అడ్డదారులు... ఎదురుదాడులు

ABN , First Publish Date - 2021-12-12T05:47:00+05:30 IST

కేంద్రంపై యుద్ధం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట వరసకైనా అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కనీసం నోరు కూడా విప్పడం లేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసహాయం చేసేది లేదని కరాఖండీగా చెప్పినా...

అడ్డదారులు... ఎదురుదాడులు

కేంద్రంపై యుద్ధం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట వరసకైనా అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కనీసం నోరు కూడా విప్పడం లేదు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు ఆర్థికసహాయం చేసేది లేదని కరాఖండీగా చెప్పినా, విశాఖ రైల్వే జోన్‌ గురించి మరచిపోమంటున్నా జగనన్‌రెడ్డికి మాట పెగలడం లేదు. ప్రత్యేక హోదా పోతే పోయింది ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారుగా అదన్నా ఇవ్వండి అని కూడా అడగడం లేదు. ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు అప్పులపై ఆధారపడుతున్నందున అదనపు అప్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే చాలు మహాప్రభో అని కేంద్రప్రభుత్వాన్ని వేడుకోవడానికే జగన్‌ ప్రభుత్వం పరిమితమైంది. ఈ బలహీనతను గమనించిన కేంద్రపెద్దలు విభజనచట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన వాటి విషయంలో కూడా మొహం చాటేస్తున్నారు. గతంలో మంజూరు చేసిన వివిధ సంస్థల పురోగతిపై కూడా సమీక్షించే తీరిక ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ కుదేలైనందున వనరుల సమీకరణపైనే ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొమ్ము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలంటూ ఓటీఎస్‌ పథకం తీసుకురావడం ఇందులో భాగమే. పేదల పేరు చెప్పి ప్రైవేటు లేఅవుట్లలో ఐదు శాతం స్థలానికి సమాన విలువ చెల్లించాలన్న స్కీం మరొకటి. ఎవరికీ తట్టని ఈ ఆలోచనలు, పథకాలు మరెన్ని తెర మీదకు వస్తాయో చూడాలి. సొంత ఆదాయం, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై ముఖ్యమంత్రికి ఉన్న శ్రద్ధ ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఉండటం లేదు. ఈ కారణంగానే ఆయా నిర్ణయాలపై న్యాయస్థానంలో విచారణ మొదలవగానే ‘చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం. జీవోను ఉపసంహరించుకుంటున్నాం’ అని ప్రభుత్వం చెప్పుకొంటోంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నామని కొద్ది రోజుల క్రితం హైకోర్టుకు చెప్పిన జగన్‌ ప్రభుత్వం, తాజాగా గ్రామ సచివాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులను పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవోపై కూడా పునఃపరిశీలన చేస్తున్నామని చెప్పుకోవలసి వచ్చింది. న్యాయసమీక్షకు నిలబడని నిర్ణయాలను తీసుకోవడం, వాటిని కోర్టులో సవాలు చేయగానే ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. అధికారులు కూడా ఇలాంటి అసంబద్ధ జీవోలను ఎలా జారీ చేస్తున్నారో తెలియదు. హైకోర్టు ఇప్పటికైనా నోట్‌ ఫైల్‌ను తెప్పించుకుని అధికారులు తమ అభ్యంతరాలను రికార్డు చేశారో లేదో పరిశీలిస్తే గానీ పరిస్థితిలో మార్పు రాదు. పాలనావ్యవస్థను లోపభూయిష్టంగా మార్చిన జగన్‌రెడ్డి తన తప్పులను సరిదిద్దుకునే బదులు న్యాయ వ్యవస్థను నిందించే ప్రయత్నాలను ఇప్పటికీ విరమించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇందుకోసం ఎవరెవరినో వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో విశ్వసనీయత కలిగిన కొందరు అవగాహనాలోపంతో జగన్‌రెడ్డి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని కార్నర్‌ చేస్తున్నదని మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. కులవివక్ష నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ సుబ్రమణ్యం శ్రీరామ్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం గమనార్హం. ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకున్న బిల్లు, జీఓను న్యాయమూర్తిగా తాను ఆమోదించగలరో లేదో జస్టిస్‌ చంద్రు చెబితే బాగుంటుంది. ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తరచుగా ఎందుకు తప్పుబడుతున్నదో లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది. తాము చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని గ్రహించిన జగన్‌ భక్తులు కొందరు పూర్వ పరిచయాలతో పొరుగురాష్ర్టాలకు చెందిన జస్టిస్‌ చంద్రు వంటి వారిని ఆహ్వానించి వారికి తప్పుడు సమాచారం ఇచ్చి జగన్‌కు అనుకూలంగా మాట్లాడిస్తున్నారు. జస్టిస్‌ చంద్రు వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో చాలామందికి తెలియకపోవచ్చు గానీ న్యాయవ్యవస్థలో ఉన్నవారికి తెలుసు.


