పార్లమెంటు ఎవరి జేబు సంస్థ?

ABN , First Publish Date - 2021-12-01T09:51:25+05:30 IST

‘పార్లమెంట్ సమావేశాల్లో మేము అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు...

పార్లమెంటు ఎవరి జేబు సంస్థ?

‘పార్లమెంట్ సమావేశాల్లో మేము అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఆయన ఈ విధంగా ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత పార్లమెంటులో సాగుచట్టాలను వెనక్కు తీసుకునే బిల్లును ప్రభుత్వం కేవలం నాలుగు నిమిషాల్లో ఆమోదింపచేసింది. దాదాపు ఏడాది పాటు అన్నదాతల నిరసన ప్రదర్శనలకు, 750 మంది రైతుల మరణాలకు, అనేక దురదృష్టకరమైన సంఘటనలకు కారణమైన సాగుచట్టాలను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుందో తెలుసుకునే హక్కు పార్లమెంట్‌కు లేకుండా పోయింది. ‘ప్రధానమంత్రే ఈ చట్టాలను వెనక్కు తీసుకున్నారు కదా, ఇంకా చర్చ అవసరం ఏమిటి?’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సభానాయకుడన్న విషయం కూడా ఆయన మరిచిపోయినట్లు కనపడుతోంది. ఒక సభానాయకుడిగా ఉన్న వ్యక్తి తాను తీసుకున్న నిర్ణయాల గురించి సభకు వివరించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సభలో కాకుండా కీలక నిర్ణయాలను సభ వెలుపలే ఎందుకు ప్రకటిస్తున్నారు? గతంలో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విధాన నిర్ణయాలపై అయినా, మరే ఇతర కీలక పరిణామం జరిగినా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి సభకు వివరించేవారు. దేశంలో అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు నాటి ప్రధాని పివి నరసింహారావు స్వయంగా వచ్చి సభకు ఎన్నోసార్లు ప్రభుత్వ వైఖరిని వివరించారు. చంద్రశేఖర్, ఆడ్వాణీ, హరికిషన్ సింగ్ సూర్జిత్‌లను తన నివాసానికి పిలిపించి చర్చించారు. నూతన పారిశ్రామిక విధానం గురించి ఆయనే నేరుగా చర్చలో జోక్యం చేసుకుని సభకు వివరించారు. వాజపేయి కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. లోక్‌పాల్ బిల్లు గురించి ఆయన సభకు వివరించారు. 


రాజకీయాల్లో ప్రమాణాలు ఏ విధంగా దిగజారుతున్నాయో తెలుసుకోవాలంటే గతంలో నేతలు ఏ విధంగా ప్రవర్తించారో, ఇప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో పరిశీలిస్తే సరిపోతుంది. రాజ్యాంగ దినోత్సవం రోజు రాజ్యాంగం గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడి, వారసత్వ విధానాలను విమర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శీతాకాల సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా హాజరు కాలేదు. అఖిలపక్ష సమావేశంలో సాగు చట్టాలతో పాటు అందుకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని ఆయనకు తెలుసు. సాగుచట్టాలపై అఖిలపక్ష సమావేశంలో తన వైఖరిని వివరించేందుకు ఇష్టపడని వ్యక్తి పార్లమెంట్‌లో వివరించే అవకాశం లేదని అందరికీ తెలుసు. ఈ చట్టాలపై చర్చ జరిగితే అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. నిరసన ప్రదర్శనల్లో పాల్గొని మరణించిన 750 మంది రైతుల విషయమే కాదు, మద్దతుధరకు చట్టబద్ధత, లఖీంపూర్ ఖేరీ ఘటన మొదలైన వాటి గురిం  చి ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వాటికి జవాబులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడాలి? సాగుచట్టాల ఉపసంహరణ ఘనతను పొందడానికి, తాము రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమని సభాముఖంగా చెప్పేందుకు కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. ఈ చట్టాలను వెనక్కు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక రకంగా ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోంది.


మన రాజకీయ పార్టీల్లో ఒక విచిత్రమైన వ్యవహార శైలి కనపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు పార్లమెంటరీ ప్రమాణాలు, రాజ్యాంగ పవిత్రత గురించి గుర్తు చేసేవారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో పెద్దగా గుర్తుండదు. బిజెపి సభ్యులు సంస్కారవంతంగా, సభా మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించారని చెప్పడానికి తార్కాణాలు కూడా పెద్దగా కనపడవు. మొత్తం 15వ లోక్‌సభ అంతా బిజెపి వైఖరి మూలంగా కొట్టుకుపోయింది. బిజెపి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఉత్పాదకత విపరీతంగా తగ్గిపోయిందని చెప్పడానికి గణాంక వివరాలు ఉన్నాయి. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం 2009లో 93 శాతం ఉన్న లోక్‌సభ ఉత్పాదకత, 2013 నాటికి 46 శాతం పడిపోయింది. పార్లమెంట్‌ను రోజుల తరబడి స్తంభింపచేయడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమని గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ పలుసార్లు ప్రకటించారు. అంతెందుకు? గత ఏప్రిల్‌ లో ఒడిశా అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లును ఎటువంటి చర్చ లేకుండా నిమిషాల్లోనే ఆమోదించినందుకు బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వైపు చెప్పులు, ఇయర్‌ఫోన్స్, పెన్నులు, కాగితాలు విసిరేశారు. విచిత్రమేమంటే వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ వెల్‌లోకి దూసుకువచ్చి హంగామా సృష్టించారని, కాగితాలు చించి గాలిలో విసిరేశారని 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం ఆశ్చర్యకరం. పైగా వారు క్షమాపణ చెబితే తిరిగి రానిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటించారు. నిజానికి చర్చలు లేకుండా బిల్లులను ఆమోదించినందుకు, ద్రవ్యోల్బణం, పెగాసస్ నిఘా వంటి అంశాలపై చర్చకు డిమాండ్ చేసినా ఒప్పుకోనందుకు ప్రతిపక్షాలు హంగామా సృష్టించాల్సి వచ్చింది. అందువల్ల జరిగిన హంగామాకు ప్రతిపక్షాలు ఎంత కారణమో ప్రభుత్వం కూడా అంతే కారణం. సాగుచట్టాలు తెచ్చినందుకు రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవే చట్టాలను చర్చ లేకుండా ఆమోదింపచేసినందుకు పార్లమెంట్‌కు ఏం జవాబు ఇవ్వగలరు? ఆ జవాబు దారీ విధానం లేనందువల్లే ఇవాళ చట్టసభల్లో అనారోగ్యకరమైన వాతావరణం గోచరమవుతోంది.


