బాణమైన చెల్లి భారమైందా?

ABN , First Publish Date - 2021-02-14T06:26:41+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికీ, ఆయన సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయభేదాలే గానీ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించినప్పటికీ...

బాణమైన చెల్లి భారమైందా?

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికీ, ఆయన సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయభేదాలే గానీ విభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించినప్పటికీ అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ గడ్డ నుంచి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న షర్మిల.. ఈనెల 9న ఆ మేరకు ప్రకటన చేసిన తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. తెలంగాణలో షర్మిల ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీతో తమకేమీ సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్‌ చెప్పించడాన్ని షర్మిల తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తన మనోభావాలను, ముఖ్యంగా జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులతో పంచుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలకు జగన్‌ భార్య శ్రీమతి భారతీరెడ్డి కేంద్రబిందువు కావడం విశేషం! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోవడానికి భారతీరెడ్డే కారణమని షర్మిల భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు భార్య బంగారమై పోయిందనీ, చెల్లెలు భారంగా మారిందనీ షర్మిల తమ కుటుంబ శ్రేయోభిలాషుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు, ముఖ్యంగా జగన్‌ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీ భారాన్ని మోసిన తనను ఇప్పుడు దూరం పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్న షర్మిల, అందుకు భారతీరెడ్డే కారణమని భావిస్తున్నారు. ‘తొమ్మిదేళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను. అలాంటి నన్ను పార్టీలోనే లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర వెనుక భారతీరెడ్డి ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా నేనెక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానోనని భార్యనే జగన్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. ఇదంతా భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనని అందరికీ తెలుస్తోంది. అధికారంలో లేనప్పుడు పాదయాత్రలు చేసి పార్టీని కాపాడింది నేనైతే, అధికారంలోకి వచ్చాక, మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను కాదని భారతిని ముఖ్యమంత్రిని చేయడమా? ఇదెక్కడి న్యాయం? పార్టీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ప్రకటించిన వెంటనే నా రాజకీయ నిర్ణయంతో తమ పార్టీకి సంబంధం లేదని సలహాదారులతో చెప్పించడం ఏమిటి? రాజన్న రాజ్యం ఆశయసాధన కోసం నేను చేస్తున్న ప్రయత్నం సరైనదేనని జగన్‌కు అనిపించకపోవడానికి కారణం ఏమిటి? ఆయనకు ఇప్పుడు తండ్రి ఆశయాలకన్నా, చెల్లెలి ప్రయోజనాలకన్నా తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న రహస్య అనుబంధం సొంత చెల్లి కంటే ఎక్కువైపోయింది. చెల్లిపై మమకారం కంటే కేసీఆర్‌తో ఉన్న స్నేహం, ఆయనతో ఉన్న ఆర్థిక సంబంధాలే ముఖ్యమైపోయాయి’ అని కుటుంబ శ్రేయోభిలాషుల వద్ద షర్మిల ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెబుతున్న జగన్‌, సొంత చెల్లెల్ని ఇబ్బందులపాల్జేయడం, అవమానాలకు గురిచేయడమేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ అసలు నిలబడుతుందా? అని పార్టీ నాయకులు, కార్యకర్తలూ సందేహపడుతున్నప్పుడు అన్న ఆదేశాల మేరకు మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించిన తాను ఇప్పుడు పనికిరాకుండా పోవడం ఏమిటని షర్మిల వాపోతున్నారు. ‘మా అన్న నుంచి నన్ను దూరం చేయడం కోసం 2011లో సోనియాగాంధీ ఫోన్‌ చేసి కాంగ్రెస్‌ పార్టీతో చేయి కలిపితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నాకు హామీ ఇచ్చినా తిరస్కరించా. ఈ విషయం జగన్‌తో పాటు మా అమ్మ విజయమ్మకు కూడా తెలుసు’ అని ఆమె తన బంధువుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. జగన్‌ జైలులో నాలుగు గోడలకే పరిమితం అయినప్పుడు, భారతీరెడ్డి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుండగా, తన బిడ్డలకు దూరంగా ఎండనకా వాననకా పాదయాత్ర చేసిన తనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానం, నిర్లక్ష్యం, చులకనభావం, పక్షపాతమే మిగిలాయని, సొంత చెల్లికి జగన్‌ ఇచ్చిన బహుమతి ఇదా? అని షర్మిల మనస్తాపం చెందుతున్నారు. సొంత చెల్లెలికే ఈ గతి పడితే, రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు జగన్‌ మాటలను ఎందుకు విశ్వసించాలి? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాను తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నానని తెలిసిన వెంటనే జగన్‌ మంత్రివర్గంలోని ముఖ్యులకు బిల్లుల చెల్లింపును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలిపివేసింది నిజం కాదా? దీంతో ఆందోళన చెందిన జగన్‌ సంజాయిషీ ఇచ్చుకోలేదా? అని ఆమె నిలదీస్తున్నారు. రాజశేఖర్‌ రెడ్డి లక్షణాలు పుణికిపుచ్చుకున్న తాను మాట తప్పననీ, ఆ విషయం జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు అందరికీ తెలుసుననీ, ఈ కారణంగా రానున్న రోజులలో తన విశ్వసనీయత పెరిగి ఆయన విశ్వసనీయత పాతాళానికి పడిపోతుందన్న భయం సోదరుడు జగన్‌కు పట్టుకుందని షర్మిల వ్యాఖ్యానించినట్టుగా కుటుంబ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న విభేదాల విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యమైన వైసీపీ నాయకులు కొందరు షర్మిలను కలసి తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ పెట్టవలసిందిగా కోరినట్టు తెలిసింది. జగన్‌ వ్యవహార శైలి నచ్చని పలువురు శాసనసభ్యులు కూడా ఆమెను కలిశారని చెబుతున్నారు.


