ఎవరీ సుబ్రమణ్యం?

ABN , First Publish Date - 2021-03-14T06:26:44+05:30 IST

‘అరె ఓ సాంబా, అబ్‌ ఆయేగా మజా..!’ షోలే సినిమాలోని ఈ డైలాగ్‌ను విననివారు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో హిందీ భాష పెద్దగా తెలియని దక్షిణాది వారు...

ఎవరీ సుబ్రమణ్యం?

‘అరె ఓ సాంబా, అబ్‌ ఆయేగా మజా..!’ షోలే సినిమాలోని ఈ డైలాగ్‌ను విననివారు లేరంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో హిందీ భాష పెద్దగా తెలియని దక్షిణాది వారు కూడా ఈ డైలాగ్‌ విని ఆనందించారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని ఉద్దేశించి ఇప్పుడు ఇదే డైలాగ్‌ చెప్పాలని నాకు కూడా అనిపిస్తోంది. మూడు రోజుల క్రితం ఢిల్లీ నుంచి మందీ మార్బలంతో ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న సుబ్రమణ్య స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వార్త ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి‘ పత్రికపై వంద కోట్లకు దావా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన ఏ హోదాలో పరువునష్టం దావా వేస్తున్నారో స్పష్టంచేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ దావా వేయడానికి ఆయన న్యాయవాది కూడా కారే! న్యాయశాస్త్రంలో ఆయనకు డిగ్రీ కూడా లేదు. దేశంలోని ఏ బార్‌ అసోసియేషన్‌లో కూడా ఆయన సభ్యుడు కాదు. అయినా ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సుబ్రమణ్య స్వామి అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సొంత మీడియాలోనూ, జగన్‌కు మద్దతుగా పనిచేసే వెబ్‌సైట్స్‌లోనూ ప్రచారం చేశారు. నిజానికి సుబ్రమణ్య స్వామి న్యాయవాది కాదన్న విషయం చాలా మందికి తెలియదు. దేశంలోని కొంతమంది అవినీతిపరులైన రాజకీయ నాయకులపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చెయ్యడం ద్వారా సుబ్రమణ్య స్వామి ప్రాచుర్యం పొందారు. సుబ్రమణ్య స్వామి బయట ఉంటే ప్రమాదమన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బీజేపీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అవినీతి ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన కేసుతో పాటు 2జి కేసు ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక గణాంక శాస్త్రంలో పట్టా పొందిన ఆయన మేధావి కూడా! అయితే ఆయన తన తెలివితేటలను దేశాభివృద్ధికి ఉపయోగించిన దాఖలాలు లేవు. రాజకీయ నాయకుల బలహీనతలను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకోవడానికే ఆయన ప్రాధాన్యంఇస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు చెన్నైలో తనకు నివాస స్థలం ఇప్పించవలసిందిగా ఆమెకు సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖుడిని కోరారు. ‘‘నేను బ్రాహ్మణుడిని. జయలలిత కూడా బ్రాహ్మణురాలే! నాకు దేశంలో ఎక్కడా ఇంటి స్థలం లేదు. జయలలితకు నచ్చజెప్పి చెన్నైలో స్థలం ఇప్పించండి’’ అని సుబ్రమణ్య స్వామి ఆ ప్రముఖుడిని కోరారు. స్వామి అభ్యర్థనను ఆ ప్రముఖుడు జయలలిత వద్ద ప్రస్తావించగా, ‘‘ఇంకెవరికోసం అడిగినా చేద్దును. సుబ్రమణ్య స్వామికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి స్థలం ఇచ్చేది లేదు’’ అని జయలలిత స్పష్టంచేశారట! ఆ తర్వాత కొంత కాలానికి జయలలితపై అవినీతి ఆరోపణలు చేస్తూ సుబ్రమణ్య స్వామి కేసు వేశారు. అటల్‌ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వామిని రాజ్యసభకు ఎందుకు పంపిస్తున్నారని ఒక విలేకరి ప్రశ్నించగా, ‘కొంత మంది లోపల ఉంటేనే మంచిది’ అని వాజపేయి నర్మగర్భంగా బదులిచ్చారు. క్లుప్తంగా సుబ్రమణ్య స్వామి నేపథ్యం ఇది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. బీజేపీ అధిష్ఠానం ఆయనను మళ్లీ రాజ్యసభకు నామినేట్‌ చేయకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆయనకు ఆశాదీపంలా కనిపించి ఉంటారని అంటున్నారు. ముఖేశ్‌ అంబానీ అడిగిన వెంటనే పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటిచ్చిన జగన్‌రెడ్డిని సంతోషపెడితే తనకు కూడా రాజ్యసభ సీటు ఇస్తాడన్న ఆశతో కాబోలు సుబ్రమణ్య స్వామి తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రచారమే నిజమైతే, ఏ కారణం వల్లనైనా జగన్‌రెడ్డి రాజ్యసభ సీటు నిరాకరిస్తే ఇదే సుబ్రమణ్య స్వామి ఆయనపై కేసులు వేసినా ఆశ్చర్యపోవల్సింది లేదని స్వామి గురించి ఎరిగిన వారు చెబుతున్నారు. 


