అదానీ ఎస్టేట్‌ అవుతున్న భారత్‌!

ABN , First Publish Date - 2021-08-25T06:10:50+05:30 IST

దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు ప్రకటించారు....

అదానీ ఎస్టేట్‌ అవుతున్న భారత్‌!

దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు ప్రకటించారు. ఈ నిర్ణయం పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయంపై వివిధవర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. రహదారులు, రైల్వేస్టేషన్లు, విద్యుత్‌లైన్లు, టెలికాం టవర్లు, చమురు పైప్‌లైన్లు, బొగ్గు, మైనింగ్ ప్రాజెక్టులు, గోదాములు, చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు, ప్రభుత్వహోటళ్లు, క్రీడాస్టేడియంలు మొదలైనవాటిని ఇక ప్రైవేట్‌సంస్థలు నిర్వహిస్తాయి. ఇప్పటికే విమానాశ్రయాలు, విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని వదిలించుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక రెండవ దశలో భాగంగా ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ ‌సంస్థలకు అప్పగించి నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ఈ ఆస్తులను తాము అమ్మడం లేదని, వాటి యాజమాన్యం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని ఆర్థికమంత్రి పైకి చెబుతున్నారు. అయితే ఆ ప్రైవేట్‌ సంస్థలు ఎంతకాలం ఈ ఆస్తుల నిర్వహణను కొనసాగిస్తాయో ఆమె చెప్పలేదు. ఉదాహరణకు అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గౌహతి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలను గౌతమ్ అదానీ గ్రూపు 50ఏళ్ల పాటు నిర్వహించనుంది. ఈ కాలంలో విమానాశ్రయాల పూర్తి యాజమాన్యం అదానీ గ్రూపుకే ఉంటుంది. విమానాశ్రయాల డిజైన్, అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ, పునర్మిర్మాణం మొదలైన పనులను ఆ గ్రూప్ పూర్తిగా చేసుకోవచ్చు. ఈ 50 ఏళ్ల లోపు కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారతాయో, ఈ లోపు ఆ విమానాశ్రయాల    పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఒకరకంగా ఇది అమ్మకాన్ని మించిన తీవ్రమైన నిర్ణయం.


ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ‌సంస్థలకు అప్పజెప్పడం వల్ల భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటుంటే ఎన్నో దశాబ్దాలుగా నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించేవారు లేకపోలేదు. రూ.6 లక్షల కోట్లు పెట్టి ప్రభుత్వ ఆస్తులను హస్తగతం చేసుకున్నవారు వాటి నుంచి లాభాలను పిండుకోకుండా ఊరుకుంటారా అని ప్రశ్నించేవారున్నారు. ఇంకో కథనం ప్రకారం ఇప్పటికే రేవులు, విమానాశ్రయాలను తమ అస్మదీయులకు అప్పజెప్పేందుకు విధానాలను సడలించిన కేంద్రం ఇప్పుడు అదే అస్మదీయులకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే అవకాశాలు లేకపోలేదని విమర్శించేవారు కూడా ఉన్నారు. అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందా, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆరోపించినట్లు పద్ధతి ప్రకారం లూటీ, చట్టబద్ధమైన దోపిడీకి ఆస్కారం కలుగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉన్నది.


సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్‌ అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోదీ కొంతమంది అస్మదీయులనే ప్రోత్సహించి, ఆశ్రిత పెట్టుబడిదారులను అందలం ఎక్కించే అవకాశాలు లేవని ఆయన అభిమానులు అంటారు. కాని గడచిన ఏడేళ్లలో అందుకు భిన్నంగా జరిగిందనే విషయాన్ని, అదానీ అనే గుజరాతీ వ్యాపారి ఈ ఏడేళ్ల కాలంలో ఎదిగిన వైనమే మనకు స్పష్టం చేసింది. ఒక మధ్యతరగతి జౌళి వ్యాపారుల కుటుంబంలో జన్మించిన అదానీ తన సోదరులకు ఉన్న చిన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. 2001లో మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అదానీని బలపడేలా చేసింది. మోదీ గుజరాత్ నమూనా ప్రాచుర్యం పొందడానికి, అదానీ పారిశ్రామికవేత్తగా ఎదగడానికి అవినాభావ సంబంధం లేకపోలేదు.


ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అదానీ ప్రైవేట్ విమానాల్లో సంచరించిన మోదీ 2014లో కూడ అదానీ ప్రైవేట్ విమానంలోనే ఢిల్లీ చేరుకుని ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత నరేంద్రమోదీ అదానీకి ఇచ్చిన ప్రోత్సాహం దాచేస్తే దాగని సత్యం. ఇవాళ అదానీ గ్రూపు గుజరాత్, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషాలలో 11 రేవులను స్వాధీనం చేసుకున్నది. ఒకే ఒక్క సంస్థకు రెండు కంటే ఎక్కువ విమానాశ్రయాలను హస్తగతం చేయకూడదని నీతీఆయోగ్ వెలిబుచ్చిన అభ్యంతరాలకు భిన్నంగా అదానీ గ్రూపు దేశంలోని 8 ప్రధాన విమానాశ్రయాలను చేజిక్కించు  కుంది. గౌహతి, జైపూర్, త్రివేండ్రం విమానాశ్రయాలు చేపట్టేందుకు కూడా అదానీ గ్రూప్‌కు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరో మూడునెలల సమయాన్ని పొడిగించింది. 1980లో కమాడిటీస్ ట్రేడర్‌గా వ్యాపారం ప్రారంభించిన అదానీ ఈ ఏడేళ్లకాలంలో చైనా కోటీశ్వరుడు జాన్ షాంషియాన్ తర్వాత ఆసియాలోనే రెండవ సంపన్నుడిగా ఎదిగారు. మొత్తం ప్రపంచంలో ముఖేశ్ అంబానీ ధనికుల జాబితాలో 13వ స్థానంలో ఉండగా అదానీ 14వ స్థానానికి ఎదిగారు.


అదానీ ఎదుగుదలకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఎదుగుదల సాఫీగా జరిగేందుకు మోదీ హయాంలో మౌలిక సదుపాయాలు, సౌరశక్తి, మైనింగ్, ఇంధనం మొదలైన అనేకవాటికి సంబంధించి విధానాలను సడలించిన మాట నిజం కాదా? ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న ఆరు ప్రధాన విమానాశ్రయాలను అదానీకి అప్పగించేందుకు ఎందుకు నిర్ణయించింది? అనుభవం లేని వారికి విమానాశ్రయాలను అప్పగించకూడదనే నిబంధనను, ఆర్థిక మంత్రిత్వశాఖ సిఫారసులను పక్కన పెట్టి అదానీకి ప్రయోజనం చేకూర్చిన విషయం మాటేమిటి? నిబంధనలను సడలించేందుకు మోదీ ప్రభుత్వం పరిపాలనా నిర్ణయాలను వేగంగా తీసుకోవడం జరిగిందా లేదా? అదానీకి అప్పగించడానికి ముందు ఆరు విమానాశ్రయాలలో భారీఎత్తున ప్రజాధనంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిచింది. ఈ ప్రజాధనం ఇప్పుడు ప్రైవేట్ ఆస్తిగా మారింది. విమానాశ్రయాల వేలానికి నిర్ణయించిన టైమ్‌లైన్, నిర్ణయించిన నిబంధనలు ఇతర పోటీదారులను తప్పించి అదానీకి అనుకూలంగా మార్చేందుకే నన్న విమర్శలూ ఉన్నాయి.


రేవులు, విమానాలే కాదు, అత్యధిక గ్యాస్ కాంట్రాక్టులు కూడా అదానీకే దక్కాయి, దేశంలో అనేక కంపెనీల థర్మల్‌ విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ ‌పవర్ ప్రాజెక్టులు, డాటా సెంటర్లు అదానీ చేతుల్లోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వ దర్యాప్తుసంస్థల నుంచి తమను కాపాడుకోవాలనుకునేవారు, బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారు అదానీ శరణు జొచ్చి తమ కంపెనీలను సమర్పించుకున్న సందర్భాలు లేకపోలేదు. తమ విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు అబూదాబీ, కెనడాకు చెందిన సంస్థలతో జీవీకే ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా అదానీకి అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కీలకమైన కేసుల్లో చిక్కుకున్న ముఖ్యమంత్రులు కూడా అదానీని తమ రాష్ట్రంలో విస్తరించేందుకు తోడ్పడి తమ చర్మం కాపాడుకున్న ఉదంతాలూ ఉన్నాయి. కేంద్రమంత్రివర్గంలో పదవులు కావాలనుకున్నవారు సైతం అదానీని కలుసుకున్న సందర్భాలూ లేకపోలేదు.


