అపశ్రుతుల్లో భారత ప్రజాస్వామ్యం

ABN , First Publish Date - 2021-01-13T06:39:51+05:30 IST

తాముతదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ సాగు చట్టాల అమలును నిలిపివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది...

అపశ్రుతుల్లో భారత ప్రజాస్వామ్యం

తాముతదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ సాగు చట్టాల అమలును నిలిపివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టాల అమలును మీరు నిలిపివేస్తారా, లేక మమ్మల్ని నిలిపివేయమంటారా అని సుప్రీంకోర్టు అంతకు ముందే పశ్నించింది. అయితే కేంద్రం ఆ ప్రశ్నకు స్పందించకపోగా, చట్టాలను సమర్థించుకుంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనితో సుప్రీం కోర్టు తానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కేంద్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని స్పష్టంగా ప్రకటించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం రైతుల నిరసన హింసాత్మకంగా మారితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది. అసలు గత నెలలో శీతాకాలం సెలవులు ప్రారంభం కాకముందే సుప్రీం కోర్టు ఒక పరిష్కార మార్గాన్ని సూచించింది. కేంద్రం అప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. 


దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తాను చనిపోవడానికి ముందు రాసిన పుస్తకంలో ప్రధాని మోదీ పని తీరు గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్‌ను నరేంద్రమోదీ, సంఘ్ పరివార్ ఎంతో గౌరవించారనడానికి తార్కాణాలున్నాయి. గత ఏడాది ఆయనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు మాత్రం మోదీతో తన విభేదాల గురించి ప్రణబ్ ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగాన్ని పాలనా పాఠ్యపుస్తకంగా భావించిన ప్రణబ్ తన లక్ష్మణరేఖ దాటకుండా వ్యవహరించారు. రాష్ట్రపతి పదవి నుంచి నిష్క్రమించిన తరువాత ఆయన తన అభిప్రాయాలను దాచుకోవడానికి వెనుకాడలేదని ఆయన తాజా పుస్తకం ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ లో ప్రస్తావించిన అంశాలతో అవగతమవుతుంది. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వాస్తవాలను స్పష్టం చేయాలని తాను నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.


నరేంద్రమోదీది నియంతృత్వ శైలిగా అభివర్ణించడానికి ప్రణబ్ ఏమాత్రం వెనుకాడలేదు. ప్రధానమంత్రి, ఆయన పరిపాలనా తీరుతెన్నులపైనే మొత్తం దేశ వ్యవహారాలు ఆధారపడి ఉంటాయని, పరిపాలనకు సంబంధించి నైతిక అధికారం ప్రధానిదే అని ప్రణబ్ స్పష్టం చేశారు. దురదృష్ట వశాత్తు మోదీ వ్యవహారశైలి వల్ల వ్యవస్థల మధ్య సంబంధాలు చెడిపోయాయని ఆయన అన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ముందుగా నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వాటిపై కేబినెట్‌లో చర్చించడం ఒక సంస్కృతిగా మారిందని ప్రణబ్ విమర్శించారు. ‘ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి, అసంతృప్తితో ఉన్న వారి స్వరాలను వినాలి. తమకు ఓటు వేయని ప్రజల ఆకాంక్షలను, డిమాండ్లను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దేశంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందరి ప్రయోజనం కోసమే విధానాలను, కార్యక్రమాలను రూపొందించాలి..’ అని ప్రణబ్ చెప్పడం గమనార్హం.


మోదీ హయాంలో పార్లమెంట్ పనితీరు బాగా దెబ్బతిన్నదని ప్రణబ్ చెప్పడం అత్యంత కీలకమైనది. పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా, సాఫీగా నిర్వహించే ప్రాథమిక బాధ్యతలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పార్లమెంట్‌కు రాకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. తనకు ముందున్న ప్రధానమంత్రులు ఎలా వ్యవహరించారో తెలుసుకుని ఒక దార్శనిక నాయకత్వాన్ని అందించేందుకు మోదీ ప్రయత్నించాలని ప్రణబ్ హితవు చెప్పారు. ప్రధాని అనే వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు, ప్రతిపక్షాలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించాలని, దేశానికి పార్లమెంట్ ద్వారా సందేశం పంపగలగాలని ఆయన అన్నారు. ఆర్డినెన్స్‌లు తప్పనిసరి అయితేనే జారీ చేయాలని చెప్పిన ప్రణబ్, బిల్లుల పరిశీలనలో పార్లమెంట్ స్థాయీసంఘాల పాత్ర కీలకమైనదని భావించారు.