ఏమా మిస్టరీ?

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం! ఐదారుగురిని వెంటబెట్టుకుని ప్రత్యేక విమానంలో తిరుపతి వచ్చిన సుబ్రమణ్య స్వామి తన గురించి కొంతసేపు గొప్పగా చెప్పుకోవడంతో పాటు ‘ఆంధ్రజ్యోతి’ని నిందిస్తూ కొన్ని విమర్శలు చేశారు. ప్రభుత్వ అజమాయిషీ నుంచి దేవాలయాలను తప్పించడం కోసం తాను పోరాటం చేస్తున్నానని, తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలను కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయించే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చొరవను అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి టీటీడీ ఖాతాలను ఆడిట్‌ చేయడానికి కాగ్‌ నిరాకరించింది. టీటీడీ ప్రభుత్వ విభాగం కానందున తాము ఆడిట్‌ చేయలేమని తేల్చిచెప్పింది. అయినా ఇప్పటికే కాగ్‌ ద్వారా ఆడిట్‌ చేయిస్తున్నట్టు స్వామి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. విలేకరుల సమావేశంలో కొంత మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, ‘లా గురించి నాకే చెబుతారా?‘ అంటూ కన్నెర్ర చేశారు. ఆయన అసలు న్యాయవాదే కాదన్న విషయం తెలియక కాబోలు, విలేకరులు కూడా గమ్మున ఉండిపోయారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ‘ఏసయ్య‘ అన్న పదం ప్రత్యక్షం కావడంపై ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనాన్ని పదిహేను మాసాల క్రితం ప్రచురించింది. ఎవరో చేసిన పొరపాటు వల్ల అలా జరిగిందని ఆ తర్వాత టీటీడీ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. అయినా ‘ఆంధ్రజ్యోతి’పై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఒక న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసు కూడా జారీ చేయించారు. దానికి మేం సమాధానం ఇచ్చాం. బహుశా మా సమాధానంతో సంతృప్తి చెందని సుబ్బారెడ్డి అండ్‌ కో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించి ఉండవచ్చు. తప్పు కూడా లేదు. అది వారి హక్కు. అయితే ఇందులో సుబ్రమణ్య స్వామి పాత్ర ఏమిటి? అన్నదే ఇప్పుడు ప్రశ్న. టీటీడీ తరఫున కోర్టులో వాదించడానికి ఆయన న్యాయవాది కాదు. ఎవరో దాఖలు చేసిన కేసులో న్యాయవాది కాని వారు వాదించడానికి కోర్టు అనుమతించదు. టీటీడీకి వ్యతిరేకంగా వస్తున్న కథనాలు బాలాజీ భక్తుడినైన తనను బాధించాయని సుబ్రమణ్య స్వామి ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ కారణంగా ఆయన వ్యక్తిగత హోదాలో కేసు దాఖలు చేయడానికి కూడా లేదు. అదే అంశంపై టీటీడీ అప్పటికే కేసు దాఖలు చేసినందున మరో కేసు వేయడానికి థర్డ్‌ పార్టీకి అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, సొంతంగా