నీలి మూక.. రోత ప్రచారం!

అవసరాన్ని బట్టి ఎదురుదాడికి దిగడం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు వారి దృష్టి మళ్లించడానికి సీఐడీ అధికారులను ప్రయోగించడం జగన్‌రెడ్డికి పరిపాటి అయింది. ఓటీఎస్‌ పథకంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఆ పథకం స్వచ్ఛందమే అని ఒకవైపు చెబుతూ మరోవైపు వలంటీర్లకు టార్గెట్లు పెట్టారు. తమ ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఎవరూ కోరకుండానే పెనాల్టీలు కడితే రిజిస్ర్టేషన్లు చేస్తామనడం పేదలను పీడించడమే అవుతుంది. ప్రభుత్వం ఎంతగా వివరణ ఇస్తున్నప్పటికీ పేదల ఆగ్రహం చల్లారలేదు. దీంతో వాళ్ల దృష్టి మళ్లించడం కోసం కొన్ని మాసాల క్రితం నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును శుక్రవారం తెర మీదకు తెచ్చారు. ఎంపిక చేసిన ఇద్దరు ముగ్గురు ఇళ్లలో సోదాలు జరిపించి వారిని అరెస్టు చేయించే ప్రయత్నం చేశారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జగన్‌రెడ్డి రోత మీడియాలో నాపై కూడా దుష్ప్రచారం చేశారు. సీఐడీ అధికారులను నేను అడ్డుకున్నట్టుగా చెత్త ప్రచారం చేశారు. లక్ష్మీనారాయణ నాకు దశాబ్దాలుగా స్నేహితుడు. అతని ఇల్లు మా ఇంటికి అతి సమీపంలో ఉంటుంది. ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఉంటుంది కనుక అధికారులు అనుమతిస్తే లక్ష్మీనారాయణను పలకరించి ధైర్యం చెబుదామని వెళ్లాను. నేను వెళ్లేసరికి గేటుకు లోపల నుంచి పోలీసులు గెడ వేశారు. అప్పుడే బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ నన్ను చూసి లోపలకు ఆహ్వానించారు. అక్కడున్న పోలీసులు కూడా సరే అనడంతో నేను ఇంట్లోకి వెళ్లాను. అయితే అప్పటికే అక్కడ గుమికూడి ఉన్న కొందరు వ్యక్తులు సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగగా వారిని నేను గట్టిగా మందలించాను. దీంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. నేను వెళ్లే సమయానికే సోదాలు పూర్తి చేసిన అధికారులు పంచనామా ప్రారంభించారు. ఆ దశలో గేటు వద్ద ఉన్న కొంతమంది మళ్లీ నినాదాలు చేయగా వారందరినీ అక్కడ నుంచి పంపేయాలని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు సూచించాను. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్‌ అక్కడికి రాగానే గేటు వెలుపల నుంచే వెళ్లిపోవాలని సూచించాను. ఇదంతా అరగంట పాటు సాగింది. అప్పుడు నేను తిరిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా ‘మీరు వచ్చిన తర్వాత మా పని సులువవుతోంది. పంచనామా పూర్తయ్యేవరకు దయచేసి ఇక్కడే ఉండండి’ అని సీఐడీ అధికారులు కోరారు. పంచనామా పూర్తయిందని వారు ప్రకటించగానే నేను వెళ్లిపోయాను. నేను అక్కడ ఉన్నప్పుడే రోత మీడియాలో జరిగిన ప్రచారం మా దృష్టికి రాగా ‘మీ విజ్ఞప్తి మేరకే నేను ఇక్కడ ఉన్నాను అని కూడా పంచనామాలో పేర్కొనండి’ అని సీఐడీ అధికారులతో సరదాగా వ్యాఖ్యానించాను. జరిగింది ఇది కాగా, అధికారులను నేను అడ్డుకున్నానని నీలిమీడియా, నీలిమూక ప్రచారం చేసింది. నన్ను వేధించడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్న జగన్మోహన్‌ రెడ్డి నిజంగానే నేను అధికారులను అడ్డుకుని ఉంటే నాపై కేసు పెట్టించి అరెస్టు చేయించకుండా ఉంటాడా? ఆయనకు అటువంటి అవకాశం నేను మాత్రం ఎందుకు ఇస్తాను? అధికారులను అడ్డుకుని ఉంటే లక్ష్మీనారాయణ కంటే ముందే నన్ను అరెస్టు చేయకుండా ఉంటారా? అయినా నీతీ రీతీ లేని రోతమీడియా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తోంది. మురికికాలువలో దొర్లే వారికి ఇతరులు శుభ్రంగా ఉండటం నచ్చదు. తులసివనంలో గంజాయి మొక్కలా దాపురించిన జగన్‌ మీడియా కూడా ఇదేవిధంగా భావించి వ్యవహరిస్తోంది. వారికి వంతపాడటానికి పేటీఎం బ్యాచ్‌ ఉండనే ఉంటుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న మిత్రుడిని పలకరించడమే నేరమైతే తీవ్రమైన ఆర్థికనేరాలకు సంబంధించిన అభియోగాలపై జైలుకు కూడా వెళ్లిన జగన్‌రెడ్డిని జైలుకు వెళ్లి మరీ కలిసినవారు నేరం చేసినట్టు కాదా? జగన్‌పై ఉన్న కేసులు ఇప్పుడు తుది విచారణకు వస్తున్నాయి. ఈ కారణంగా ఆయనను ఇప్పుడు ఎవరు కలసినా నిందితుడితో చేతులు కలిపినట్టేనా? జగన్‌ చేసిన నేరాల్లో భాగస్వామ్యం ఉన్నట్టేనా? మన ఖర్మకొద్దీ రాష్ట్రంలో కొన్ని పత్రికలు ఉన్నాయని జగన్‌రెడ్డి  అప్పుడప్పుడూ మమ్మల్ని తిడుతుంటారు. నిజానికి రాష్ట్రప్రజల ఖర్మకొద్దీ ఆయన మీడియా దాపురించింది!


బుస్‌... తుస్‌...

ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ‘ఢిల్లీలో అగ్గి పెడతా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ పార్టీ సరిగా ఎత్తిచూపలేకపోతోంది. ఇకపై నేనే వారంలో రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసి మోదీ ప్రభుత్వాన్ని ఎండగడతాను. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కాదా?’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని రోజుల క్రితం తీవ్ర విమర్శలు, హెచ్చరికలు చేశారు. అసలే చలికాలం. ఆపైన కేసీఆర్‌ హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గజగజ వణికిపోతారని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి తోవలో మంత్రులు, శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ విమర్శలు చేశారు. అంతకుముందు కేసీఆర్‌ మాట్లాడుతూ, ఇకపై తానే స్వయంగా విలేకరుల సమావేశాలను ప్రతి రోజూ నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తానని కూడా చెప్పారు. కేంద్రప్రభుత్వంపై అంతలా విరుచుకుపడినా రాష్ట్రంలో వరి పండించిన రైతుల గోస తీరలేదు. పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు రైతుల కన్నీళ్లు తుడవలేదు. పార్లమెంటు ఉభయసభల్లో నాలుగైదు రోజుల పాటు హడావిడి చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆర్భాటపు ప్రకటనలు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదు. అంతకుముందు వరి రైతులు పండించే ప్రతి గింజనూ రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇదే ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తరఫున రాష్ట్రప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం కేంద్రం కొనడం లేదని నిందను బీజేపీ ప్రభుత్వం పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేసీఆర్‌ చెప్పినట్టు ఢిల్లీలో అగ్గి పుట్టలేదు గానీ రాష్ట్రంలో అధికారపార్టీ, బీజేపీ నాయకుల మధ్య అగ్గి పుట్టి పరుష పదజాలంతో దూషించుకున్నారు. రైతుల సమస్యకు పరిష్కారం లభించకపోగా రాజకీయాలు మాత్రం జోరందుకున్నాయి. నిజానికి వరి రైతుల సమస్యను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పరిష్కరించాలి. ఆత్మస్తుతి, పరనిందతో ప్రభుత్వాలు కాలక్షేపం చేస్తున్నందున పంట కల్లాలకే పరిమితమైంది. యాసంగిలో వరి పండిస్తే రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. అలా అని రాష్ట్రప్రభుత్వం ముందుగానే ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదు. దాహం వేసినప్పుడే బావి తవ్వినట్టుగా కేసీఆర్‌ ప్రకటనలు ఉంటాయి. 


