బిజెపిని ఆవరించిన వందిమాగధ సంస్కృతి

ABN , First Publish Date - 2021-11-10T06:16:48+05:30 IST

‘సూర్యుడు ఎవర్ని అడిగి కమలాన్ని వికసింపచేస్తాడు? మేఘం ఎవర్ని అడిగి వర్షాలు కురిపిస్తుంది? అదే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవరూ అడగకుండానే దేశానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ప్రసాదిస్తున్నారు...

బిజెపిని ఆవరించిన వందిమాగధ సంస్కృతి

‘సూర్యుడు ఎవర్ని అడిగి కమలాన్ని వికసింపచేస్తాడు? మేఘం ఎవర్ని అడిగి వర్షాలు కురిపిస్తుంది? అదే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవరూ అడగకుండానే దేశానికి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని ప్రసాదిస్తున్నారు..’ అని తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఆదివారం నాడు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీని ఆకాశానికెత్తారు. ఈ అన్నామలై ఎవరో కాదు, 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. శివమోగ, ఉడుపి, చిక్కమగళూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పనిచేసి చివరకు 2019లో పోలీసు సర్వీసుకే రాజీనామా చేసి 2020లో భారతీయ జనతా పార్టీలో చేరారు. వెంటనే అన్నామలైకు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఏడాది తిరగక ముందే పార్టీ అధ్యక్షుడుగా నియమించారు. ఎలాంటి సంస్థాగత అనుభవం లేని ఒక 36 సంవత్సరాల పోలీసు అధికారిని పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని మోదీ ఎందుకు నిర్ణయించారు? బీసీగా పరిగణించే గౌండర్ కులానికి చెందిన అన్నామలైని నియమించడం ద్వారా బిజెపి తన బ్రాహ్మణ ముద్రను తొలగించుకుని ద్రవిడ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మంచి పోలీసు అధికారిగా ఉన్న గుర్తింపు వల్ల అన్నామలై తన దూకుడుతో యువతను ఆకర్షించేందుకు తోడ్పడగలరని మోదీ భావిస్తున్నట్టు బిజెపి వర్గాలు అంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపిని బలమైన పార్టీగా మార్చేందుకు ఆయన దోహదం చేస్తారని, గౌండర్లు బలంగా ఉన్న కొంగునాడులోనైనా కనీసం బిజెపి బలపడుతుందనేది మోదీ అభిలాష కావచ్చు. ఈ సంగతి ఎలా ఉన్నప్పటికీ విచిత్రమేమంటే తనను తాను సింగంగా అభివర్ణించుకునే ఈ పోలీసు అధికారి ఎందుకు బిజెపిలో చేరారు? పోలీసుఅధికారిగా ప్రజలకు సేవచేసే అవకాశం ఉపయోగించుకోవాలని ఆయన ఎందుకు అనుకోలేదు? ‘స్టెప్పింగ్ బియాండ్ ఏ ఖాకీ-రివిలీషన్స్ ఆఫ్ ఏ రియల్ లైఫ్ కింగ్’ పేరుతో ఆయన అద్భుతంగా రాసిన పుస్తకంలో పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో అవినీతి గురించి వర్ణించారు. మహిళలపై నేరాలను అరికట్టాలంటే దిశ లాంటి చట్టాలను చేస్తే సరిపోదని, సామాజిక, ఆర్థిక చర్యల ద్వారా మార్పుకు దోహదం చేయాలని ఆయన చెప్పారు. పోలీసు ఎన్‌కౌంటర్లను, కస్టడీలో పోలీసులు పాల్పడే హింసాకాండనూ ఆయన విమర్శించారు. పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అరాచకత్వానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అధికార వ్యవస్థలో ఉన్న వారు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పోలీసులను ఉపకరణాలుగా ఉపయోగించుకుంటారని ఆయన రాశారు. పోలీసులు 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదని, పోలీసు వ్యవస్థలో మేధో సంస్కృతిని, ప్రతిభను, గౌరవంగా పనిచేసే పరిస్థితులను ప్రవేశపెట్టాలని చెప్పిన అన్నామలై పలు పోలీసు సంస్కరణలను సూచించారు. పోలీసు వ్యవస్థలో నెలకొన్న అధికార ఆధిపత్య సంస్కృతినీ ఆయన నిరసించారు. సెల్యూట్ సరిగా చేయనందుకు, సరైన సేవలు చేయనందుకు, మద్యనిషేధ సమయంలో కూడా మద్యం సరఫరా చేయనందుకు క్రింది స్థాయి అధికారులను శిక్షించడాన్ని, గంటల తరబడి జూనియర్లు వేచి ఉండేలా చేయడాన్ని, తండ్రి చనిపోయినా సెలవు ఇవ్వకుండా వేధించడాన్ని, తప్పుడు కేసులు మోపడాన్ని ఆయన విమర్శించారు. రాజకీయాల్లో నేర సంస్కృతినీ ఎత్తి చూపారు. మనం మారినప్పుడే వ్యవస్థ మారుతుందనే వాక్యాలతో అన్నామలై తన పుస్తకం ముగించారు.