కేసు వేసే పక్షంలో టీటీడీకి వంద కోట్లు కట్టాలని అడగడానికి నువ్వు ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దేవస్థానం తరఫున వాదించడానికి అర్హత లేదు. విడిగా కేసు వేయడానికి లోకస్‌స్టాండీ ఉండదు. ప్లీడర్‌ కాకపోయినా ప్లీడర్‌గా చలామణి అవుతున్న సుబ్రమణ్య స్వామికి ఈ విషయం తెలియదా? ఈ మొత్తం వ్యవహారంలో సమాధానం లభించవలసిన మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రావడానికి అయిన ఖర్చును సుబ్రమణ్య స్వామి స్వంతంగా పెట్టుకున్నారా లేక తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టుకుందా? లేక జగన్‌రెడ్డి సదరు విమానాన్ని ఏర్పాటు చేశారా? మొదలైన ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. బాలాజీ భక్తుడనని చెప్పుకొంటున్న స్వామి రెండు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తిరుపతి వచ్చి కూడా శ్రీవారిని దర్శించుకోకుండా అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దర్శనం చేసుకొని, ఆయన ఏర్పాటు చేసిన వేడి వేడి భోజనం చేయడంలో ఆంతర్యం ఏమిటన్నది కూడా తేలవలసి ఉంది. కేసులు దాఖలు చేసే వారి ఆంతర్యాన్ని కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వాడుకోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం గతంలో అనేకమార్లు తప్పుబట్టింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో ఢిల్లీ హైకోర్టు కూడా స్వామిని తప్పుబట్టింది. పిల్స్‌ స్పెషలిస్ట్‌ అయిన మీకు పూర్తి వివరాలు అందించాలని తెలియదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వరస్వామికి కానుకగా లభించిన పింక్‌ డైమండ్‌ మాయమైందని ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అప్పట్లో చాలా హడావిడి చేశారు. దీనిపై అప్పుడు ఇదే సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, హైకోర్టుకు వెళ్లకుండా మా వద్దకు ఎందుకు వచ్చారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. కారణం తెలియదు గానీ ఇప్పుడు సుబ్రమణ్య స్వామి పింక్‌ డైమండ్‌ ఊసెత్తడం లేదు. అప్పుడు పింక్‌ డైమండ్‌ పోయిందని ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులుపై దేవస్థానం పాలక మండలి వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది. ఇప్పుడు ఆ దావాను ఉపసంహరించుకొనే ప్రయత్నం చేయగా కోర్టు అభ్యంతరం చెప్పింది. ఒక పత్రికపై దావా వేయడానికి సుబ్రమణ్య స్వామి అండ్‌ కో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రావడం వెనుక ఉన్న మిస్టరీ కూడా తెలియవలసి ఉంది. స్వామి అండ్‌ కోకు టీటీడీ ఎంత ఫీజు చెల్లించబోతున్నదన్నది కూడా తేలాల్సి ఉంది.


మేమే వేస్తాం దావా!