నిజానికి కేసీఆర్‌ ఆలోచనలు కొన్ని బాగానే ఉంటాయి. అయితే ఆచరణలోకి రాకపోవడం వల్ల కేసీఆర్‌ ప్రకటనలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. గతంలో ప్రాంతాలవారీగా ఏయే పంటలు పండించాలి? ఎవరు ఎప్పుడు పంటను మార్కెట్‌కు తీసుకురావాలో సూచించి అమలుచేయడానికి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. కొన్ని నెలలపాటు కసరత్తు చేసిన మీదట ఈ ప్రకటన చేయడమే కాకుండా ఆ తర్వాత కూడా రోజుల తరబడి దీనిపైనే మాట్లాడేవారు. రాష్ట్రస్థాయి రైతు సమితి కన్వీనర్‌గా విద్యావేత్త పల్లా రాజేశ్వర రెడ్డిని నియమించి హడావిడి చేశారు. జిల్లాస్థాయి, మండలస్థాయి సమితుల ఏర్పాటు విషయం మరచిపోయారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే ఇప్పుడు వరి రైతులకు ఈ గోస ఉండేది కాదు. ఆలోచనలకు, ఆచరణకు పొంతన లేకపోవడంతో ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోయారు. రెండేళ్లుగా వర్షాలు పుష్కలంగా పడుతున్నందున వరి పడించే విస్తీర్ణం పెరిగింది. దీంతో కేంద్రప్రభుత్వం నిర్దేశించిన కోటాను మించి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రకటించిన లక్ష్యం మేరకు రైతు సమన్వయ సమితులు ఏర్పడి పనిచేసి ఉంటే ప్రస్తుత దుస్థితి వచ్చేది కాదు. రైతులకు కనీస అవగాహన కల్పించకుండా ఉన్నపళంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటే ఎలా? అన్న ఆలోచన కేసీఆర్‌ ప్రభుత్వానికి రాలేదు. నిందను కేంద్రంపైకి తోసి చేతులు దులుపుకోవాలనుకుంటోంది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. పంటకు ఏ సీజన్‌లో డిమాండ్‌ ఉంటుందో ముందుగానే అంచనా వేసి రైతులకు తెలియజెప్పాలి. ఏదైనా ఒక పంటకు ఒక ఏడాది మంచి ధర పలికితే మరుసటి సంవత్సరం రైతులు అదే పంట వేయడానికి ఉత్సాహపడతారు. ఇది రైతుల సైకాలజీ. ప్రభుత్వాలు ఇక్కడే చొరవ తీసుకోవాలి. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలంటే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించి భరోసా కల్పించాలి. ఏయే జిల్లాల్లో వరి పంట వేయాలి? ఆరుతడి పంట వేయాలి? వాణిజ్య పంటలు వేయాలి? వంటి విషయాలపై వ్యవసాయశాఖ వద్ద కనీస ప్రణాళిక లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు. ఈ విషయం విస్మరించి సమస్య ముంచుకు వచ్చేసరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. వరి సమస్య రాజకీయం అయిపోవడంతో రైతులకు మోక్షం లభించడం లేదు. ఎవరూ కోరకుండానే రైతుబంధు పథకం ప్రకటించి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియదు. ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయాలో నాలుగు దశాబ్దాల క్రితం వ్యవసాయ అధికారులు సూచించేవారు. ఇప్పుడు అలాంటిది జరగడం లేదు. సమస్యకు పరిష్కారం తమ చేతిలో లేదనుకున్నప్పుడు రాజకీయాలను తెర మీదకు తీసుకురావడం కేసీఆర్‌కు అలవాటే. ఈ క్రమంలో భీకర ప్రకటనలు చేస్తుంటారు. కొంతకాలం క్రితం దేశాన్ని ఉద్ధరించడానికి తానే నడుం బిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ దేశాన్ని పాలించిన పార్టీలు నీటి వనరులు సద్వినియోగం చేసుకోలేదని, అభివృద్ధి చేయలేకపోయాయని నిందించారు. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో పాటు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభృతులను కలసి వచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఇక యుద్ధమే అని ప్రకటించారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌ షాలను కలసివచ్చారు. అప్పటివరకు చేసిన ప్రకటనలు అన్నింటినీ మరచిపోయారు. బీజేపీని ఎక్కువగా విమర్శించవద్దని పార్టీ నాయకులకు సూచించారు కూడా. దీంతో ఢిల్లీలో ఏం జరిగి ఉంటుందా అని ఎవరికి వారు ఊహాగానాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి తాను భర్తరఫ్‌ చేసిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌ నుంచి మళ్లీ గెలుపొందడంతో ఢిల్లీలో అగ్గి పుట్టించడం వంటి ప్రకటనలను కేసీఆర్‌ జనంలోకి వదలడం మళ్లీ మొదలెట్టారు. 


