బిజెపి ప్రాభవంపై మసకచీకట్లు

ABN , First Publish Date - 2021-08-04T06:06:43+05:30 IST

న్యూ ఢిల్లీ ఆకాశాన కారు చీకట్లలా మేఘాలు అలముకున్నాయి. అవి, దేశ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయనడం సత్య దూరం కాదు....

బిజెపి ప్రాభవంపై మసకచీకట్లు

న్యూ ఢిల్లీ ఆకాశాన కారు చీకట్లలా మేఘాలు అలముకున్నాయి. అవి, దేశ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయనడం సత్య దూరం కాదు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రకరకాల ఉద్యమాలు నిర్వహించే ప్రజలు జంతర్‌మంతర్ సమీపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సాధారణం. ప్రభుత్వం తమ నిరసనలను పట్టించుకుంటుందనే ఆశపెద్దగా లేకపోయినా ఏదో ఒక రోజుపాలకుల గుండెలు కరగకపోతాయా అని  ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. ప్రజల అసహనం పెల్లుబుకినప్పుడు జంతర్‌మంతర్ వద్ద వాతావరణం కూడా మారిపోతుంది. 2004లో యుపిఏ ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు పూర్తయిన తర్వాత రాజకీయ పరిస్థితి ఇదే రకంగా వేడెక్కడం స్పష్టంగా కనిపించింది. 2011లో యుపిఏ ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే నిర్వహించిన ఉద్యమం ఆ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. 2011 జూన్‌లో బాబా రామ్‌దేవ్ నిరాహారదీక్ష నిర్వహిస్తున్న రాంలీలా మైదాన్‌లో అర్ధరాత్రి పోలీసులు దాడి చేసి జనాన్ని చెదరగొట్టారు. 2012లో నిర్భయ అత్యాచార ఘటనకు వేలాది ప్రజలు స్పందించారు. జంతర్‌మంతర్ వద్దా, ఇండియాగేట్ వద్దా విద్యార్థినీ విద్యార్థులను, యువకులను అడ్డుకోలేక పోలీసులు నానా అవస్థలు పడ్డారు. అన్నిటి పర్యవసానంగా 2014లో యుపిఏ ప్రభుత్వం గద్దె దిగి మోదీ సారథ్యంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.


ఇప్పుడు కూడా చరిత్ర మరోరకంగా పునరావృతమవుతుందా? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనప్పటి నుంచీ ఏదో రూపంలో నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలు, జామియా, జేఎన్‌యూలో విద్యార్థి నిరసనలు... ఇవన్నీ కొన్ని రోజుల పాటు ఎంత ఉద్రిక్త వాతావరణాన్ని కల్పించాయో అంతే వేగంగా సద్దుమణిగాయి. 9 నెలలుగా ఢిల్లీలో రైతుల నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాదివలస కార్మికులు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లడం, కరోనా రెండో ప్రభంజనం సందర్భంగా వేలాది రోగులు ఆక్సిజన్ సౌకర్యాలులేక మరణించడం, ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో పాటు ధరలు ఆకాశానికి అంటడం మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, హ్రస్వదృష్టిని బహిర్గతం చేశాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా పదేళ్లు పాలించినందువల్ల మోదీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కూడా పదేళ్లు కొనసాగడం పెద్ద విశేషం కాకపోవచ్చు. రెండు ప్రభుత్వాల్లోనూ ఏడేళ్ల పాలన తర్వాత వాటి పాలనా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనపడ్డాయి.


పరిస్థితి మారుతున్నదని భావిస్తున్నందువల్లే ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ఏకం కావడానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రజాసమస్యలకు తోడుగా పెగాసస్ నిఘా అంశం వారిని ఏకం చేసింది. రెండువారాలుగా పార్లమెంట్‌ను ప్రతిపక్షాలు స్తంభింపచేయడం, మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం విస్మరించదగ్గ పరిణామం కాదు. రెండవది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రతిపక్షాలతో స్వంతంగా మాట్లాడగల ఆమోదయోగ్యత సంపాదించుకోగలగడం. ఒకప్పుడు రాహుల్‌ను ఏ మాత్రం పట్టించుకోని నేతలంతా ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశానికి హాజరు కావడం కూడా గుర్తించదగ్గ విషయం. భవిష్యత్‌లో రాహుల్ నాయకత్వ శైలి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ ఒకరకంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన, ఉన్న మిత్రపక్షాలను కోల్పోయిన ఘనత మోదీ ప్రవర్తనాశైలికే దక్కుతుంది. అంతే కాదు, ప్రతిపక్షాలను ఏ మాత్రం లెక్కచేయకుండా వారిని పూచికపుల్లలుగా చూసే మనస్తత్వం కూడా వారిని ఏకం చేస్తోంది. ప్రతిపక్షాలను భయకంపితుల్ని చేయడం, రకరకాల దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, పార్లమెంట్‌లో కీలకబిల్లుల విషయంలో తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం, పార్లమెంటరీ కమిటీలను బేఖాతరు చేయడం, ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కనీసం తమతో చర్చించాలన్న ఆలోచనే లేకపోవడం విపక్షాలను అవమానగ్రస్తుల్ని చేసి ఏకం చేస్తోంది. 


యుపిఏ ప్రభుత్వం చివరి మూడేళ్లలో బలహీనమైనట్లుగా మోదీ ప్రభుత్వం కూడా బలహీనపడుతుందా అన్న విషయంచెప్పడానికి వీల్లేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. యుపిఏ పదేళ్లూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపింది. కాని మోదీ తన ఆకర్షణ మూలంగా బిజెపికి పూర్తి మెజారిటీని రెండు సార్లూ సాధించిపెట్టారు. కాంగ్రెస్‌తో పోలిస్తే బిజెపి అంత బలహీనమైన పార్టీ కాదు. దానికి ఒక బలమైన, మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకోగల నాయకుడు ఉన్నారు. 2014 ముందు నుంచీ ఈ నాయకుడు తనకు తిరుగులేదన్నట్లుగా, దేశంలో అధ్యక్షపాలన నిర్వహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాని యుపిఏకు కానీ, మొత్తం ప్రతిపక్ష కూటమికి కానీ అలాంటి నాయకుడు లేనే లేడు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే నాటికి బిజెపి ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో స్వంతంగా అధికారంలో ఉండగా, ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి ఆరు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నాయి. 2024 నాటికి ఈ పరిస్థితి మారి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఇతర బిజెపియేతర ప్రతిపక్షాలు పై చేయి సాధిస్తే కానీ మోదీని ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా ఈలోపు ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో బిజెపిపై కాంగ్రెస్, ప్రతిపక్షాలది పైచేయి కావాలి. ఆ తర్వాతే వారంతా ఒక కూటమిగా ఏకం కావడం, బిజెపికి ప్రత్యామ్నాయం ఏర్పడడం ఆచరణలో సాధ్యమవుతుంది. ఆ తర్వాతే ఎవరు నాయకుడన్న విషయం చర్చకు వస్తుంది. అందుకే ప్రతిపక్షాల ఐక్యత అనేది ఒక క్రమం అని, నేత ఎవరైనా తనకు అభ్యంతరం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.


మోదీకి కూడా అంతర్గతంగా సమస్యలు మొదలు కాలేదని చెప్పలేం. బహుశా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు బిగించేందుకే ఆయన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపి వివిధ వర్గాలకు స్థానం కల్పించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి అదిత్యనాథ్‌ను కదపాలని ఒక దశలో ఆలోచించి వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు యోగి అద్భుతంగా పాలిస్తున్నారని ప్రధానమంత్రి, హోంమంత్రి ఇద్దరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అది వారి రాజకీయ అవసరం. కర్ణాటకలో తప్పనిసరై యడ్యూరప్ప అనుయాయుడినే ముఖ్యమంత్రిగా నియమించాల్సి రావడం బిజెపి అధిష్ఠానం బలహీనత తప్పమరేమీ కాదు. అంతమాత్రాన కర్ణాటకలో ఆ పార్టీ అధికారం నిలబెట్టుకోగలుగుతుందా అన్నది చెప్పలేం. ఇప్పుడున్న అధికారం కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల వచ్చిందే కాని సహజంగా వచ్చింది కాదు. కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లో కూడా బిజెపి ప్రవేశించే అవకాశాలు అతి కష్టంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లో అధికారం స్థిరంగా ఉండాలంటే కూడా బిజెపి అధిష్ఠానం ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వ విధానాలవల్ల పెద్దఎత్తున ఊపు వచ్చి జనం ఓటు వేసే పరిస్థితులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఆయన ఉపన్యాసాలు కూడా గతంలో లాగా ఆకట్టుకోకపోగా, సోషల్‌ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి విస్తరణ ఆగిపోయిందా, ప్రస్తుతం రివర్స్ గేర్‌లో ఉన్నదా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకులలో ప్రారంభమయ్యాయి.


ఈ సంధి పరిస్థితుల్లో జనం చేసే ఆందోళనలే ప్రతిపక్షాలకు ఊతం ఇస్తాయి. ఏ ప్రతిపక్షం అండ లేకుండా రైతులు ఇన్నాళ్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్లీ వారు జంతర్‌ మంతర్ వద్ద నిరసనకు పూనుకుంటున్నారు. దేశంలో పలుచోట్ల ఉపాధి కల్పనావకాశాలు దెబ్బతినిపోగా, ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు అభద్రతలో పడ్డారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఆందోళన చేసిన వందలాది ఉద్యోగుల్లో ఈ అభద్రత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరగడాన్ని బిజెపి నేతలు కూడా సమర్థించుకోలేకపోతున్నారు. ‘చెప్పకండి, ఆకాశానికి చిల్లు పెట్టడం సాధ్యం కాదని. ఆత్మవిశ్వాసంతో ