హృదయం లేని కవి పాలన

ABN , First Publish Date - 2021-01-20T09:16:56+05:30 IST

‘ఆకాశంలోకి తలఎత్తి దట్టమైన మేఘాలను చీల్చుకుని వెలుగు నివ్వాలన్న సంకల్పంతో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు...

హృదయం లేని కవి పాలన

‘ఆకాశంలోకి తలఎత్తి దట్టమైన మేఘాలను చీల్చుకుని వెలుగు నివ్వాలన్న సంకల్పంతో ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు...’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన కవితను కొత్త సంవత్సరం మొదటి రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆయన స్వరంతో ట్విట్టర్‌లో విడుదల చేసింది. ప్రధానమంత్రి కొత్త సంవత్సరం రోజు కొత్త కవిత్వంతో ముందుకు వచ్చారని చాలా మంది భావించారు. నిజానికి ఈ కవితను మోదీ గతంలో పలు సందర్భాల్లో వినిపించారు. ఇందులో సూర్యోదయాన్ని మనిషి ఆత్మవిశ్వాసంతో పోలుస్తూ రేపటి పట్ల ఆశల్ని రేకెత్తించే కవి ఆకాంక్ష ప్రతిధ్వనిస్తుంది. ప్రధాని తనకు కవిహృదయం ఉన్నదని చెప్పుకునేందుకు చాలా ఉపన్యాసాల్లో కవితాత్మకంగా మాట్లాడే ప్రయత్నం చేసిన ఉదంతాలు ఎన్నో కనపడతాయి. అప్పుడప్పుడూ ట్వీట్లలో కూడా తన కవితల్ని ఆయన ఉటంకిస్తారు. జనవరి మొదటి వారంలోనే ఆయన కళ్లలో నీలి మేఘాలు.. అంటూ ఆకాశం గురించి తాను రాసిన మరో కవితను తన అభిమానులతో పంచుకున్నారు. నిజానికి 2014 సంవత్సరానికి ముందు మోదీ కవితలు రాసిన దాఖలాలు లేవు కాని ఆయన రాసిన కొన్ని కథలు హిందీలోకి అనువాదం అయ్యాయి. ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి ముందు నరేంద్రమోదీ కూడా ఒక మంచి కవి అని చెప్పేందుకు బృహత్తర ప్రయత్నాలు జరిగాయి. అందుకోసం ఒక టీమ్ కూడా పనిచేసింది. మోదీ ఉపన్యాసాల్ని, హావభావాల్ని, వేదికల్ని, ప్రచార తీరుతెన్నులను నిర్ణయించిన ఈ టీమ్ ఆయనను కవిగా కూడా జనం ముందు వ్యూహాత్మకంగా పరిచయం చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే 2014 ఏప్రిల్‌లో ఆయన కవితల్ని ఒక స్టార్టప్ కంపెనీ అధినేత ఆంగ్లంలో అనువాదం చేసి ‘ఏ జర్నీ’ (ఒక ప్రయాణం) పేరిట విడుదల చేశారు. ఈ కవితల్లో అధికంగా ప్రకృతి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, వర్షం, వెన్నెల, శీతాకాల ఉదయాలు, వసంతం, నదులు, పచ్చటి తోటలు, జ్ఞాపకాలు మొదలైనవి మనకు దర్శనమిస్తాయి. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంత సున్నిత హృదయం కలవారా అన్న ఆసక్తి కూడా మనకు కలుగుతుంది.


