నరేంద్ర మోదీ ఏమి ఆలోచిస్తున్నారు?

ABN , First Publish Date - 2021-12-29T09:16:42+05:30 IST

మరో రెండు రోజుల్లో 2021 సంవత్సరం చరిత్రపుటల్లో భాగం కానుంది. అనేక ఎదురు దెబ్బలు, శరాఘాతాల మధ్య ప్రధానమంత్రి మోదీ మరో కొత్త ఏడాదిలో ప్రవేశించనున్నారు....

నరేంద్ర మోదీ ఏమి ఆలోచిస్తున్నారు?

మరో రెండు రోజుల్లో 2021 సంవత్సరం చరిత్రపుటల్లో భాగం కానుంది. అనేక ఎదురు దెబ్బలు, శరాఘాతాల మధ్య ప్రధానమంత్రి మోదీ మరో కొత్త ఏడాదిలో ప్రవేశించనున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఉన్నప్పుడు మోదీ తన విశాలమైన గదిలో ఏకాంతంగా కూర్చుని ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారని, ఆయన పిలిచే వరకూ ఎవరూ వెళ్లరని ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు చెబుతుంటారు. ప్రధాని పదవిలో ఉన్న మోదీ ఆలోచనలు దేశానికి అత్యంత ముఖ్యమైనవి. ఉన్నట్లుండి ఆయన ఏమి నిర్ణయించుకుని ప్రజల ముందుకు వస్తారో, ఏమి ప్రకటిస్తారో అన్నది చెప్పలేము. 


వెళ్ళిపోనున్న సంవత్సరం కంటే రాబోతున్న సంవత్సరమే ప్రధానమంత్రికి చాలా ముఖ్యమైనది. 2021లో కరోనా రెండో ప్రభంజనం సృష్టించిన బీభత్సం నుంచి ఆయన కోలుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వీరోచితంగా పోరాడినా అపజయం ఎదురవ్వడంతో ఏర్పడిన బాధను దిగమింగుకున్నారు. సరిహద్దుల్లో చైనా సృష్టించిన అలజడిని ఏదో రకంగా తట్టుకున్నారు. నిత్యం చీకాకు పరిచిన రైతుల నిరసన ప్రభావం నుంచి బయటపడేందుకు ఆయన ప్రజల ముందుకు వచ్చి సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, కాశీ విశ్వనాథుడి కారిడార్‌ను ప్రారంభించడం మినహా 2021లో మోదీకి సంతోషం కలిగించే విషయాలు పెద్దగా ఏమీ లేవు. 2022లో మోదీని ఇంకా తీవ్ర సమస్యలు చుట్టుముట్టనున్నాయి. ఈ సమస్యల్లో ప్రధాన మైనది రాజకీయంగా నిలదొక్కుకోవడం. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో బిజెపి ఎన్నికలను ఎదుర్కోనున్నది. ఒక్క పంజాబ్ లో తప్ప మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పట్టు బిగించాలంటే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. ముఖ్యంగా దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో బిజెపి దెబ్బతినకుండా చూసుకోవాలి. అ తర్వాత స్వంత రాష్ట్రంలో పోరుకు సన్నద్ధం కావాలి. ఏమైనా తేడా వస్తే అది మోదీ నాయకత్వానికే పరీక్షగా మారక తప్పదు.


రాజకీయంగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తు అయితే ఇతర సమస్యలన్నీ మరో ఎత్తు. ఇప్పుడిప్పుడే ఒమైక్రాన్ విస్తరించడం ప్రారంభించింది. ఇది, దేశాన్ని అతలాకుతలం చేయకుండా చూసుకోవడం మోదీకి సవాలే.ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నదని, స్టాక్ మార్కెట్ ఊపందుకున్నదని, జీడీపి మెరుగుపడుతూ 2019 నాటి పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నాయని మోదీ ప్రభుత్వం సంతోషిస్తున్నప్పటికీ దేశంలో ఆర్థిక సుస్థిరత ఏర్పడేందుకు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ఆర్థిక వేత్తలు సైతం అంటున్నారు.


