పాలన పగ... ప్రభుత్వం దగా!

ABN , First Publish Date - 2021-12-19T05:38:52+05:30 IST

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో జగన్‌రెడ్డి కోసం ఆందోళన చేస్తున్నవారు చెప్పగలరా? హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు మూసీనది ఒడ్డున పాతబస్తీ వైపు ఉంది....

పాలన పగ... ప్రభుత్వం దగా!

విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో జగన్‌రెడ్డి కోసం ఆందోళన చేస్తున్నవారు చెప్పగలరా? హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు మూసీనది ఒడ్డున పాతబస్తీ వైపు ఉంది. అక్కడ అభివృద్ధి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? హైదరాబాద్‌లో సచివాలయం ఉన్న ప్రాంతంలో గతంలో ఉండే హోటళ్లు, ఇతర సంస్థలు ఇప్పుడు మూతపడ్డాయి. హైదరాబాద్‌లో అభివృద్ధి అంతా సైబరాబాద్‌లో కేంద్రీకృతం అవుతోంది. బడా వ్యాపారసంస్థలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువుదీరడమే ఇందుకు కారణం. ఈ వాస్తవాన్ని మరుగుపరచి, ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సులువు గనుక ప్రభుత్వపెద్దలు ఆ పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి నిజంగా మూడు రాజధానులను అభివృద్ధి చేయాలని ఉంటే... తన వద్ద ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్పాలి. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యను పరిష్కరించకుండా మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా?


వేతనాల పెంపు విషయంలో ఉద్యోగ సంఘాల నాయకులను భయపెట్టి లొంగదీసుకోవాలని అనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రజలను ఇంకెంతోకాలం భయపెట్టలేమన్న వాస్తవాన్ని గుర్తించినట్టున్నారు. ఈ కారణంగానే ప్రాంతీయ విద్వేషాలను రగిలించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. అమరావతిని మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోని జగన్‌రెడ్డి ఇప్పుడు మహాపాదయాత్ర తర్వాత ఉలిక్కిపడుతున్నట్టుగా ఉంది. ఈ కారణంగానే ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ‘అమరావతిలో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకరించడం కుదరదు, రాష్ట్రప్రజలంతా చెల్లించే పన్నులతో అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలి?’ అంటూ మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ఎవరి డబ్బులూ అవసరం లేదు. అభివృద్ధి చేసిన భూములను అమ్మితే చాలు, కావలసినంత డబ్బు సమకూరుతుందని తెలిసి కూడా తెలియనట్టుగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లడంతో, ‘మా ప్రాంతం పరిస్థితి ఏమిటి?’ అని రాయలసీమ, ఉత్తరాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు.


‘మారాష్ట్ర ఆర్థికపరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. కేంద్రప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి సహాయం చేయని పక్షంలో ఆర్థికసంక్షోభం నుంచి కోలుకోలేదు’ అని లోక్‌సభలో వైసీపీ నాయకుడు మిథున్‌ రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని వేడుకున్నారు. అప్పుల భారం పెరిగిపోయి రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదని ఆర్థికనిపుణులు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దుస్థితిని లోక్‌సభలోనే అధికార పార్టీ నాయకుడు ఏకరువు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం ఎవరంటే... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే అని చెప్పాల్సి ఉంటుంది. సంక్షేమం పేరుతో అలవికాని హామీలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌రెడ్డి... ఇప్పుడు కేంద్రప్రభుత్వాన్ని దేబిరించడం వల్ల ఫలితం ఉండదు.


పథకాల పేరిట ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు పంచి పెడుతూ, కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి అని వేడుకున్నంత మాత్రాన కేంద్రప్రభుత్వం మాత్రం లెక్కాపత్రం లేకుండా ఎందుకు సహాయం చేస్తుంది? ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లనే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకే రాష్ర్టానికి ఈ దుస్థితి కల్పించిన జగన్‌రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? జరుగుతున్నదంతా పరిశీలిస్తున్న వారిలో... ఆయన అధికారంలోకి రావాలనుకున్నది ఎందుకు? వచ్చిన తర్వాత చేస్తున్నది ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ‘జగన్‌రెడ్డికి పరిపాలించడం, అభివృద్ధి చేయడం చేతకాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే అధికారంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు’ అని భావించాల్సి ఉంటుంది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పంచిపెడుతూ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అధికారం ఎందుకయ్యా అంటే ప్రత్యర్థులపై తనలో పేరుకుపోయిన ద్వేషాగ్నిని చల్లార్చుకోవడం కోసమే అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతోంది.


