ఇలాంటి చెత్త వార్తలను ఎన్నడూ ప్రచురించి, ప్రసారం చేయలేదు కదా! మీడియాను సొంత రాజకీయ ప్రయోజనాలకు అడ్డదిడ్డంగా వాడుకున్న జగన్‌రెడ్డి ఇప్పుడు మాకు నీతులు చెప్పడం రోతగా ఉంది. ఒక మీడియా సంస్థగా మాకున్న పరిమితులు ఏమిటో మాకు తెలుసు. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని కూడా జగన్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయి. చేతిలో సొంత మీడియా ఉండి కూడా 2014లో తాను ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారో జగన్‌రెడ్డి చెబితే బాగుంటుంది. తమరు సెలవిస్తున్నట్టుగా మీడియా సంస్థల సహకారం ఉండి ఉంటే 2019లో చంద్రబాబు ఎందుకు అధికారం కోల్పోయారో చెబుతావా జగన్‌బాబూ? ఎవరినో ముఖ్యమంత్రులను చేసే శక్తే మీడియాకు ఉండి ఉంటే వాటి యజమానులే ముఖ్యమంత్రులు కావొచ్చు కదా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ దుస్థితికి మీడియా కారణం కాదు కదా? ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల  రాష్ట్రం అధోముఖంగా పయనిస్తున్న విషయం నిజం కాదా? రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం ఎవరు? మరో నాలుగు నెలల పాటు కొత్త అప్పులు చేయడానికి వీలు లేదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పడానికి కూడా మీడియానే కారణమా? ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితికి ఎవరు కారణం? పనుల కోసం పోటీ పడే కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడకపోవడానికి కారణం ఎవరు? గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లులు చెల్లించని కారణంగానే తట్టాబుట్టా సర్దుకుంటున్నది నిజం కాదా? జగన్‌ ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్లు సజీవ సాక్ష్యం కాదా? రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలుస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి మీడియా కారణమా? ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత గుర్తుకు వచ్చింది కాబోలు, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్లపై గుంతలు పూడ్చుకుంటున్నారు. వంచనకు కూడా ఒక హద్దు ఉంటుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే గుడ్లు తేలేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీడియాను నిందిస్తే ఏమొస్తుంది? సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని జగన్‌రెడ్డి భావిస్తుండవచ్చు కానీ, ఆ సంక్షేమ పథకాలకు కూడా అప్పులు పుట్టని దుస్థితి దాపురించడం నిజం కాదా? అయినా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అదృష్టవంతుడనే చెప్పాలి. జీతాలు పెంచండి అని ఒక్క ఉద్యోగి కూడా డిమాండ్‌ చేయడం లేదు. ఎందుకంటే, అసలు జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియని స్థితి కదా! రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు అని ఏ మేధావి కూడా ప్రశ్నించడు. ఎందుకంటే అసలు రాజధాని ఏదో తెలియదు కనుక. పెన్షన్లు పెంచాలని ఒక్కరూ అడగరు. ఎందుకంటే ఎవరి పెన్షన్‌ ఎప్పుడు పీకేస్తారో తెలియదు కనుక. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా అని నమ్మబలి కావు కదా! నిజమనుకున్న ప్రజలు 22 మందిని గెలిపించారు. అయినా హోదా గురించి మర్చిపోయిన జగన్‌బాబుకు ఆ విషయం గుర్తు చేయడానికి ఒక్కరు కూడా సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఉన్న ప్రాజెక్టులు, పరిశ్రమలను తరిమికొడుతున్నందున హోదా వచ్చి మాత్రం లాభమేంటి? అని ప్రజలు సర్దిచెప్పుకొంటున్నారు. ఆడపిల్లలకు భద్రత ఎక్కడ? అని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే తన తండ్రిని చంపిన హంతకులను శిక్షించమని మీ సోదరి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి కల్పించారు కదా! మరో చెల్లి, సొంత అన్న తనకు అన్యాయం చేశాడని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేలా పరిస్థితులు కల్పించితిరి కదా! అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ పని ఎందుకు చేయలేదని ఎవరూ అడగరు. ఎందుకంటే మళ్లీ చార్జీలు పెంచుతారేమోనన్న భయం. పెట్రోలు ధరలు పెంచినా ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే చేయడానికి పనులు లేనందున, బయట తిరిగే అవసరం లేనందున పెట్రోల్‌ ధరలు పెంచినా కలిగే నష్టం ఏమిటిలే అని ప్రజలు సర్దిచెప్పుకొంటున్నారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు ఎందుకని ఎవరూ నిలదీయరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడటమే ముఖ్యమైంది కనుక! మద్యం రేట్లు పెంచినప్పుడు మద్యపానాన్ని నియంత్రించడానికే ఆ పని చేశానని ప్రకటనలు జారీ చేసి మరీ చెప్పిన మీ గడసరితనాన్ని గుర్తించిన ప్రజలు ఇప్పుడు రోడ్లు బాగు చేయమని కూడా అడగరు. ఎందుకంటే పెట్రోల్‌ ఆదా కోసం ప్రయాణాలను తగ్గించడానికే రోడ్లు బాగుచేయడం లేదన్న సమాధానం తమరి నోటి నుంచి వస్తుందేమోనన్న భయం. కొన్నిచోట్ల ప్రజల సహకారంతో పోలీసులు శ్రమదానం చేస్తూ రోడ్లను బాగుచేసుకుంటున్నట్టు చూస్తున్నాం. ప్రజల్లో పని సంస్కృతిని పెంచుతున్న జగన్‌రెడ్డిని అభినందించకపోవడం మీడియా తప్పే. ‘ఆంధ్రా వెళుతున్నావా? అక్కడ మందు కొట్టొద్దు, ఏవో చెత్త బ్రాండ్లు అమ్ముతున్నారంట’ అని తమిళనాడు మంత్రి ఒకరు తన మిత్రుడికి సలహా ఇవ్వడాన్ని మన ముఖ్యమంత్రి గొప్పతనంగా కీర్తించలేకపోవడం మీడియా చేస్తున్న మహాపరాధమే మరి! విశ్వవిద్యాలయాల అతిథిగృహాలలో శోభనాలు ఏర్పాటు చేసే సౌలభ్యం జగన్‌రెడ్డి పాలనలోనే సాధ్యమని ప్రచారం చేయలేకపోవడం మీడియా చేస్తున్న నేరమే! ముఖ్యమంత్రి బెయిలు పిటిషన్‌పై తీర్పు వాయిదాపడిన విషయం కూడా చెప్పలేని నిస్సహాయ స్థితికి కట్టడి చేయబడిన మీడియా సరసన నిలబడకపోవడం ‘ఆంధ్రజ్యోతి’తో పాటు మిగతా రెండు సంస్థలూ చేసిన తప్పే! ముఖ్యమంత్రి దుందుడుకు నిర్ణయాల వల్ల న్యాయస్థానాల్లో చీవాట్లు తింటున్న అధికారుల గురించి దాచిపెట్టకుండా ప్రచురించి, ప్రసారం చేయడం నేరమని తెలుసుకోలేకపోవడం అజ్ఞానమే అవుతుంది మరి! ఆ మీడియా సంస్థలు మిమ్మల్ని కూడా వదిలిపెట్టవు అని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఎందుకు వదిలిపెట్టాలి? ముఖ్యమంత్రి వేలెత్తి చూపుతున్న మీడియా సంస్థల ప్రతినిధులు అడిగే ప్రశ్నలు తమకు వినపడవని చెప్పే అధికారులను తయారుచేసుకున్నారుగా! ‘చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు’ అన్నట్టు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తప్పులు ఎత్తిచూపినప్పుడు సరిచేసుకోవాల్సిందిపోయి యుద్ధం ప్రకటించడం వల్ల ఆయనకు పోయేది ఏమీ లేకపోవచ్చును గానీ రాష్ట్రం నాశనం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలు కొట్టివేస్తే వాటిపైనా యుద్ధం ప్రకటించారు. ప్రతిపక్షంతో రోజూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇక మిగిలింది ప్రజలు మాత్రమే. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుకు వారిపైన కూడా యుద్ధం ప్రకటించండి. ఓ పనైపోతుంది!


సమస్యల సుడిలో...