నిజానికి పార్లమెంట్‌లో ఏ చర్చకైనా సిద్ధమని ప్రధానమంత్రి వంటి నేతలు పైకి చెబుతారు కానీ, చర్చలు జరిగితే అనేక అంశాలపై ఇబ్బందికరమైన సమాధానాలు ఇవ్వవలసి వస్తుందని వారికి తెలియనిది కాదు. మరో రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ నుంచి తమకు వ్యతిరేక సంకేతాలు వెళ్లడం కూడా వారికి ఇష్టం ఉండదు. అందుకే చర్చలు జరగకుండా చూడడానికే వారు రకరకాల వ్యూహాలు అవలంబిస్తున్నారని అనుకోవడానికి ఆస్కారం ఉన్నది. అందులో భాగమే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం. గత సమావేశాల్లో చర్చలు లేకుండా బిల్లులు ఆమోదించి, ప్రతిపక్షాలు చేసిన అన్ని డిమాండ్లను పట్టించుకోకుండా వారిని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు ఈ ఉచ్చులో పడి బీభత్సం సృష్టించి నేరస్థులుగా ముద్రపడ్డాయి. ఈ సమావేశాల్లో అదే సాకుగా చూపించి 12 మందిని సస్పెండ్ చేశారు. ఇది మరో రెచ్చగొట్టుడు నిర్ణయం. దీనివల్ల ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయి గందరగోళం సృష్టిస్తే, వారిని బయటకు పంపి, తమకు కావల్సిన బిల్లులను ఆమోదింపచేసుకుని ఉభయ సభలను వాయిదా వేసుకునే సౌలభ్యం ఉంటుందని బిజెపి నేతలకు తెలుసు. 245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏకు 118 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నది. సభలో ఆరు ఖాళీలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షాలు, ఇన్నాళ్లు తటస్థంగా ఉంటూ అవసరమైనప్పుడు ఎన్డీఏకు మద్దతునిస్తున్న వారు కలిస్తే కీలక బిల్లుల ఆమోదం కష్టమవుతుంది. అందుకే రాజ్యసభ నుంచి 12 మందిని వ్యూహాత్మకంగా సస్పెండ్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


కొద్దినెలలుగా కనపడుతున్న మరో అత్యంత కీలక పరిణామం–పార్లమెంటు ప్రధానంగా ఒక అస్వతంత్ర సంస్థగా మారడం. పైకి సభాపతులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనపడినా వారి నిర్ణయాల వెనుక ప్రభుత్వముద్ర స్పష్టంగా కనపడుతున్నది. సభలో చర్చలు అనుమతించడం, సభ్యులను సస్పెండ్ చేయడం మొదలైన అంశాలపైనే కాక, పార్లమెంట్‌లో ఏ ఉన్నతాధికారిని నియమించాలి, మీడియా రాకపోకల్ని ఏ విధంగా పరిమితం చేయాలి, సెంట్రల్ హాలులో ఆంక్షలు ఎలా విధించాలి అన్న నిర్ణయాల వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా లోక్‌సభ ప్రెస్ గ్యాలరీ కమిటీని నియమించలేదు. సెంట్రల్ హాలు అక్రిడిటేషన్ సమీక్షకు కమిటీని నియమించి కూడా ఆ కమిటీ చేసిన సిఫారసులపై చర్యలు తీసుకోలేదు. ఇక కరోనా మొదలైనప్పటి నుంచీ ఆ పేరుతో మీడియా రాకపోకల్ని పరిమితం చేశారు. ఇప్పుడు సభ్యులను ఎలాంటి ఆంక్షలు లేకుండా రానిస్తున్నప్పటికీ మీడియాపై ఆంక్షలు మాత్రం కొనసాగిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులను సెంట్రల్ హాలులోకి అనుమతించడం అటుంచి, గ్యాలరీలోకి కూడా పరిమిత స్థాయిలోనే లాటరీ తీసి అనుమతిస్తున్నారు. ఏడాదిన్నరగా మెజారిటీ మీడియాను పార్లమెంట్‌లోకి స్వేచ్ఛగా అనుమతించకుండా, పార్లమెంటేరియన్లను కలుసుకోకుండా ఆంక్షలు విధించడం ప్రమాదకరమయిన పరిణామమని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇటీవల స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంట్‌లో కీలక అంశాలపై చర్చ ఉండదు. స్థాయీ సంఘాలకు సంయుక్త పార్లమెంటరీ కమిటీలకు బిల్లులు నివేదించడం అన్న ప్రస్తావనలు విని చాలా కాలమైంది. ప్రభుత్వం ఒక నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నదో, ఎందుకు వెనక్కు తీసుకుంటున్నదో తెలిసే అవకాశం లేదు. మీడియాను దూరం పెట్టడం అనేది ఒక సాధారణ విషయంగా మారింది. మనం ఏ సమాజంలో ఉన్నాం?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-12-01T09:51:25+05:30 IST