దేశంలో ఉపాధి కల్పనా శాతం అనుకున్నంత పెరగడం లేదు. 2021లో 28 రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతింటే అందులో ఏడు రంగాలు మాత్రమే కోలుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ ప్రకారం గత అక్టోబర్‌లో దాదాపు 55 లక్షలమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలకు అర్హులైన యువతలో 33 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. కరోనా దెబ్బకు గురైన చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలు ఇంకా కోలుకున్నదాఖలాలు లేవు. నిరుద్యోగ శాతం తగ్గకపోవడానికి ఈ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభమే కారణమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నందువల్ల జనం కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ వినియోగం 7.7 శాతం పడిపోయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ద్రవ్యోల్బణాన్ని మాత్రం ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు 40 శాతం పెరిగిపోయాయి. అన్నిటికన్నా ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. టోకు ధరలు గత 12 ఏళ్లలో ఎన్నడు లేనంతగా 14.23 శాతానికి పెరిగాయి. ఎన్ని అంకెల గారడీలు చేసినా ప్రజలకు ఉద్యోగాలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, వంటనూనెల ధరలే కదా ముఖ్యం?


మోదీ హయాంలో పేదరికమేమైనా తగ్గిందా? చెప్పడానికి వీల్లేదు. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్ జనాభాలో 37.79 శాతం పేదలు ఉన్నారని నీతి ఆయోగ్ తాజా నివేదిక. ఆరోగ్యం, విద్య, పోషకాహారం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇళ్లు తదితర జీవన ప్రమాణాల ఆధారంగా రూపొందించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక ప్రకారం భారత దేశ జనాభాలో 25 శాతం పైగా పేదలు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని 71 జిల్లాలకుగాను 64 జిల్లాల్లో పేదరికం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. యూపీలోని పట్టణ ప్రాంతాల్లో 18.07 శాతం పేదరికం ఉండగా, గ్రామాల్లో 44.32 శాతం పేదరికం తాండవిస్తోంది. ఈ రాష్ట్రంలోజనాభాకు 68.9 శాతానికి వంట గ్యాస్ లేదని, 67.5శాతానికి ఇళ్లు లేవని 63.7 శాతానికి పారిశుద్ధ్య సౌకర్యాలు లేవని ఈ నివేదిక చెప్పింది. అటువంటప్పుడు ఉజ్జ్వల, అందరికీ ఇళ్లు, స్వచ్ఛ భారత్ పథకాల గురించి ఎంత ఊదరగొట్టినా ఏమి లాభం? ఎన్నికలు సమీపిస్తుంటే ప్రతి రెండో రోజూ యుపిలో ప్రత్యక్షమై వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తే సరిపోతుందా? 2005 నుంచీ అత్యధిక రోజులు బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా పేదరికం 36.65 శాతం ఉంటే, బిజెపి మిత్రపక్షంగా ఉన్న బీహార్‌లోని సుశాసన్ బాబు నితీశ్ కుమార్ హయాంలో పేదరికం దాదాపు 52 శాతం ఉన్నది. యుఎన్‌డిపి రూపొందించిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచిక ప్రకారం కూడా 109 దేశాల్లో భారత్‌ 66వ స్థానంలో ఉన్నది. దళితులు, వెనుకబడిన కులాల్లోనే పేదలు అత్యధికంగా ఉన్నారని ఈ నివేదిక తెలిపింది.


దేశ వ్యాప్తంగా మోదీ హయాంలో లాభపడింది ఎవరో 2022 ప్రపంచ అసమానతా నివేదిక చదివితే అర్థమవుతుంది. 2021లో జాతీయ ఆదాయంలో 57 శాతం ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మందికే దక్కగా, క్రింది 50 శాతానికి కేవలం 13 శాతమే దక్కిందని ఆ నివేదిక తెలిపింది. ఇవాళ ఆర్థిక, మౌలిక సదుపాయాల విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులను ఎవర్ని ప్రశ్నించినా తాము కొందరు కార్పొరేట్ల ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నామని వాపోతున్నారు. భారతీయ సమాజంలో సంపన్న వర్గాల డిమాండ్ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్లు కనపడినా, సమాజంలో దిగువ మధ్యతరగతి, పేద వర్గాల నుంచి కూడా డిమాండ్ లేకపోతే అభివృద్ధి పుంజుకునే అవకాశాలు లేవని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ తెలిపింది. వీళ్లే కదా అసలైన ఓటర్లు?