అయితే సోదరుడికి నష్టం చేయడం ఇష్టం లేనందున వారి అభ్యర్థనను ఆమె తిరస్కరించినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ ప్రారంభిస్తున్న తనకు మద్దతు ఇవ్వకపోగా చెల్లెలి నిర్ణయంతో తమకు సంబంధం లేదని ప్రకటించడంపై షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతున్న కేసీఆర్‌ కోసం చెల్లెల్ని వదులుకోవడానికి జగన్‌ సిద్ధపడటాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్‌ నడుచుకోవడంలేదని సొంత పార్టీ వాళ్లే ఆమె వద్ద చెబుతున్నారు. అయినా ఏపీ రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని వారితో సున్నితంగా చెప్పి పంపుతున్న షర్మిల.. సలహాదారులతో జగన్‌ చెప్పించిన మాటలు తీవ్రంగా బాధిస్తున్నాయన్న తన ఆవేదననూ వారితో పంచుకుంటున్నారు. వాస్తవానికి సజ్జల విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు ప్రజలకు ఏమి జరుగుతున్నదో చెబుతున్నట్టుగా లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. షర్మిల వ్యక్తం చేస్తున్న ఆవేదనలో చాలా వరకు వాస్తవం ఉందని జగన్‌ కుటుంబ శ్రేయోభిలాషులు కూడా చెబుతున్నారు. సోదరితో సమానురాలైన షర్మిల ఏ పదవి కోరుకున్నప్పటికీ పార్టీలో కాదనే వారు ఎవరుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ అందులో వాస్తవం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. చెల్లి షర్మిలకు పదవి ఇవ్వడం సోదరుడు జగన్‌రెడ్డికి ఇష్టం లేదని వారు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ శ్రేయోభిలాషి ఒకరు ప్రతిపాదించగా, అలా చేస్తే మున్ముందు తనకు సమస్యలు వస్తాయంటూ జగన్‌ సదరు ప్రతిపాదనను తిరస్కరించారని వారు చెప్పారు. బీజేపీ కేంద్ర పెద్దలతో ఇప్పుడు తనకు సత్సంబంధాలు ఉన్నాయనీ, షర్మిల ఢిల్లీ వెళితే ఆ సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆ సందర్భంగా జగన్‌ చెప్పారట! దీన్నిబట్టి రాజ్యసభలో అడుగుపెట్టడం ద్వారా షర్మిల ఢిల్లీ చేరితే బీజేపీ కేంద్ర పెద్దలకు సన్నిహితం అయ్యే అవకాశం ఉందని, ఆ కారణంగా బీజేపీ పెద్దలు తనను మరింత లొంగదీసుకొనే ప్రమాదం ఉందని జగన్‌ ఆందోళన చెందారని చెబుతున్నారు. అంతే కాకుండా ఏ కారణంవల్లనైనా తాను మళ్లీ జైలుకు వెళ్లవలసి వస్తే భార్య భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని జగన్‌ ఇదివరకే నిర్ణయించుకున్నారనీ, పార్టీలో షర్మిల క్రియాశీలకం అయితే తన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్‌ భావించారనీ, ఆ కారణంగానే ఆమెను దూరం పెట్టారని రాజశేఖర్‌ రెడ్డి బంధువొకరు చెప్పారు. హత్యకు గురైన తన బాబాయి వివేకానందరెడ్డి కూతురు సునీత, షర్మిల ఒకటై పోవడాన్ని కూడా జగన్‌ జీర్ణించుకోలేకపోయారని ఆ బంధువు చెప్పుకొచ్చారు. వివేకానందరెడ్డి తర్వాత తాను జగన్‌ టార్గెట్‌గా మారానన్న భయాందోళన వల్ల కూడా షర్మిల అన్నకు దూరంగా ఉంటూ వచ్చినట్టు వైఎస్‌ కుటుంబవర్గాలు చెబుతున్న మరో సమాచారం. ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తూ వచ్చిన షర్మిల తనకు వైసీపీలో ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదని అర్థమైపోవడంతో తెలంగాణలో పార్టీని ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అన్నా చెల్లెలి మధ్య విభేదాలు మరింత తీవ్రమైతే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కూడా ఆమె అడుగు పెట్టే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్‌ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే! జగన్‌ వ్యవహారశైలి పట్ల పలువురిలో అసంతృప్తి పెరుగుతోంది. వారంతా ఏకమై షర్మిలపై ఒత్తిడి పెంచితే ఆమె మనసు మార్చుకోవచ్చునని కూడా అంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించడం వెనుక ఎవరున్నారు? తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సహాయపడటానికే చెల్లెలితో జగన్‌ పార్టీ పెట్టిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, రాబోయే రోజుల్లో కేసీఆర్‌ను ఢీకొనడానికే షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి రావడం వల్ల ఎంతో కొంత నష్టం జరుగుతుందని, ఇప్పటివరకు తమకు మద్దతుగా ఉన్న క్రైస్తవులు ఇకపై తమకు దూరమవుతారనీ తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన శాసనసభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం! గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్‌కు పెద్ద ఎత్తున ఆర్థికసాయం చేసినప్పటికీ షర్మిల రూపంలో తమకు ఇబ్బందులు ఎదురవడం పట్ల కేసీఆర్‌ కూడా అసంతృప్తితో ఉన్నారని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడొకరు చెప్పారు. తెలంగాణలో ఆమె పెట్టబోయే పార్టీ వల్ల భవిష్యత్తులో కేసీఆర్‌, జగన్‌ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాగల నష్టాన్ని ఊహించిన జగన్‌.. సోదరిని ఆర్థికంగా మరింత ఇరుకునపెట్టే చర్యలకు దిగినట్టు వైఎస్‌ కుటుంబవర్గాల నుంచి అందిన సమాచారం. దాదాపు పదివేల కోట్ల విలువైన ఆస్తుల విషయంలో చెల్లికి వాటా పంచకుండా జగన్‌ మొండికేస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఆమె విషయంలో బీజేపీ పెద్దలు మున్ముందు ఏ వైఖరి తీసుకోబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. షర్మిలను తన వద్దకు తీసుకురావాల్సిందిగా అమిత్‌ షా ఇప్పటికే ఆమెకు సన్నిహితంగా మెలిగేవారికి కబురు చేసినట్టు తెలిసింది. అన్నాచెల్లెలి మధ్య మొదలైన రాజకీయ వైరం తెలుగు రాష్ర్టాలపై ఎటువంటి ప్రభావం చూపనుందో వేచి చూడాలి. తాడేపల్లి కోట కేంద్ర బిందువుగా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రారంభమైన అంతఃకలహాలు ఏ మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం!