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సందర్భంగా జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాదులు చక్కటి వాదన చేశారు. మా క్లయింట్స్‌ భయపెట్టినట్టు గానీ, ఆ కారణంగా తాము భయపడుతున్నామని గానీ ఒక్కరు కూడా న్యాయస్థానానికి ఫిర్యాదు చేయనప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తి బెయిలు రద్దు చేయాలని కోరడం సమంజసం కాదన్నది ఆ వాదనల సారాంశం. ఈ వాదనలో పస ఉంది. అలా అయితే రాజధానిలో భూముల క్రయవిక్రయాలపై కూడా ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కుంభకోణం జరిగిందంటూ సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎందుకు ఆదేశించారో చెప్పాలి. బెయిలు రద్దు పిటిషన్‌పై చేసిన వాదన రాజధాని విషయంలో కూడా వర్తిస్తుంది కదా? అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని స్పష్టంచేస్తూ.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత కూడా కుంభకోణం కుంభకోణం అని జగన్‌ అండ్‌ కో అరవడంలో ఔచిత్యం కనిపిస్తోందా ఎవరికైనా? పాలకుల ఆలోచనలు ఉన్నతంగా లేనప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. వింత ఆలోచనలు, వికృత పోకడలతో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇబ్బందులను కొనితెచ్చుకోవడమే కాకుండా రాష్ర్టాన్ని అధఃపాతాళానికి తొక్కేస్తున్నారు. జగన్‌రెడ్డికి బెయిల్‌ రద్దు అవుతుందా? లేదా? అన్నది అప్రస్తుతం. కొంతమంది కోరుకుంటున్నట్టు బెయిల్‌ రద్దయినప్పటికీ జైలు నుంచే పరిపాలించే వెసులుబాటు ఆయనకు ఉంటుంది. కాకపోతే హైదరాబాద్‌లోని ఏదో ఒక జైలు ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంగా మారుతుంది. అధికారులు కూడా ఆ జైలు చుట్టుపక్కల ఇళ్లు అద్దెకు తీసుకుని చేతిలో ఫైళ్లతో జైలు నుంచి ముఖ్యమంత్రి జరిపే సమీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా బెయిల్‌ రద్దయినా కాకపోయినా ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదు. జగన్‌రెడ్డికి అసలైన ముప్పు ఈడీ కేసుల విచారణ సందర్భంగా వచ్చే ప్రమాదం ఉంది. సీబీఐ కేసులను ముందుగా విచారించాలన్న జగన్‌ అండ్‌ కో అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈడీ కేసుల విచారణకు, సీబీఐ కేసుల విచారణకు తేడా ఉంటుంది. సీబీఐ కేసుల్లో ముద్దాయిలు నేరం చేశారని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పైనే ఉంటుంది. ఈడీ కేసుల్లో ఇందుకు భిన్నంగా ముద్దాయిలే తాము నేరం చేయలేదని రుజువు చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణంగానే ముందుగా సీబీఐ కేసులను విచారించాలని జగన్‌ అండ్‌ కో పట్టుబడుతోంది. ఈడీ కేసుల విచారణ మొదలైతే రోజువారీ ప్రాతిపదికన విచారణ జరుగుతుంది. అయిదారు నెలల్లోనే విచారణ పూర్తవుతుంది. నిందితులకు శిక్ష పడేదీ లేనిదీ తెలిసిపోతుంది. మనీలాండరింగ్‌ కేసులలో తాము నిర్దోషులమని రుజువు చేసుకోవడం కష్టతరం. ఈ కారణంగానే జగన్‌ అండ్‌ కో ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ఒకవైపు నుంచి కేసుల బెడద– మరోవైపు నుంచి రాష్ర్టాన్ని చుట్టుముడుతున్న అప్పుల ముప్పు ఫలితంగా జగన్‌రెడ్డి భవిష్యత్తు మాత్రమే కాదు, రాష్ట్ర భవిత కూడా పజిల్‌గా మారింది. ఈడీ కేసులలో జగన్‌కు శిక్షపడితే ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోతారు. ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినవారు శిక్షాకాలం పూర్తయిన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఏడెనిమిది కేసులలో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో ఎన్ని కేసులలో జగన్‌ అండ్‌ కోకు శిక్ష పడుతుందో తెలియదు. ఒక్క కేసులోనూ శిక్ష పడకపోవచ్చు కూడా. మొత్తంమీద ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని అన్నివైపుల నుంచీ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితులలో జగన్‌ అండ్‌ కో నమ్ముకునే విశాఖ శారదాపీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఏదైనా యాగమో యజ్ఞమో చేసి రాష్ట్ర పాలకుడినీ, రాష్ర్టాన్నీ ఒడ్డున పడేస్తారేమో వేచిచూద్దాం. కరోనా మొదటి వేవ్‌ వచ్చినప్పుడు కూడా ఆ మహమ్మారిని తరిమికొట్టడానికి యాగం చేస్తున్నట్టు స్వరూపానంద ప్రకటించారు. అయితే కరోనాదే పైచేయి అయింది. ఇప్పుడు తన అనుంగుశిష్యుడు జగన్‌రెడ్డినైనా స్వరూపానంద కాపాడగలరో లేదో! తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అంటారు. అలా కూడా జరగవచ్చు. భవిష్యత్‌ పరిణామాల పట్ల జగన్‌ అండ్‌ కోలో కొందరికి ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగన్‌కు ఇంకా అవగాహన ఏర్పడలేదనుకుంటా. అందుకే ఆయన యుద్ధాలు ప్రకటిస్తున్నారు. మీడియాతో గానీ, న్యాయవ్యవస్థతో గానీ యుద్ధం చేయడం వల్ల నష్టపోయేది ఆయన మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మెలగాలి. న్యాయవ్యవస్థ గానీ, మీడియా గానీ ఇందుకు మినహాయింపు కాదు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మీడియాను కూడా ప్రజలే తిరస్కరిస్తారు. జగన్‌రెడ్డి కూడా ఈ సూక్ష్మం తెలుసుకోవడం మంచిది. 


చేసినా కలసి రాదే...!

ఈ విషయం అలా ఉంచితే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వివిధ పార్టీల నాయకుల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. ప్రత్యర్థులను పరుష పదజాలంతో దూషించడం ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే పరిమితం కాగా, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ వంటివారు కేసీఆర్‌ సరసన చేరారు. మూడు పార్టీల నాయకులూ కత్తులు దూసుకుంటున్నారు. హుజూరాబాద్‌కు జరగనున్న ఉపఎన్నిక కారణంగా ప్రధాన పార్టీల మధ్య పోటీ పెరిగింది. కేసీఆర్‌ ప్రకటించిన దళితబంధు పథకం ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇంతటి భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించి కూడా కేసీఆర్‌ అండ్‌ కో ఆ పథకంపై సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది. మిగతా వర్గాల ప్రజలు తమకు కూడా బంధు అమలుచేయాలని కోరడంతో అన్ని వర్గాలకూ దశలవారీగా ఈ పథకాన్ని అమలుచేస్తానని పార్టీ సమావేశంలో కేసీఆర్‌ చెప్పారు. అయితే ఈ ప్రకటన అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చినప్పటికీ కేసీఆర్‌ సొంత పత్రికలో మాత్రం కనబడలేదు. అంటే కేసీఆర్‌ చేసింది ఉత్తుత్తి ప్రకటనే కావచ్చు. ఏదేమైనా దళితబంధు పథకాన్ని సమర్థించుకోవడం కోసం ప్రభుత్వం హైరానా పడుతోంది. ప్రతిపక్షాలు యథావిధిగా ఇతర వర్గాలను ముందుకు నెడుతున్నాయి. దళితుల కోసం తన మొత్తం రక్తాన్ని ధారపోస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దళితబంధు పథకం మంచిచెడుల విషయం అలా ఉంచితే హుజూరాబాద్‌లోని దళితుల పంట మాత్రం పండింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల దళితుల సంగతి ఏమిటి? అని అంటే వెనకసిరి చూద్దాం అని పాలకులు చెబుతున్నారు. దళితబంధు పథకంపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం అధికార పార్టీకి ఒక రకంగా అపశకునమే. హుజూరాబాద్‌ ఎన్నిక తమ దృష్టిలో చిన్నదని కేటీఆర్‌ చెబుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల గురించే కలవరించడం మరో విధమైన సంకేతం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టు లేవు. ఏం చేసినా వారికి కలసిరావడం లేదు. శారదా పీఠం స్వరూపానంద ఇద్దరికీ ప్రీతిపాత్రమైన స్వామీజీ కనుక ఏదో ఒక తరుణోపాయం ఆలోచించకపోతారా!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-08-29T06:01:01+05:30 IST