మోదీ ఆర్థిక, రాజకీయ విధానాలే కాదు, ప్రజాస్వామ్యం పట్ల ఆయన విశ్వాసం కూడా రానున్న రోజుల్లో మరింత చర్చనీయాంశమవనున్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసినప్పుడే దాని విశ్వసనీయత నిలుపుకోగలుగుతుంది. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భారీ మెజారిటీతో ఎన్నికైనంత మాత్రాన ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు లైసెన్స్ లభించదని స్పష్టం చేశారు. ప్రతి నిర్ణయమూ రాజ్యాంగ బద్ధంగా తీసుకోవడమే ప్రభుత్వ ప్రజా స్వామ్య బద్ధతకు గీటురాయి అని ఆయన అన్నారు. చట్టాలు ఆమోదించే ముందు కనీసం రాజ్యాంగపరంగా వాటిని పరిశీలించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పార్లమెంట్‌లో ఉన్న స్థాయీ సంఘాలను ఎందుకు సాధ్యమైనంతవరకు ఉపయోగించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. నిజానికి రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో 99 శాతం ఎలాంటి స్థాయీ సంఘాలకు నివేదించలేదు. విచిత్రమేమంటే ఎటువంటి చర్చలు లేకుండా ఎడా పెడా బిల్లులను ఆమోదించడమే పార్లమెంట్ ఉత్పాదకతకు గీటు రాయి అని చెప్పుకుంటున్నారు. కేవలం అయిదు రోజుల్లోనే 25 బిల్లులపై చర్చలు జరిగిన సందర్భాలున్నాయి. కొన్ని బిల్లులను ఒకే రోజు ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించారు. ‘మేము పిజ్జాలను పంపిణీ చేస్తున్నామా, లేక చట్టాలను ఆమోదిస్తున్నామా’ అని ఒక సభ్యుడు ప్రశ్నించాల్సివచ్చింది. సాగు చట్టాలను ఆమోదించినప్పుడు ఏ చర్చా జరగలేదు, వెనక్కు తీసుకున్నప్పుడూకూడా ఏ చర్చా జరగలేదు. రాష్ట్రాలకు సంబంధించిన బిల్లునైనా కనీసం కమిటీకి నివేదించాలని ప్రభత్వం భావించలేదు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఎటువంటి కమిటీకి నివేదించకుండా ఆమోదించారు. ఆనకట్టల భద్రత బిల్లును కూడా సెలెక్ట్ కమిటీ కి నివేదించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ప్రక్కన పెట్టి ఆమోదించారు. ఆధార్ కూ,ఓటర్ కార్డుకూ అనుసంధానం చేసే ఎన్నికల సంస్కరణల బిల్లునూ స్థాయీ సంఘానికి నివేదించకుండా గంటలవ్యవధిలో ఆమోదించారు.


పార్లమెంట్‌లో ప్రజాప్రతినిధుల స్వరాన్ని పట్టించుకోకపోవడం, పార్లమెంట్ బయట ప్రజల నిరసనలను విస్మరించడం అనేది మోదీ ప్రభుత్వ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది. మోదీ లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో కూర్చుని చేసే ఆలోచనలన్నీ లోక కల్యాణం కోసమేనని జనం భావిం చాలంటే ముందు ఆ ఆలోచనలను నలుగురితో పంచుకుని ఆ తర్వాతే అమలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పనిసరి. 2022 లో నైనా మోదీ వైఖరిలో మార్పు వస్తుందని, ఇప్పటి వరకూ తాను అనుసరించిన ఆర్థిక,రాజకీయ విధానాలను మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తారని ఆశించడం తప్ప ఏం చేయగలం?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-12-29T09:16:42+05:30 IST