విచిత్రమేమంటే తన పదేళ్ల వృత్తి జీవితంలో రాజకీయ, అధికార, పోలీసు వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను సన్నిహితంగా తిలకించిన అన్నామలై భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఎందుకు నిర్ణయించారు? ఈ ప్రశ్నకు ఆయన పుస్తకంలో సమాధానం లేదు. పోలీసు వ్యవస్థలోనూ, నేటి రాజకీయ, అధికార సంస్కృతిలోనూ తాను కావాలనుకుంటున్న మార్పులను ఆయన మోదీ ప్రభుత్వం ద్వారా చేయించాలనుకుంటే అది పగటి కలే అవుతుందనడంలో సందేహం లేదు. లఖీంపూర్ ఖేరీ కేసులో రైతులపై వాహనం నడిపించి హత్య జరిగిన ఉదంతాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేయమని చెప్పేవరకూ యూపీలో బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ దర్యాప్తు నత్త నడక సాగుతోందని, ప్రధాన నిందితుడికే ప్రయోజనం కలిగించే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ సోమవారం వేలెత్తి చూపారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వారి ఏజెంట్లుగా మారుతున్నారని, అధికార దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని కూడా సుప్రీం మరో సందర్భంలో వ్యాఖ్యానించింది. అన్నామలై సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే పోలీసులు ఎంతటి దారుణాలకు పాల్పడ్డారో తాజాగా విడుదలైన ‘జై భీమ్’ సినిమా ప్రపంచానికి వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదివి, ఐపీఎస్ గా మారి ఉద్యోగాలు చేస్తున్న యువకులు రాజకీయ ప్రలోభాలకు లోనయితే వారు రాజకీయాల్లో మార్పులు చేయడం మాట అటుంచి ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్న దుర్లక్షణాలకు లోను కాక తప్పదేమో?! మోదీని ఆకాశానికి ఎత్తుతూ అన్నామలై భజన చేసిన తీరు ఎవరిలో మార్పు వచ్చిందో అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. నిజానికి ఆయన తన ప్రసంగంలో కూడా వ్యవస్థ లో ఉన్నదుర్మార్గాల గురించి మాట్లాడితే ఈ అభిప్రాయం ఏర్పడేందుకు అవకాశం ఉండేది కాదు.


సహజంగానే తనను పొగిడేందుకు సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ అన్నామలై చేసిన ప్రసంగం తో మోదీ ముఖం వికసించింది. ప్రశంసలకు ఉప్పొంగిపోని నాయకుడెవరుంటారు? అందునా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమర్శలు, ప్రశ్నల కంటే ప్రశంసించడం కన్నా ఆహ్లాదం కలిగించేదేమీ ఉండదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విమర్శించే సంస్కృతి కన్నా ప్రశంసించే సంస్కృతినే మోదీ ఎక్కువగా పెంచి పోషించారని భారతీయ జనతా పార్టీలో ఉన్నవారందరికీ తెలుసు. అందుకే కేవలం ఒక్క రోజు ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సహా ప్రతి ఒక్కరూ తమ ప్రసంగాలలో మోదీపై ప్రశంసలవర్షం కురిపించారు. 


దాదాపు రెండేళ్ల తర్వాత జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం ఒక మొక్కుబడిగా జరిగిందని, మోదీకి పొగడ్తల ద్వారా నూతనోత్సాహం తెప్పించేందుకే దాన్ని నిర్వహించారని అర్థమవుతోంది. మోదీ అధికారంలోకి రానంతవరకూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజులు, జాతీయ మండలి సమావేశాలు ఒక రోజు జరిగేవి. దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై నిర్మొహమాటంగా చర్చలు జరిగేవి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఈ సమావేశాలను ఒక సంరంభంగా నిర్వహించేవారు. ఈ సమావేశాల ఆవరణలో వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అనంతకుమార్, ప్రమోద్ మహాజన్ లాంటి నేతలు బయటకు వచ్చి మీడియాతో సమావేశ వివరాలను, తమ భావాలను పంచుకునేవారు. నేతల ఉపన్యాసాలను వినేందుకు వీలు కల్పించేవారు. కాని ఇప్పుడు ఒకే రోజు సమావేశం నిర్వహించి పూర్తిగా మోదీ కేంద్రీకృతంగా మార్చి చేతులు దులపడం ద్వారా ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకున్నారో అర్థం కావడం లేదు. ఎందుకో గానీ ఎన్నికలు గెలిచే ఒక వ్యూహాత్మక యంత్రంగా మాత్రమే బిజెపి కనపడుతోంది.వ్యక్తి ఆరాధన సంస్కృతి బిజెపిని ఆవరించినట్లు అనిపిస్తోంది. ది. ఒకప్పుడు ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిర అని దేవ్ కాంత్ బారువా ప్రశంసిస్తే వంధిమాగధ సంస్కృతి అని బిజెపి నేతలు విమర్శించేవారు. ఇప్పుడేమంటారు?


నిజానికి దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న విషయంపై బిజెపిలో అంతర్గత చర్చ కూడా జరుగుతున్నట్లు కనపడడం లేదు.నేతలందరూ ప్రచారార్భాటంలో, భజన సంరంభంలో కొట్టుకుపోతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై స్వల్పంగా ధరలు తగ్గించడం గురించి చెప్పుకుంటున్న వారు గత కొన్నేళ్లుగా సుంకాలు, సెస్ ల ద్వారా వసూలు చేసిన లక్షల కోట్లరూపాయల గురించి కానీ, అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పడిపోయినా దేశంలో ధరలు తగ్గించకపోవడం గురించి కానీ చర్చించడం లేదు. ఒకవైపు కార్పొరేట్ పన్నులు తగ్గిపోతూ ఉంటే మరో వైపు చమురు ఎక్సైజ్ సుంకం పెరుగుతూ వస్తోంది! 


జాతీయ కార్యవర్గ సమావేశాల మరునాడే బిజెపి కురువృద్ధుడు లాల్ కృష్ణ ఆడ్వాణీని అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన ఇంటికి వెళ్లారు. బిజెపి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన 95 సంవత్సరాల ఆడ్వాణీకి గత ఏడేళ్లనుంచి పార్టీలో ఎలాంటి పాత్ర లేదు. నిజానికి గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీని ముఖ్యమంత్రిగా తొలగించాలని పట్టుబట్టిన వాజపేయిని ఆడ్వాణీ, ఆయన శిష్యులు అడ్డుకున్నారు. అదే ఆడ్వాణీ 2013లో మోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా నిర్ణయించేందుకు గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి వెళ్లకుండా తన నిరసనను ప్రకటించారు. ఏ మార్పును ఆయన అడ్డుకున్నారో అదే మార్పు తాను నిర్మించిన బిజెపి రూపురేఖలే మారుస్తుందని ఆయన ఊహించి ఉండరు. అంత మాత్రాన ఏదీ మారకుండా ఒకే రకంగా ఉంటుందని తనకు తిరుగుండదని మోదీ కూడా భావించడానికి వీల్లేదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Read more