మోదీ కవితలు రాస్తారని, ఉపన్యాసాలు కవితాత్మకంగా చేస్తారని తెలిసినప్పటికీ, అనేక ప్రసంగాల్లో తరచు పలువురు కవుల పేర్లను ఉటంకించినప్పటికీ ఎందుకో ఆయనకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి లాగా కవి అన్న ముద్ర పడలేదు. వాజపేయి మాట్లాడుతుంటేనే ఒక కవి మాట్లాడుతున్నట్లు కనిపించేది. ఆయన హావభావాల్లోనూ, పదాల విరుపులోనూ, వాడే వాక్యాలలోనూ కవిత్వం తొణికిసలాడేది. అనేకమంది ఉర్దూ, హిందీ కవుల కవిత్వం ఆయన పెదాలపై అలవోకగా పలికేది. వాజపేయి పెద్ద సంఖ్యలో కవితలు రచించలేదు కాని యువకుడుగా ఆయన కవిసమ్మేళనాల్లో పాల్గొనేవారు. ఒక కవి ప్రధానమంత్రి అయితే ఎలా వ్యవహరించారో ఆయన అదే విధంగా వ్యవహరించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పాండిత్యాన్ని వాజపేయి ఏ విధంగా గౌరవించారో, వాజపేయిని పీవీ ఒక మంచికవిగా గుర్తించారు. వాజపేయి కవితా సంకలనం ‘మేరీ ఇక్యావన్ కవితాయే’ (నా 51 కవితలు)ను ప్రధాని పదవిలో ఉన్నప్పుడే పీవీ నరసింహారావు విడుదల చేశారు. ‘రాజకీయాలు నా కావ్య రసధారకు అడ్డంకిని కలిగించాయి’ అని వాజపేయి ఈ కవితా సంకలనం ముందుమాటలో అంగీకరించారు. ‘కవిత్వం, రాజకీయాలు కలిసికట్టుగా సాగలేవు’ అని వాజపేయి స్పష్టీకరించారు.


మరి రాజకీయాల్లో ఉంటూ నరేంద్రమోదీ కవిత్వం ఎలా రాయగలుగుతున్నారు? నరేంద్రమోదీ వాజపేయిని అనుకరించి తనను తాను ఒక సున్నిత హృదయుడైన కవిగా చిత్రించుకుంటే జనం ఆయనను మరో వాజపేయిగా గుర్తించే అవకాశం ఉన్నదా అన్న విషయం చర్చనీయాంశం. నిజానికి ఇద్దరి కవితాంశాలకు ఎంతో తేడా ఉన్నది. వాజపేయి కూడా ప్రకృతి వర్ణన చేసి ఉండవచ్చు. కాని ఆయన కవితల్లో సహజసిద్ధమైన మనిషి కనిపిస్తాడు. ఆయన కవితల్లో మార్మికత కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కవికి కావల్సింది సమాజం పట్ల దృక్పథం. అది వాజపేయి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘కృష్ణుడు లేకుండా ఇప్పుడు మహాభారతం జరగాలి. ఎవరు రాజైనా పేదవాడు ఏడ్వాల్సిందే...’ అన్న వాజపేయి తన ఆలోచనా విధానాన్ని తేటతెల్లం చేశారు. ‘లాభనష్టాలలో తూగటం జీవన వ్యాపారమైంది. అమ్ముడుపోయే వాళ్ల ధర బాగా పెరిగింది. రసపాత్రిక రిక్తమై పోయింది’ అని ఆయన మనిషి జీవితంలో మార్కెట్ సంబంధాలు ప్రవేశించిన వైనాన్ని చిత్రించారు. ‘ఎత్తైన పర్వతంపై వృక్షాలు ఉండవు. మొక్కలు కూడా మొలవవు... దేవుడా నాకు అంతటి ఔన్నత్యాన్ని ఎప్పుడూ ప్రసాదించకు. మనుషుల్ని ఆలింగనం చేసుకోలేని ఎత్తు నాకు వద్దు..’ అని మానవ స్పర్శ కోసం తపించిపోయే మానవత్వం వాజపేయిలో మనకు కనిపిస్తుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచినా స్వాతంత్ర్య ఫలితాలు మనకు అందలేదని అనేకమంది గొప్ప కవుల్లాగే వాజపేయి కూడా వాపోయారు. మత కల్లోలాల్లో మనుషులు కుప్పకూలిపోవడంపై వాజపేయిలోని కవి తీవ్రంగా గాయపడిన సందర్భాలున్నాయి. ‘అమాయకులైన పిల్లల, ముదుసలి స్త్రీల యువకుల శవాల కుప్పలపైకెక్కి అధికారపు సింహాసనాన్ని అధిరోహించాలనుకునే వాళ్లకు నాదో ప్రశ్న- మరణించిన వారితో వారికేమీ సంబంధం లేదా? వారి మతంతో సంబంధం లేకపోవచ్చు కాని వారి నేలతో అనుబంధం లేదా? అథర్వణ వేదంలోని ఆ మంత్రం కేవలం జపించడానికేనా? నిప్పుల్లో నిలువునా కాలిపోయిన పిల్లలు, బలాత్కారానికి గురైన స్త్రీలు, బూడిదైన ఇళ్లు దేశభక్తికి తార్కాణాలు కానేకావు, నాగరికతకు ప్రమాణ పత్రాలు కావు..’ అని వాజపేయి వాపోయారు. మరి కవి వాజపేయికి కవి నరేంద్రమోదీ ఎంత సమీపంలో ఉన్నారు?


అందుకే నరేంద్రమోదీ ఇటీవల కరోనా టీకామందు పంపిణీని ప్రారంభిస్తూ మహాకవి గురజాడ అప్పారావును ఉటంకించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ వాక్యాలను చదివే ప్రయత్నం చేసిన మోదీ గురజాడ నిజమైన స్ఫూర్తిని గ్రహించారా అన్న అనుమానాలు కలుగక మానదు. ‘దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్’ అన్న గురజాడ దురభిమానంతో కూడిన మతపరమైన దేశభక్తిని తీవ్రంగా నిరసించారు. ‘మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి వెలిగి నిలుచును’ అని ఆయన సైన్స్ ప్రాధాన్యతను స్పష్టం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేసే వారు సృష్టించే భావోద్వేగాలకు లోనై మనుషులు విడిపోరాదని ఆయన హెచ్చరించారు. దేవుడితో వ్యాపారం చేసే వాళ్ల నిజస్వరూపాన్ని బహిర్గతం చేశారు. ‘మనిషి కల్పించిన దేవుడిని పూజించే ఓ మనిషీ, మనిషినెందుకు హీనంగా చూస్తావు..’ అని ప్రశ్నించారు.


గురజాడను ఉటంకించాలన్నా, వాజపేయిని అనుకరించాలన్నా ఒక కవికి మానవ సంబంధమైన ఆర్ద్రత ఉండాలి. కవిగా యశస్వి కావాలంటే అందుకు తగ్గ హృదయం ఉండాలి. దాదాపు రెండునెలలుగా వణికించే చలిలో వేలాది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ఒక కవి ప్రధానమంత్రి అయి ఉంటే ఏమి చేసి ఉండేవారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం కావాలి. వాజపేయి ప్రధానమంత్రిగా ఉండగా, వ్యవసాయ రంగంలో ఎన్నో కీలక చర్యలు తీసుకున్నారు. రైతులకు సులభంగా రుణం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం, బయోటెక్నాలజీ ఫలితాలను రైతులకు చేరువలో తీసుకురావడంతో పాటు వ్యవసాయ మంత్రి సోంపాల్ శాస్త్రి నేతృత్వంలో రైతుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దానికి తర్వాతి కాలంలో స్వామినాథన్ చైర్మన్ అయ్యారు. అదే సోంపాల్ ఇటీవల వ్యవసాయమంత్రి తోమర్‌ను కలిసి మోదీ సర్కార్ చేసిన సాగుచట్టాల్లో ఎన్నో లోపాలున్నాయని, రైతులను విశ్వాసంలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కనీస మద్దతు ధరపై రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్‌ను మోదీ సర్కార్ ఒప్పుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘సాగు చట్టాలు ఆమోదం పొందాక ఇక పార్లమెంట్‌లో చర్చకు మళ్లీ తావెక్కడుంది..’ అని స్పీకర్ ఓం బిర్లా మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా రణగొణ ధ్వని తరంగాల్లో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత్వం హృదయంలోంచి రాని వారి పాలన ఎలా ఉంటుందో మరింత స్పష్టంగా అర్థమవుతుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-01-20T09:16:56+05:30 IST