రాష్ట్రం దివాలా తీసినా ఫర్వాలేదు... తాను మాత్రం అధికారంలో ఉండాలన్నదే జగన్‌రెడ్డి అజెండాగా ఉంది. ఒక వ్యక్తి అహం సంతృప్తి పడటానికి రాష్ట్ర భవిష్యత్తు బలి కావాల్సిందేనా? అన్నదే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. భయపెడుతూ పరిపాలించడానికి అలవాటు పడిన జగన్‌రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికై ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడానికి కేంద్రప్రభుత్వ అనుమతి కోరుతున్న ముఖ్యమంత్రి... రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో మాత్రం చెప్పడం లేదు.


జనం కళ్లకు ‘మూడు’ గంతలు

బ్రహ్మపదార్థం వంటి ఆర్థిక వ్యవహారాలను ప్రజలు ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. జగన్‌రెడ్డి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థికపరిస్థితి గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇది గమనించిన జగన్‌ అండ్‌ కో ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రగిలించడానికై స్కెచ్‌ వేస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వం... ఆందోళనలకు పిలుపునిచ్చిన నాయకులను నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ నాయకులు లొంగిపోయినా సాధారణ ఉద్యోగుల్లో అసంతృప్తి చల్లారదు.


ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించకూడదని షరతు విధించడం ఉద్యోగసంఘాల బలహీనతకు అద్దం పడుతోంది. సమస్య పరిష్కారమైనా అవకపోయినా ముఖ్యమంత్రిని నేరుగా కలిసిన తర్వాత సంతృప్తి చెందాల్సిందేనని ఉద్యోగసంఘాల నాయకులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో ఉద్యోగుల నాయకులు ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రిని కలుసుకోగలిగేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని కలుసుకునే అవకాశం కల్పించడమే ఘనకార్యం అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు భావిస్తున్నారు.


వేతనాల పెంపు విషయంలో నాయకులను భయపెట్టి లొంగదీసుకోవాలని అనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రజలను ఇంకెంతోకాలం భయపెట్టలేమన్న వాస్తవాన్ని గుర్తించినట్టున్నారు. ఈ కారణంగానే ప్రాంతీయ విద్వేషాలను రగిలించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. అమరావతిని మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోని జగన్‌రెడ్డి ఇప్పుడు మహాపాదయాత్ర తర్వాత ఉలిక్కిపడుతున్నట్టుగా ఉంది. ఈ కారణంగానే ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ‘అమరావతిలో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకరించడం కుదరదు, రాష్ట్రప్రజలంతా చెల్లించే పన్నులతో అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలి?’ అంటూ మంత్రులతో ప్రకటనలు చేయిస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ఎవరి డబ్బులూ అవసరం లేదు. అభివృద్ధి చేసిన భూములను అమ్మితే చాలు, కావలసినంత డబ్బు సమకూరుతుందని తెలిసి కూడా తెలియనట్టుగా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లడంతో, ‘మా ప్రాంతం పరిస్థితి ఏమిటి?’ అని రాయలసీమ, ఉత్తరాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. సైగ చేయగానే నడుం బిగించడానికి సిద్ధంగా ఉండే కొంతమంది మేధావులను రంగంలోకి దించుతున్నారు.


‘అమరావతి వద్దు - మూడు రాజధానులు ముద్దు’ అని నినాదాలు చేయిస్తున్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే చాలు రాయలసీమ అంతా అభివృద్ధి చెందుతుందని ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజానికి రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ముందుగా సాగునీటి వసతులు పెంచాలి. ఆర్భాటంగా ప్రకటించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పురిట్లోనే ఆగిపోయింది. ఈ పథకాన్ని చేపట్టడానికి వీల్లేదని జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ శుక్రవారం నాడు తేల్చి చెప్పింది. రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే మేధావులకు ఈ అంశం పట్టదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి పెళ్లిళ్లకు హాజరై విందు ఆరగిస్తున్న జగన్‌రెడ్డి ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం మాత్రం చేయరు. రాయలసీమ మేధావులు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రిని ప్రశ్నించరు.


ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీటివనరులు ఉండాలి. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావాలి. అవేవీ లేకుండా కేవలం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదు. ఒక్క కియా పరిశ్రమ రావడం వల్ల అనంతపురం జిల్లాలో కొంతభాగం అభివృద్ధి చెందుతోంది. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతోంది. రాయలసీమలో అభివృద్ధికి సంబంధించి ఒక్క ప్రతిపాదన కూడా పురుడు పోసుకోలేదు. కొత్తగా ఒక్క పరిశ్రమకు కూడా శంకుస్థాపన జరగలేదు.