వరి ధాన్యం సమస్యపై కేసీఆర్‌ చేసిన ప్రకటనలు అన్నింటినీ ఈ కోణంలోనే చూడాలి. తామేమీ తక్కువ తినలేదంటూ బీజేపీ నాయకులు కూడా కేసీఆర్‌పై దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనను జైలుకు పంపడం ఖాయమని హెచ్చరికలు కూడా చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య పోరు కేంద్రీకృతమైంది. కాంగ్రెస్‌ పార్టీని తక్కువ చేసి చూపడానికి కేసీఆర్‌ ఈ ఎత్తుగడ వేశారేమో తెలియదు! వరి సమస్యపై మందీమార్బలంతో ఢిల్లీ వెళ్లి నాలుగు రోజుల పాటు మకాం వేసిన కేసీఆర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోకుండా, కేంద్రం నుంచి నిర్దుష్ట హామీలేవీ పొందకుండానే ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. ఇదంతా గమనిస్తున్న వారు మాత్రం కేంద్రంలోని బీజేపీ పెద్దలను చూస్తే కేసీఆర్‌కు వణుకు అని గుసగుసలాడుతున్నారు. ఇలా భావించడానికి హేతుబద్ధత లేకపోలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న వివిధ నిర్ణయాలు, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగిందన్న విషయాన్ని కేంద్రంలోని పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టడానికి అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకటి రెండు విషయాలలో కేసీఆర్‌ స్వయంగా నిర్ణయం తీసుకుని ఫైలుపై సంతకం చేశారు. దీంతో కేసీఆర్‌ను ఇరికించవచ్చునని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని భోగట్టా. నేరుగా కేసీఆర్‌ జోలికి వెళ్లే కంటే, ముందుగా ఆర్థిక వ్యవహారాల్లో ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొంత మందిపై కేంద్ర ఏజెన్సీలు నిఘా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే నిజమైతే ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ త్వరలో రంగంలోకి దిగుతాయని భావించవచ్చు. ఇటువంటి లొసుగుల కారణంగానే కేంద్రంపై పోరాడే విషయంలో కేసీఆర్‌ ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు వేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్‌ విశ్వసనీయత ప్రజల్లో పలుచన అయినందున వచ్చే ఏడాది ఆయనను మరింత చికాకు పెట్టడానికి బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ జెండా ఎగురవేయాలని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. ‘ఇందుకోసం ఎంత దూరమైనా వెళతాం-. తెలంగాణలో మా పరిస్థితి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు’ అన్నట్టుగా ఉందని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా మూలాలు ఉన్నవారితో పాటు ఖమ్మం జిల్లా ఓటర్లను ఆకర్షించడానికి కూడా బీజేపీ ప్రత్యేక వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని తెలంగాణకు చెందిన కొంతమంది ముఖ్యులు ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. బహుశా అందుకే కాబోలు బీజేపీ ఎత్తుగడలను పసిగట్టిన కేసీఆర్‌ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుబంధు పథకం అమల్లో ఉన్నప్పటికీ రైతులు మాత్రం కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల అంత సానుకూలంగా లేరు. కేంద్రాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎవరు ఎవరిని నిందించుకున్నా రైతాంగం సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ప్రధానంగా ఉంటుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి రైతాంగం సమస్యే ప్రధానం అవుతుంది. ఈ దిశగా ఆలోచించకుండా సచివాలయ నూతన భవన నిర్మాణం పనులను పరిశీలించడం వంటి చర్యల వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. భారీగా, విలాసవంతంగా నిర్మించిన ప్రగతిభవన్‌, నిర్మాణంలో ఉన్న సచివాలయానికి వందల కోట్లు ఖర్చు చేయడం వల్ల కేసీఆర్‌కు ఆత్మసంతృప్తి మిగిలితే మిగులుతుంది కానీ ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. సచివాలయ భవనం దేశానికి గర్వకారణం కావాలని కేసీఆర్‌ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించుకునే సచివాలయం దేశానికి ఎందుకు గర్వకారణం అవుతుంది? సచివాలయం పర్యాటక ప్రదేశం కాదు గదా?

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more