ఇదే మొదలన్నట్టు ఎందుకీ ఆర్భాటం!

ABN , First Publish Date - 2021-09-29T06:40:44+05:30 IST

అమెరికాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, వందలాది మంది పార్టీనేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు....

ఇదే మొదలన్నట్టు ఎందుకీ ఆర్భాటం!

అమెరికాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, వందలాది మంది పార్టీనేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయంలో పార్టీ జెండాలు రెపరెపలాడగా డప్పులు, బాజాలు మార్మోగిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం మేరకు బారులు తీరిన కార్యకర్తలను చూసి మోదీ హర్షాతిరేకంతో చేతులు ఊపుతూ నడిచారు. ఒక ప్రత్యేక వేదికపై నేతలు మోదీని గజమాలతో సత్కరించడమే కాక దారిపొడుగునా పుష్పవర్షం కురిపించారు. పార్టీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా మోదీ అంతర్జాతీయ నాయకుడు అయ్యారని, ఆయన నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచం ప్రత్యేక దృష్టితో చూస్తోందని ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి 2019లో కూడా మోదీ అమెరికాలో ఏడు రోజుల పర్యటన ముగించుకుని వచ్చినప్పుడు బిజెపి నేతలు ఇంతే హడావిడి సృష్టించారు. హ్యూస్టన్‌లో ‘హౌడీ మోదీ’ సభను ఆర్భాటంగా నిర్వహించి వచ్చిన నరేంద్రమోదీ అసాధారణ దౌత్యనీతిని ప్రదర్శించారంటూ 20వేలమందితో స్వాగతం పలికారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సదస్సులో గొప్ప ప్రసంగం చేశారని కొనియాడారు.


దేశాధినేతలు ఆయా దేశాల్లో పర్యటనలు జరపడం, ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించడం అంత విశిష్టమైన విషయం కానే కాదు. అయితే ప్రతి దాన్నీ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం, కటౌట్లు, పోస్టర్లు పెట్టించుకుని, డప్పులు మోగించుకోవడం మన నాయకులకు ఇక ఆనవాయితీ అయిపోయింది. మోదీ అధికారంలోకి వచ్చాక పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ ఆయన ప్రతి కదలికనూ చూసి మహదానందపడి శ్లాఘించకపోతే తమకు ఆయన దృష్టిలో గుర్తింపు ఉండదని గ్రహించారు. విచిత్రమేమంటే నూయార్క్ టైమ్స్ సెప్టెంబర్ 26న ఆయన ఫోటో అరపేజీ ప్రకటించి ఈ ప్రపంచానికి చివరి ఆశా కిరణం మోదీ అని వార్త రాసినట్లు అంతటా ప్రచారం జరిగింది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన, ప్రేమాస్పదుడైన నాయకుడు అమెరికాను ఆశీర్వదించడానికి వచ్చాడంటూ ఆ పేపర్ రాసిందట. నూయార్క్ టైమ్స్ ఈ కథనానికి సంబంధించిన ఫోటోను అన్ని సోషల్ మీడియా వేదికల్లో పంచుకుని బిజెపి అగ్రనేతలు, ఆఫీసుబేరర్లు అధికారులు, కార్యకర్తలు, అభిమానులు ఉప్పొంగిపోయారు. మా ప్రధానిని చూసి గర్వపడుతున్నామమంటూ ప్రకటనలు గుప్పించారు. కాని సెప్టెంబర్ 26న నూయార్క్ టైమ్స్ అలాంటి వార్తే రాయలేదని తర్వాత స్పష్టమైంది. నిజానికి మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చినన్ని వార్తలు అమెరికాలో మరే పత్రికలోనూ రాలేదు. పౌరసత్వ చట్టం నుంచి ఆక్సిజన్ అందక సంభవించిన కొవిడ్ మరణాల వరకు ఎన్నో వ్యతిరేక వార్తలు ఆ పత్రికలో వచ్చాయి. గత ఏప్రిల్ 26న న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో న్యూఢిల్లీలోని ఒక శ్మశానంలో వందలాది చితులు మండుతున్న దృశ్యాన్ని దాదాపు అరపేజీ ప్రచురించారు. ఇంతవరకూ రెండులక్షల మంది మరణించారంటూ వార్త రాశారు. అలాంటి పేపర్ మోదీని ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన నాయకుడంటూ కీర్తిస్తుందా?.