విషాదమేమంటే ప్రణబ్‌ను గౌరవించిన మోదీ, ఆయన ప్రజాస్వామ్య భావాలను మాత్రం గౌరవించలేదు. సాగు చట్టాలకు సంబంధించి ఆర్డినెన్స్‌లు జారీ చేయడం నుంచి పార్లమెంట్‌లో వాటిని ఆమోదింప చేయడం వరకు మోదీ వ్యవహారశైలి ప్రణబ్ భావాలకు భిన్నంగా ఉన్నది. రైతుల నిరసన ప్రదర్శనల విషయంలో మోదీ అనుసరించిన తీరుతెన్నులు ప్రణబ్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయడనంలో సందేహం లేదు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారు ఎంతో ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, దార్శనికతతో వ్యవహరించాలన్న విషయంలో ప్రణబ్ సూచించిన కొలమానాలను మోదీ ఏనాడూ చేరుకోలేదన్న విషయం రోజురోజుకూ స్పష్టమవుతోంది. ‘ఐక్యమత్యం మన బలం, ఆధిపత్యం మన బలహీనత’ అన్న ప్రణబ్ మాటల వెనుక ఉన్న గాఢత అర్థం చేసుకోవడానికి నేటి నేతల ఆలోచనా విధానం సరిపోదు.


గత కొద్దినెలలుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సుప్రీం కోర్టు రైతుల ఆందోళన విషయంలో జోక్యం చేసుకోగలదా అన్న అనుమానాలు చెలరేగాయి. 46 రోజుల తర్వాత అయినప్పటికీ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం మంచి పరిణామమేనని భావించక తప్పదు. అయితే సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సభ్యుల నేపథ్యం గురించీ, వారు రైతులకు చేయగలిగిన ప్రయోజనాల గురించీ ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.


ప్రణబ్ తన పుస్తకంలో అనేక ఇతర అంశాల విషయంలో కూడా మోదీ వ్యవహారశైలి గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత నరేంద్రమోదీ తన వద్దకు వచ్చి నల్లధనాన్ని అరికట్టడం, అవినీతిపై పోరాడడం, ఉగ్రవాదులకు నిధులు రాకుండా అడ్డుకోవడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారని దివంగత రాష్ట్రపతి చెప్పారు. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమే కాక చాలా సమస్యలు వస్తాయని, పేదలను కష్టాలనుంచి తప్పించేందుకు అప్రమత్తంగా ఉండాలని తాను మోదీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా ఆ చర్య ప్రభావం ఇంకా సమసిపోలేదని, మోదీ ఆశించిన ప్రయోజనాలు నెరవేరాయని చెప్పలేమని ప్రణబ్ స్పష్టం చేశారు. లూటీ సంఘటితం కావడానికి, దోపిడీ న్యాయసమ్మతం కావడానికే పెద్ద నోట్ల రద్దు దారి తీసిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రణబ్ ఉటంకించారు.


ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం కూడా తనకు నచ్చలేదని, వివాదంగా మారుతున్న ఉద్దేశంతోనే తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యలు చేయలేదని ప్రణబ్ అన్నారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం ఒక ఘోర తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ప్రణాళిక సంఘం పూర్వవైభవం కోల్పోయి ఎన్జీవోలు, పార్ట్‌టైమ్ ఆర్థికవేత్తలకు నెలవై ప్రభుత్వానికి సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థగా మారడాన్ని బట్టి చూస్తే ప్రణబ్ విమర్శలకు అర్థం ఉన్నదేమోనన్న అభిప్రాయం కలుగుతోంది.