2013లో అదానీ ఆస్తులు కేవలం గుజరాత్‌లోనే అత్యధికంగా ఉన్నాయి, ఇప్పుడు దేశమంతటా ఉన్నాయి. భారతదేశంలో కనీసం 260 నగరాల్లో అదానీ గ్రూపు ఉనికి కనపడుతోంది. 2013లో అదానీ గ్రూపుకు 44 ప్రాజెక్టులు ఉండేవి. 2018 నాటికి ఈ ప్రాజెక్టుల సంఖ్య 92కు చేరింది. బొగ్గుమైనింగ్, ట్రేడింగ్, రేవులు, షిప్పింగ్, రైల్వే, థర్మల్ విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ఉత్పాదన, పంపిణీ, వ్యవసాయోత్పత్తులు, వంటనూనెలు, ప్రజారవాణా, రియలెస్టేట్, శీతలీకరణ కేంద్రాలు, గోదాములు, రక్షణ రంగం ఇలా అనేక రంగాల్లో విస్తరించినట్లు అదానీ గ్రూప్ వెబ్‌సైట్‌ను చూసిన వారెవరికైనా అర్థమవుతుంది. గ్రీన్‌ఎనర్జీ విషయంలో అదానీ భారీ విజయాలు సాధించారు. అయితే కరోనా సమయంలో అనేక కంపెనీలు మూతపడుతుండగా, అదానీ గ్రూపుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, విస్తరణ ఏ విధంగా జరుగుతోందో అధ్యయనం చేయాల్సిన విషయం. ఒక్క 2018లోనే అదానీ గ్రూపు రిలయన్స్ విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని రూ.12,300 కోట్లకు, జిఎంఆర్ ఛత్తీస్‌గడ్‌ ప్లాంట్‌ను రూ.5,200 కోట్లకు, కట్టుపల్లి రేవును రూ.1950 కోట్లకు, బికనీర్, సికార్ల మధ్య విద్యుత్ పంపిణీ లైన్లను రూ.228 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక్కో గ్యాస్ కాంట్రాక్టుకు రూ. 1500 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టి 25 ప్రాజెక్టులను చేపట్టింది, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 20 ఏళ్లలో డాటా సెంటర్లకు రూ.70వేల  కోట్లు, చెన్నైలోని కట్టుపల్లి రేవుపై మరో రూ.53వేలకోట్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడింది. ఆస్ట్రేలియాలోని బొగ్గుగనులపై దాదాపు రూ.940 కోట్ల పెట్టుబడులు పెట్టింది.


అదానీ, అంబానీలతో పాటు దేశంలో గుప్పెడు సంస్థలకు మాత్రమే మోదీ ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు జగద్విదితమే. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనతో పాటు విదేశాలకు వెళ్లిన పారిశ్రామిక, వ్యాపార, ప్రతినిధివర్గాల్లో అత్యధికులు అంబానీ, అదానీ గ్రూపులకు చెందినవారే. మోదీ వెళ్లిన అనేక దేశాల్లో ఈ గ్రూపులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బ్యాంకులకు రుణాలు కట్టడానికి అనిల్ అంబానీ తన ఆస్తులు అమ్ముతున్న సమయంలోనే ఆయన కంపెనీ రిలయన్స్ డిఫెన్స్‌కు రాఫెల్ కాంట్రాక్టు లభించింది. ముఖేశ్ అంబానీ రిలయన్స్ 4జీ విజయగాథ వెనుక మోదీ ప్రభుత్వ విధానాల తోడ్పాటును కూడా ఎవరూ నిరాకరించలేరు.


భారతదేశంలో ఒకప్పుడు ఒక కుటుంబం దేశ రాజకీయాలను శాసించేదని విమర్శలు ఎదుర్కొనేది. ఇప్పుడు ఒక వ్యక్తి, కొందరు వ్యాపారులు దేశ ఆర్థికవ్యవస్థను, రాజకీయాలను శాసించే పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రధాని అయిన తర్వాత ముంబాయి ఢిల్లీకి తరలి వచ్చిందనడంలో సందేహం లేదు. మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ చట్టాలు, ఆలోచనావిధానం కొందరి ప్రయోజనాలను కాపాడేందుకే జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కూడా అత్యధికంగా ఎవరి చేతుల్లోకి వెళతాయో ఊహించడం కష్టం కాదు. పైగా రాష్ట్రాలు కూడా తమ ప్రాంతాల్లో ప్రజా ఆస్తులను అమ్మేందుకు వీలు కల్పిస్తానని కేంద్రం చెబుతోంది. 2014లో పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలను మోదీ తట్టుకోగలిగారు. ఇప్పుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ‌సంస్థలకు అప్పగిచడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలను ఆయన తట్టుకోగలరా లేదా అన్నది చెప్పలేం. తన వల్ల ప్రయోజనాలు పొందినవారే తనను కాపాడగలరన్న ధీమా మోదీ సర్కారుకు లేకపోలేదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-08-25T06:10:50+05:30 IST