ఏది వికేంద్రీకరణ?

అయిదేళ్ల క్రితం అన్ని రాజకీయపార్టీలూ అంగీకరించి నిర్మాణాలను కూడా ప్రారంభించిన రాజధాని అమరావతిని వివాదాస్పదం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే మూడు రాజధానులు ఉండాలనే ఆచరణసాధ్యం కాని విధానాన్ని తెరమీదకు తెచ్చారు. దీంతో ఎప్పుడో సర్దుబాటైన సమస్యను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో జగన్‌రెడ్డి కోసం ఆందోళన చేస్తున్నవారు చెప్పగలరా? హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు మూసీనది ఒడ్డున పాతబస్తీ వైపు ఉంది. అక్కడ అభివృద్ధి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? హైదరాబాద్‌లో సచివాలయం ఉన్న ప్రాంతంలో గతంలో ఉండే హోటళ్లు, ఇతర సంస్థలు ఇప్పుడు మూతపడ్డాయి.


హైదరాబాద్‌లో అభివృద్ధి అంతా సైబరాబాద్‌లో కేంద్రీకృతం అవుతోంది. బడా వ్యాపారసంస్థలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కొలువుదీరడమే ఇందుకు కారణం. ఈ వాస్తవాన్ని మరుగుపరచి, ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సులువు గనుక ప్రభుత్వపెద్దలు ఆ పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి నిజంగా మూడు రాజధానులను అభివృద్ధి చేయాలని ఉంటే... తన వద్ద ఉన్న కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్పాలి. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యను పరిష్కరించకుండా మూడు రాజధానుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదన్న విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అందుకే కాబోలు, వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన పెళ్లికి హాజరవగా, తెలంగాణ మిత్రుడొకరు ‘మీ మూడు రాజధానుల ముచ్చట ఎక్కడి వరకు వచ్చింది’ అని ప్రశ్నించాడు. ‘మా ముఖానికి ఒక రాజధానే లేదు! మూడు రాజధానులు కూడానా!’ అని ఆ ఎమ్మెల్యే నిట్టూర్చారు.


రెండున్నరేళ్లలో ఏం సాధించారు?

అభివృద్ధి చేయాలన్నా, మరిన్ని అప్పులు చేయాలన్నా జగన్‌రెడ్డికి మిగిలింది రెండేళ్ల వ్యవధి మాత్రమే! రెండున్నరేళ్లలో ఫలానా ప్రాంతంలో ఫలానా అభివృద్ధి చేశామని జగన్‌రెడ్డి అండ్‌ కో చెప్పగలరా? రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు దాటింది. ఏపీ గవర్నర్‌ దంపతులకు కరోనా సోకితే ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించాల్సిన దుస్థితి. జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ర్టాలలో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ర్టాలకు కనీసం రాజధానులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు అది కూడా లేదు. మరోవైపు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారో, సోకాల్డ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేస్తారో జగన్‌ బృందం చెప్పాలి.


కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌లో మెరుగైన వైద్యసౌకర్యాలు కల్పించడానికి కూడా జగన్‌రెడ్డికి తీరిక లేదు. విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారంటూ తమ ప్రాంతంలో కూడా ఉద్యమానికి శ్రీకారం చుడతామని మంత్రి అప్పలరాజు ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, అభివృద్ధి చేయాల్సిన వాళ్లు ఉద్యమాలు చేయాలనుకోవడం వింతగా ఉంది. విశాఖలో చాలాకాలం నుంచి ఉన్న హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుకు చెందిన కేంద్రాన్ని ఇప్పుడు మూసివేశారు. ఇదివరకే ఉన్న కార్యాలయాలు, సంస్థలు తరలిపోతుంటే ఆ విషయం పట్టించుకోకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రచారం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకూ తేడా తెలియనివారు అధికారంలో ఉన్నారనుకోవాలా? అదేమీ కాదు! జగన్‌కు అన్నీ తెలుసు. ప్రభుత్వ పోకడల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని తేలిపోయింది. ఈ వాస్తవం ప్రజలు గుర్తిస్తే పుట్టగతులు ఉండవు కనుక ప్రాంతీయ విద్వేషాలను రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.


‘పదమూడు జిల్లాలతో ఏర్పడిన చిన్న రాష్ట్రం మనది. ఇంత చిన్న రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు రాకూడదనే అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాను’ అని ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణం తనవల్ల కాదనుకున్నారో లేక రాజకీయ కుతంత్రాలు గుర్తుకొచ్చాయో కానీ అభివృద్ధి వికేంద్రీకరణ పాట పాడుతున్నారు. మూడు రాజధానుల సంగతి తర్వాత! ముందు రాష్ర్టాన్ని ఆర్థికసంక్షోభం నుంచి ఎలా బయటపడేస్తారో జగన్‌ బృందం చెప్పాలి. మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తారో చెప్పాలి. ఇప్పటికే అప్పుచేసిన మూడులక్షల కోట్లలో ఒక లక్షకోట్లు ఖర్చు చేసినా నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవి. అలాంటి ఆలోచనలు చేయకుండా ఓట్ల కోసం రూపొందించిన పథకాల కోసం పంచిపెడితూ చంద్రబాబు ప్రభుత్వం ఖాళీ ఖజానా అప్పగించిందని సొల్లు కబుర్లు చెబితే నమ్మే స్థితిలో జనం లేరు. 


అడ్డగోలు కేసు... అసలు విషయం!

రాష్ర్టాన్ని అభివృద్ధికి ఆమడదూరం నెట్టిన జగన్‌రెడ్డి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా కేసులు పెడతారని నోరెత్తడానికి వెనుకాడిన ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఇప్పుడు దేనికైనా సిద్ధమని ఢీకొంటున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం యథేచ్ఛగా హరిస్తోంది. ఇందుకోసం పోలీసుశాఖను పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నాయకులను మించి స్వామిభక్తి ప్రదర్శిస్తుండగా, మరికొంతమంది మాత్రం తాము చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటి? అని మధనపడుతున్నారు.


ద్వేషంతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, చివరకు నా పైన కూడా కేసు పెట్టించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని, అందుకు అప్పుడు ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ కూడా కారణమని పేర్కొంటూ హైదరాబాద్‌లోని ఆయన ఇంటిలో సోదాలు జరిపి అరెస్టు చేయడానికి ఏపీ సీఐడీ అధికారులు రావడం తెలిసిందే. నా చిరకాల మిత్రుడైన లక్ష్మీనారాయణకు మనోధైర్యం కల్పించడానికి వెళ్లిన నాపై, అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్టు కట్టుకథ అల్లి కేసు పైన కేసు పెట్టించారు. పైఅధికారుల ఒత్తిడికి తలొగ్గి నాపై తప్పుడు ఫిర్యాదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణకు ఆరోజు బహుశా నిద్రపట్టి ఉండదు. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయడానికి వచ్చిన ఇదే సత్యనారాయణకు వాస్తవం ఏమిటో తెలుసు. సోదాలు, పంచనామా సజావుగా జరగడానికి కృషి చేసిన నన్ను తమ పని పూర్తయ్యేవరకు అక్కడే ఉండాల్సిందిగా ఇదే సత్యనారాయణ కోరారు. తాను ఏ పరిస్థితుల్లో సోదాలకు రావలసి వచ్చిందో కూడా ఆయన అప్పుడు చెప్పుకొన్నారు. సోదాలు ప్రారంభమైన కొద్దిసేపటికే జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి వచ్చారు. సీఐడీ అధికారులు తిరిగి వెళ్లేవరకు వారు అక్కడే ఉన్నారు.


అధికారుల విచారణకు నేను నిజంగానే అడ్డుపడి ఉంటే అక్కడే ఉన్న జూబ్లీహిల్స్‌ పోలీసులకు సత్యనారాయణ ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలి? సహకరించిన నాకు ధన్యవాదాలు చెప్పి విజయవాడ వెళ్లిపోయిన తర్వాత మరుసటిరోజు రాత్రి ఫిర్యాదు చేయడంలో మర్మం ఏమిటో చెప్పాలి? సత్యనారాయణ అభ్యర్థన మేరకు నేను అక్కడ ఉండగానే... జగన్‌ రోత మీడియాలో నేను సీఐడీ సోదాలకు అడ్డుపడుతున్నట్టు ప్రసారం చేయడం కూడా మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. నీలి మీడియాలో ఆరోపిస్తున్నట్టుగా నేను అడ్డుపడ్డానని విజయవాడ వెళ్లాక మిమ్మల్ని ఫిర్యాదు చేయమంటే ఏం చేస్తారు... అని కూడా సత్యనారాయణతో నేను సరదాగా వ్యాఖ్యానించాను. అప్పుడు నవ్వి ఊరుకున్న అతను చివరకు అదే పని చేశారు.


రఘురామిరెడ్డి అనే అధికారి ఒత్తిడితో నాపై ఎఫ్‌ఐఆర్‌కు రూపకల్పన జరిగింది. అయితే, రేపు ప్రభుత్వం మారితే తనపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదు చేయించారని ఇదే సత్యనారాయణ చెప్పే అవకాశం లేకపోలేదు. ఆనాటి ఉదంతాన్ని ఆసాంతం అక్కడే ఉండి గమనించిన జూబ్లీహిల్స్‌ అధికారులు నాపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు చెడిపోయినంతగా తెలంగాణ పోలీసులు చెడిపోలేదు.


నాపై జీరో ఎఫ్‌ఐఆర్‌ కట్టడాన్ని బట్టి సీఐడీ అధికారుల డొల్లతనం బయటపడింది. నేరం జరిగిన ప్రాంతం ఏ పోలీసు స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో తెలియని సందర్భాలలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలకు వెళుతున్నామని, బందోబస్తు కల్పించాలని నాపై ఫిర్యాదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ జూబ్లీహిల్స్‌ పోలీసులనే కోరారు. అయినా జీరో ఎఫ్‌ఐఆర్‌ కట్టడం ఏమిటో ఘనత వహించిన ఏపీ సీఐడీ అధికారులకే తెలియాలి. కారణం తెలియదు కానీ, సదరు ఎఫ్‌ఐఆర్‌ను వారం రోజులు దాటినా తదుపరి విచారణకై జూబ్లీహిల్స్‌ పోలీసులకు పంపలేదు. పోలీసులు, ముఖ్యంగా ఆంధ్రా పోలీసులు తప్పుడు కేసులు ఎలా పెడతారో ఇప్పుడు మరింత స్పష్టమైంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి నికృష్ట పరిస్థితులు ఉన్నాయి కనుకే న్యాయవ్యవస్థ అక్కడ క్రియాశీలకంగా ఉంటోంది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు. నాపై పెట్టిన తప్పుడు కేసుల నుంచి ఉపశమనం పొందాలంటే నేను కూడా న్యాయస్థానాన్నే కదా ఆశ్రయించాల్సింది.


బాలగోపాల్‌, బొజ్జా తారకం, కన్నబిరాన్‌ లేరా...

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు అమరావతి హైకోర్టుపై కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. నాపై పెట్టిన తప్పుడు కేసు విషయంలో ఆయన ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది. జస్టిస్‌ చంద్రు గతం ఘనమైనదే కావచ్చు! కానీ, జగన్‌రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభాసుపాలయ్యారు. నిజానికి, అణగారిన వర్గాల వారి హక్కుల కోసం తెలుగునాట బాలగోపాల్‌, బొజ్జా తారకం, కన్నబిరాన్‌ వంటి వారు తమ జీవిత కాలమంతా కృషి చేశారు. ఈ విషయం మరచిపోయి పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా జస్టిస్‌ చంద్రును కొంతమంది సీపీఎం నాయకులు, సానుభూతిపరులు నెత్తికెత్తుకుంటున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక హక్కులు హరించబడటాన్ని గుర్తించలేని జస్టిస్‌ చంద్రుకు న్యాయవ్యవస్థపై కామెంట్లు చేసే అర్హత ఉంటుందా? మనం ఎవరి తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నాం... అన్నదాన్ని బట్టి మనం ఎటువంటి వాళ్లమో తెలుస్తుంది. అందుకే కాబోలు, ‘మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చినవాళ్లు ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుండేది’ అని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కిశోర్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్‌ చంద్రును ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నన్నేదో సాధించాలనుకుని తప్పుడు కేసు పెట్టించిన జగన్‌రెడ్డి, ఇప్పుడు తెలంగాణ పోలీసుల ముందు నవ్వులపాలయ్యారు.


జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ఆయన చేస్తున్నది ఏమిటి? ఎవరిని ఏ కేసులో ఇరికించాలా అని ఆలోచించడానికేనా ముఖ్యమంత్రి ఉండేది? ఇటువంటి ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. కాకిలా కలకాలం జీవించేకన్నా హంసలా కొన్నాళ్లు ఉన్నా చాలంటారు. ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు ఉండాలనుకుంటున్న జగన్‌రెడ్డి... ఎందుకు అధికారంలో ఉండాలనుకుంటున్నారో చెప్పాలి. రాష్ట్ర ఆదాయాన్ని మించి అప్పులు చేస్తూ పథకాల పేరిట పంచిపెట్టే వ్యక్తి గొప్ప ముఖ్యమంత్రి అనిపించుకోరు!


ఆర్కేయూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2021-12-19T05:38:52+05:30 IST