ఏది ఏమైనా సుబ్రమణ్య స్వామి లేదా టీటీడీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును మేం కోర్టులోనే తేల్చుకుంటాం. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ప్రచురించిన వార్త వల్ల వెంకటేశ్వర స్వామి పరువుకు భంగం కలిగిందా? లేక వైవీ సుబ్బారెడ్డి అండ్‌ కోకు పరువు నష్టం జరిగిందా? అన్నది కూడా తేల్చవలసి ఉంది. సుబ్రమణ్య స్వామి వంటి వారిని చూసి రాజకీయ నాయకులు, ముఖ్యంగా అవినీతిపరులు భయపడితే భయపడవచ్చు గానీ మాకు ఆ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులకు ఆశపడి టీటీడీకి వ్యతిరేకంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురిస్తోందని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు స్వామిపై మేం కూడా పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత మొత్తానికి దావా వేసేదీ మా న్యాయవాదులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తలకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటో రుజువు చేయాల్సిన బాధ్యత సుబ్రమణ్య స్వామిపైనే ఉంటుంది. కేవలం స్వామిని మాత్రమే కాదు, ‘ఆంధ్ర  జ్యోతి’కి, చంద్రబాబుకు ముడిపెట్టి నోరు పారేసుకుంటున్న వారందరినీ, పిచ్చి రాతలు రాసే వారందరినీ కూడా ఇకపై కోర్టు మెట్లు ఎక్కించాలని నిర్ణయించుకున్నాం. జగన్‌ రెడ్డిని సంతృప్తిపరచడం ద్వారా రాజ్యసభకు నామినేట్‌ కావాలనే అభిప్రాయం సుబ్రమణ్య స్వామికి ఉందో లేదో తెలియదు గానీ అదే నిజమైతే ‘ఆంధ్రజ్యోతి’కి దురుద్దేశాలు ఆపాదించిన నేరానికి ఆయన శిక్ష అనుభవించవలసి రావచ్చు. లిటిగెంట్‌ పొలిటీషియన్‌గా పేరొందిన సుబ్రమణ్య స్వామి జోలికి వెళ్లడానికి చాలా మంది జంకుతూ ఉండవచ్చు. మాకు అలా జంకాల్సిన అవసరం లేదు. ‘ఆంధ్రజ్యోతి’పై బురద చల్లడం ద్వారా సుబ్రమణ్య స్వామికి మళ్లీ రాజ్యసభ సభ్వత్వం లభిస్తే అందుకు పరోక్షంగా కారణం అవుతున్న మాకు కూడా గర్వకారణమే! అయితే ఈ పెడధోరణులకు అడ్డుకట్ట వేయాలని మేం నిర్ణయించుకున్నాం. అందుకే ‘అరే ఓ సుబ్రమణ్య స్వామీ! అబ్‌ ఆయేగా మజా!!’ అని చెబుతున్నాం. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను వేధించడానికి సుబ్రమణ్య స్వామి వంటి వారిని ఆశ్రయించే స్వేచ్ఛ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ఉంది. మాకు వ్యతిరేకంగా కేసులు వేయడానికి ఢిల్లీ నుంచి ఎంతమంది న్యాయవాదులనైనా ప్రత్యేక విమానాలలో రప్పించుకోవచ్చు. మీ ధనబలం, అధికార బలం చూసి న్యాయస్థానాలలో న్యాయం లభించకుండా పోదు. అలా అయితే జగన్‌రెడ్డిపై విచారణలో ఉన్న అవినీతి కేసులను న్యాయస్థానాలు ఎప్పుడో కొట్టివేసి ఉండేవి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ‘ఆంధ్రజ్యోతి’ని ఎన్ని రకాలుగా వేధించాలో, నష్టం చేయాలో అన్ని రకాలుగా చేస్తున్న జగన్‌ రెడ్డి ఇంకేం చేయగలరు? అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన సొంత పత్రికకు దాదాపు 200 కోట్ల రూపాయల మేర ప్రకటనలు జారీ చేయించిన జగన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి ఒక్క ప్రకటన కూడా ఇవ్వకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రకటనలు నిలిపివేయడంతో పాటు మా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం లేదు. మమ్మల్ని.. ముఖ్యంగా నన్ను కేసులలో ఇరికించి జైలుకు పంపాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రికి మేం అటువంటి అవకాశం ఇవ్వడం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించే ప్రతి వార్తనూ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న మీదటే ప్రచురణకు అనుమతిస్తున్నాం. దీంతో దిక్కు తోచని జగన్‌రెడ్డి ఢిల్లీలో ఉండే సుబ్రమణ్య స్వామిని ఆశ్రయించి ఉండవచ్చు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి యూపీఏ ప్రభుత్వ వేధింపుల నుంచి తనను కాపాడుకోవడానికై సుబ్రమణ్య స్వామి, ప్రశాంత్‌ భూషణ్‌, రాం జెఠ్మలానీ వంటి వారి సేవలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక వీరిలో ఒక్కరిని కూడా ఆయన దగ్గరకు తీసుకోకపోవడం గమనార్హం. బహుశా జగన్‌రెడ్డి కూడా సుబ్రమణ్య స్వామి వంటి వారిని పక్కన పెట్టుకోవడం మంచిది అనుకున్నారేమో తెలియదు. అధికార బలంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్‌ ప్రసారాలను బంద్‌ చేయించిన జగన్‌రెడ్డి అంతకు మించి ఏమి చేయగలరు? గతంలో రాజశేఖర్‌ రెడ్డి కూడా ఇలాగే వేధించి చివరకు అలసిపోయారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్‌ రెడ్డి అండ్‌ కోకు ఏదో ఒక రోజు పరాభవం తప్పదు. యజమాని చల్లే మేతకు అలవాటుపడే పావురాలు ఎగరడం మర్చిపోతాయి. ప్రభుత్వాలు వెదజల్లే రాయితీలకు అలవాటుపడిన ప్రజలు ఎదగడం మర్చిపోతారు. గుడ్లగూబ పగలు చూడలేదు. కోడి రాత్రిపూట చూడలేదు. ఓటును అమ్ముకొనే ప్రజలు ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని చూడలేరు అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంటుండేవారు. ‘నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, అమ్ముకొని బానిసలవుతారో ప్రజల చేతుల్లోనే ఉంది’ అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏదో ఒక రోజు ఆ మహనీయుల మాటలను తెలుసుకుంటారు. జరుగుతున్న అనర్థాన్ని గ్రహించకపోరు. అంతవరకు ప్రజల తరఫున మేం అక్షరాయుధాలను సంధిస్తూనే ఉంటాం. పరువు నష్టం దావాలు మా సంకల్పాన్ని నిలువరించలేవు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి అలవాటుపడిన పాలకులు, వాటినే నిజాలుగా మీడియా ప్రచారం చేయాలని కోరుకుంటారు. అయితే అది కుదరని పని! పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రి అమిత్‌ షాను కలిసి వినతిపత్రం ఇచ్చినట్టుగా జగన్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి అలాంటి వినతిపత్రం ఏదీ ఇవ్వలేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జగన్‌రెడ్డి అండ్‌ కో దీనికి ఏం సమాధానం చెబుతారు? విశాఖ ఉక్కును విక్రయించే విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముందే చెప్పామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెప్పారు. అప్పటివరకూ ఆ విషయం తనకు తెలియదంటూ చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజీపడే నాయకుల నిజ స్వరూపాన్ని ప్రజలు ఇవాళ కాకపోతే రేపు గ్రహిస్తారు. ప్రజలు మౌనంగా ఉండిపోవడం వల్ల రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోతున్నాయి. ప్రశ్నించే గొంతులను కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రస్తుతానికి బాధితులు మనకు తెలిసిన వారు కాకపోవచ్చు. రేపు మన వంతు రావొచ్చు. ఎమర్జెన్సీనే ప్రతిఘటించిన చరిత్ర మనది. తప్పును ఎత్తి చూపుతున్న మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కోట్లాది రూపాయాల ప్రజా ధనం వెచ్చించి ఎంత మంది లాయర్లనైనా పెట్టుకోండి. మా మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు. నైతిక బలం మా వైపు ఉన్నందునే సుబ్రమణ్య స్వామిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నాం. అంతేకాదు, దేవుడితో వ్యాపారం చేస్తున్నవారి బండారం కూడా బయటపెడతాం. టీటీడీ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా చైర్మన్‌ వైపీ సుబ్బారెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూలు తీసుకొని ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియాల్సి ఉంది. బాలాజీ భక్తుడినని చెప్పుకొనే సుబ్రమణ్య స్వామి నిజంగా దేవుడిని నమ్మేదీ లేనిదీ తెలియదు గానీ, దైవానికి మాత్రమే మేం తలవంచుతాం. స్వర్గీయ ఎన్టీఆర్‌ కూడా తాను దేవుడికి మాత్రమే భయపడతానని అనేవారు! అత్యంత బలవంతులైన ఇందిరాగాంధీని ఎదిరిస్తున్నారు భయం లేదా? అని ప్రశ్నించినప్పుడు, ‘నేను ఎవరికీ భయపడను. ఒక్క దేవుడికి తప్ప!’ అని ఎన్టీఆర్‌ అప్పట్లో చెప్పారు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-03-14T06:26:44+05:30 IST