ప్రచారాలు, విమర్శలు పక్కన పెట్టి చూస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత లేదని చెప్పలేము. ఆర్థిక సంస్కరణలు మొదలయిన నాటి నుంచీ ప్రపంచదేశాల మధ్య భారత్‌ ప్రాధాన్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. 1994లో పివి నరసింహారావు అమెరికా పర్యటించినప్పుడు మన చేపట్టిన సంస్కరణల కార్యక్రమం గురించి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ ప్రశంసలవర్షం కురిపించారు. 2001లో అటల్ బిహారీ వాజపేయి అమెరికా పర్యటించినప్పుడు తాలిబాన్ అనంతర అఫ్ఘానిస్తాన్ నేపథ్యంలో కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ అన్నారు. మన్మోహన్‌సింగ్ అమెరికాతో అణుఒప్పందం కుదుర్చుకున్నప్పుడు భారత అమెరికా సంబంధాలు మరింత బలోపేతంగా మారాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెనేట్ విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా 2008లో ఈ ఒప్పందాన్ని ఆమోదించడంలో కీలకపాత్ర పోషించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జీవిత చరిత్రలో మన్మోహన్‌సింగ్ వ్యక్తిత్వాన్ని ఘనంగా ప్రశంసించారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కలిసి ఏర్పర్చుకున్న క్వాడ్ కూటమికి 2007 నుంచి చరిత్ర ఉన్నది. మారుతున్న దౌత్య అవసరాల రీత్యా దేశాల మధ్య సంబంధాలు మారడం, కూటములు ఏర్పడడం కొత్త విషయమేమీ కాదు. పివి, వాజపేయి, మన్మోహన్‌లు కూడా ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా విమర్శించినవారే. ఈ రీత్యా కూడా గత ప్రధానుల పర్యటనలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో మోదీ పర్యటనకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. అత్యధిక ప్రచారం ఆధారంగా ప్రధానుల పర్యటనల ప్రాధాన్యతను నిర్ణయించలేం.


అంతేకాక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, మార్కెట్ స్థావరంగా మనదేశానికి ప్రాధాన్యం ఉండనే ఉన్నది. 2013లో జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడుగా ఉన్న కాలంలో భారత్ సందర్శించినప్పుడు భారత్ – అమెరికాల మధ్య 500 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగే అవకాశాల గురించి మాట్లాడారు. మోదీ అన్నట్లు ఇవాళ ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒక భారతీయుడు ఉన్న రీత్యా భారత్ ప్రాధాన్యాన్ని ఎవరూ విస్మరించలేరు. అమెరికాలో 44 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో, నాసాలో, విద్యా, వైద్య, వ్యాపారరంగాల్లోనే కాక రాజకీయాల్లో కూడా భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒబామా పరిపాలనా యంత్రాంగంలో 44మంది భారతీయులు ఉంటే జో బైడెన్ తన యంత్రాగంలో 55మందిని నియమించారు. బైడెన్ ఉపన్యాస రచయిత వినయ్‌రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డిపేట్ గ్రామానికి చెందినవారు. ఇవాళ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌కు జో బైడెన్ ఇస్తున్న ప్రాధాన్యం రీత్యా ఆమె భవిష్యత్‌లో అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అమెరికాలో మాత్రమే కాక ప్రపంచంలో అనేకదేశాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సిఇఓలైన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సంగతి మనకు తెలిసిందే. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ బ్రిటన్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నారు. ఎక్కడో సంగం జాగర్లమూడిలో జన్మించిన ప్రసాద్ పండా అనే తెలుగువాడు కెనడాలోని అల్బార్టాలో మౌలిక సదుపాయాల మంత్రిగా ఉన్నాడని ఎంతమందికి తెలుసు? మోదీ తన అమెరికా పర్యటనలో కలిసిన అయిదుగురు అగ్రశ్రేణి సిఇఓలలో ఇద్దరు సిఇఓలు వివేక్ లాల్, శంతను నారాయణ్ భారతీయులే. కనుక ప్రపంచ రాజకీయాల్లో భారతీయులకు గుర్తింపు, ప్రాధాన్యం మోదీ హయాంలో పెరిగింది కాదు. ప్రపంచ చిత్రపటంలో భారత్ ప్రాముఖ్యత పెరగడం ఒక క్రమానుగత పరిణామమే.