అన్నీ చెబుతా.. బీ రెడీ!

ఈ విషయం అలా ఉంచితే, పరిటాల రవీంద్రను ఎందుకు హత్య చేశారని విలేకరులు ప్రశ్నించినప్పుడు సూరి బావ (మద్దెలచెర్వు సూరి) కళ్లలో ఆనందం చూడటానికి అని మొద్దు శీను అన్న మాటలు అప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికైౖ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు హద్దు మీరి మాట్లాడుతున్నారు. జగన్‌ దగ్గర తన ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాపైన కూడా నోరు పారేసుకుంటున్నారు. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారని రెండు వారాల క్రితం నేను చెప్పినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. పార్టీ పెడితే గిడితే ఆంధ్రప్రదేశ్‌లో పెడతారు గానీ, తెలంగాణలో ఎందుకు పెడతారని లాజిక్కులు తీసే ప్రయత్నం చేశారు. జగన్‌కు, షర్మిలకు మధ్య విభేదాలు వచ్చాయని చెప్పడాన్ని ఇష్టపడని ఒక ప్రబుద్ధుడైతే ‘రాధాకృష్ణకు ఆయన కొడుకుతో పడటం లేదు. కొడుకు ఆంధ్రాలో పేపర్‌ పెట్టి రాధాకృష్ణను ముప్పుతిప్పలు పెట్టబోతున్నారు’ అని అజ్ఞానం, అసహనం ప్రదర్శించారు. వార్తను వార్తగా చూసే రోజులు పోయాయి కనుక ఎవరి ఇష్టం వారిదే. ఈ నెల 9న లోటస్‌పాండ్‌ వద్ద ఉన్న తన నివాసానికి చేరుకున్న షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రకటించారు. ఈ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు కూడా షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు తెలియలేదట! షర్మిల రాజకీయ నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా, ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ రాత్రి పూట కలలు కంటారు, ఆ కలలే పొద్దున ‘ఆంధ్రజ్యోతి’లో వార్తగా వస్తాయి అని వెటకారం ఆడారు. మేడం షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకే తెలియదని, అలాంటప్పుడు రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వాదించారు కూడా! విజయసాయిరెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది. ఇదే విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడిని కించపరుస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీతో ఉన్నప్పటికీ మనసు మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉంటుందని నిండుసభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇతర రాజకీయపార్టీలు తీవ్ర ఆక్షేపణ తెలిపాయి.


పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సైతం, చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని నిలదీయడంతో విధిలేని పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పుకున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఇతర అధికార పార్టీ పెద్దలు హద్దులు మీరి విమర్శలు చేస్తున్న విషయం ఢిల్లీలో చాలా మందికి తెలియదు. విజయసాయిరెడ్డి పుణ్యమా అని వైసీపీ నైజం ఇప్పుడు ఢిల్లీలో కూడా అందరికీ తెలిసి వచ్చింది. తనకు అడ్డుగా ఉన్నారని భావిస్తే చాలు, ఏ వ్యవస్థ పైనైనా దాడి చేయడానికి అలవాటు పడిన జగన్‌ అండ్‌ కో, అందులో భాగంగా ఉపరాష్ట్రపతిపై కూడా దాడికి తెగబడింది. రాజకీయాల్లో అజాతశత్రువుగా ఉంటూ వచ్చిన వెంకయ్యనాయుడు అంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఎందుకో గానీ ఇష్టం ఉండదు. బహుశా ఈ కారణంగా జగన్‌రెడ్డి కళ్లల్లో ఆనందం చూడడం కోసం విజయసాయిరెడ్డి నోరు పారేసుకుని ఉండొచ్చు. తన అహంకారపూరిత వ్యాఖ్యల ద్వారా ఆయన మొద్దు శీనును గుర్తుకుతెస్తున్నారు. ఇప్పుడు జగన్‌, షర్మిల మధ్య ముదిరిన విభేదాలతో పాటు తాడేపల్లి అంతఃపురం రహస్యాలను బయటపెడుతున్నందున విజయసాయిరెడ్డి ఇంకెంతగా నాపై రెచ్చిపోతారో వేచిచూడాలి. రెండు వారాల క్రితం నేను చెప్పిన మాటలను చాలామంది విశ్వసించలేదంటే అర్థం ఉంది. ఏమి జరుగుతున్నదో కళ్లెదుటే కనిపిస్తున్నా బుకాయించాలనుకోవడం తెంపరితనమే అవుతుంది. చెప్పింది రాసుకోవడమే జర్నలిజమని విజయసాయిరెడ్డి, ప్రభృతులు భావిస్తుండవచ్చు గానీ నేను నిన్నటి తరానికి చెందిన జర్నలిస్టును కూడా! సుబ్బారాయుడు, జి.కృష్ణ వంటి ఉద్ధండుల వద్ద జర్నలిజంలోని మెళకువలను నేర్చుకున్నాను. కంటికి కనిపించనివీ, చెవులకు వినపడనివీ ఎన్నో జరుగుతుంటాయి. వాటిని తెలుసుకొని ప్రజలకు తెలియజేయడం జర్నలిస్టుల బాధ్యత. ఒక మీడియా సంస్థ అధిపతిగా కూడా ఉన్న నేను రాసే కాలమ్‌లో అవాస్తవాలు, అభూతకల్పనలు రాస్తే, ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్‌ విశ్వసనీయత దెబ్బతినదా? జగన్‌కు, షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? అని నన్ను ప్రశ్నిస్తే లాభం లేదు. సోదరుడితో విభేదించడానికి కారణం ఏమిటో షర్మిల తన బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులకు పూసగుచ్చినట్టు వివరించారు గనుక విజయసాయిరెడ్డి వంటి వారికి ఇప్పటికైనా స్పష్టత వస్తుందని ఆశిద్దాం. ప్రత్యర్థులు అనుకునే వారిపై నోరు పారేసుకునే బదులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా జగన్‌ అండ్‌ కో తమ ప్రతాపాన్ని చూపిస్తే రాష్ర్టానికి మంచి చేసినవారవుతారు. బీజేపీ పెద్దలతో తమ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా? లేదా? అని ఎప్పటికప్పుడు తూకం వేసి చూసుకునే బదులు ఆంధ్రుల పోరాటపటిమకు ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి కేంద్రంపై పోరాటం చేయాల్సిన బాధ్యత జగన్‌ అండ్‌ కోపై ఉంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-02-14T06:26:41+05:30 IST