విదేశీ వ్యవహారాలకు సంబంధించి పెద్దగా నేపథ్యం లేకపోయినా నరేంద్రమోదీ ఆ విషయంలో సత్వరమే మంచి అవగాహన ఏర్పర్చుకున్నారని ప్రశంసించిన ప్రణబ్ ఈ విషయంలో కూడా మోదీ పద్ధతులను విమర్శించారు. 2015లో ఉన్నట్లుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన విమానాన్ని మళ్లించి లాహోర్‌లో దిగి నవాజ్ షరీఫ్‌ను కలుసుకోవడం పూర్తిగా అనవసరం, అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల భారత్- పాక్ సంబంధాల్లో ఎలాంటి గుణాత్మక మార్పు రాలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత పాకిస్థాన్ భూ భాగాల్లోని ఉగ్రవాదుల శిబిరాలపై చేసిన సర్జికల్ దాడుల గురించి అతిగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెండు ప్రత్యర్థి దేశాల మధ్య ఇలాంటి సైనిక కార్యకలాపాలు సాధారణంగా జరుగుతుంటాయని, వాటి గురించి ప్రచారం అవసరం లేదని ఆయన అన్నారు. అదే విధంగా వివిధ దేశాధినేతలతో తనకేదో వ్యక్తిగత స్నేహ సంబంధాలు ఉన్నాయన్న విధంగా మోదీ అతిగా వ్యవహరించడం, అవి నిజమైన స్నేహాలని నమ్మడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ‘స్నేహ సంబంధాలు దేశాల మధ్య ఉంటాయి కాని వ్యక్తుల మధ్య కాదు’ అని అన్నారు. ఉదాహరణకు చైనాలో విప్లవానంతరం అక్కడి నేతలతో జవహర్ లాల్ నెహ్రూకు మంచి స్నేహ సంబంధాలుండేవని, నెహ్రూకు అప్పటి చైనా అధినేత చౌఎన్ లై మంచి మిత్రుడని ప్రణబ్ చెప్పారు. కాని ఇదేమీ చైనాతో విభేదాలు రాకుండా ఆపలేదు. ‘ఆఖరుకు నెహ్రూ చనిపోయినప్పుడు చైనా పత్రికల్లో చిన్న ముక్క కూడా రాలేదు’ అని ప్రణబ్ చెప్పారు.


ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన అది భ్రమలతో విన్యాసం చేసేందుకు లైసెన్స్ వచ్చినట్లు కాదని, అరాచకత్వానికి జనాకర్షణ ఉన్నంత మాత్రాన అది పరిపాలనకు ప్రత్యామ్నాయం కాలేదని ప్రణబ్ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. నిజానికి మోదీ తీసుకున్న అనేక నిర్ణయాల గురించి, ముఖ్యంగా 2019లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన నిర్ణయాల గురించి ప్రణబ్ అభిప్రాయాలు ఏమిటో ఈ పుస్తకంలో మనకు కనపడవు. బహుశా అప్పటికే ఆయనను అనారోగ్యం ఆవరించి ఉంటుంది. రాష్ట్రపతి పదవి నుంచి విరమించిన తరువాత తానొక శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తోందని ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాసుకున్నారు.


ఈవిఎంల పనితీరులో సందేహాలు, సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై విమర్శలతో పాటు అనేక కీలక అంశాలను ప్రస్తావించిన ప్రణబ్ తాను జీవించి ఉన్నప్పుడే కాంగ్రెస్ తీవ్ర పతనావస్థకు చేరుకోవడాన్ని చూసి తీవ్రంగా బాధపడినట్లు ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ చదివితే అర్థమవుతోంది. 2014లో బిజెపికి మెజారిటీ రాదని, త్రిశంకు పార్లమెంట్ వస్తుందని అనేకమంది నాయకులతో పాటు ప్రణబ్ కూడా భావించారు. తాను రాష్ట్రపతి కాకుండా ఉంటే 2014లో కాంగ్రెస్ పరిస్థితి అంత దిగజారేది కాదని, కొందరు సీనియర్ నాయకుల అవివేకం, దురహంకారం వల్ల పార్టీ నష్టపోయిందని ఆయన వాపోయారు. కాంగ్రెస్ పతనంతో పాటు మెజారిటీ సాధించి స్థిరత్వం సంపాదించిన మోదీ వ్యవహారశైలి కూడా ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించిందని ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ స్పష్టం చేసింది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-01-13T06:39:51+05:30 IST