మోదీ తన పర్యటన సందర్బంగా 65 గంటల్లో 24 కీలక సమావేశాలు జరిపారని ప్రచారం జరిగింది కానీ, ఈ సమావేశాల్లో అత్యంత ప్రధానమైనవి అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, సిఇఓలు, క్వాడ్ నేతల సమావేశాలు. భారత అమెరికా సంబంధాల చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్న బైడెన్, వాతావరణ మార్పు నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత వరకూ కలిసికట్టుగా తమ దేశాలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉన్నదని అన్నారు. అదే సమయంలో బైడెన్, కమలా హారిస్ ప్రజాస్వామిక విలువలు, వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. కమలా హారిస్ మోదీకి సున్నితంగా మానవహక్కుల పరిరక్షణను కాపాడుకోవడం గురించి గుర్తు చేశారని లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రిక రాసింది.


క్వాడ్ దేశాల సమావేశం సహజంగా చైనాలో వ్యతిరేక ప్రతిస్పందనను సృష్టించింది. ప్రాంతీయ సహకారం పేరుతో ఒక దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయాలనుకోవడం సరైంది కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించింది. అయితే ఒక దేశానికి వ్యతిరేకంగా నాలుగు దేశాలు ఏకం కావడం ప్రపంచ రాజకీయాల్లో చైనా ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. క్వాడ్ దేశాల్లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఆర్థికశక్తిగా చైనా దరిదాపుల్లో కూడా లేవు. మరో ఆరేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తిగా చైనా అవతరించే అవకాశాల గురించి ఇప్పటికే చర్చ జరుగుతోంది. 75 కోట్ల మంది ప్రజలను దారిద్ర్యరేఖ నుంచి ఎగువకు తీసుకురాగలిన చైనా సాధించిన ఆర్థిక విజయాలు అంతా ఇంతా కావు. తూర్పు ఆసియా నుంచి చైనా నిర్మిస్తున్న బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ప్రధానంగా అమెరికాను కలవరపరుస్తున్నది. ఈ ఆర్థికపోరులో భారతదేశం తన స్వతంత్రవైఖరిని నిర్ణయించుకోవడమా లేక అమెరికా అడుగులో అడుగు వేయడమా అన్నది తేల్చుకోవాలని పలువురు విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. ఇవాళ భారత్ ఎవరి ప్రభావానికీ లోనుకాకుండా తన ప్రయోజనాలకు అనుగుణంగా స్వంత విదేశాంగ విధానాన్ని నిర్ణయించుకోవాల్సిన సమయం ఏర్పడిన తరుణంలో మోదీ వేస్తున్న అడుగులు సరైన దిశలో ఉన్నాయా అన్నది చర్చనీయాంశం. అయితే ఏడేళ్లు పూర్తి చేసుకుని సంధిదశలో ఉన్న మోదీకి కొత్త దిశగా ఆలోచించే సమయం లేదు. ఆయనకు జనంలో తన ఆదరణ తగ్గకుండా, ఎన్నికల్లో ఓడిపోకుండా చూసుకోవడం ప్రధానం. అందుకే ఫలితాల కన్నా ప్రచారానికే ఆయన ప్రాధాన్యత నీయడంలో ఆశ్చర్యం లేదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-09-29T06:40:44+05:30 IST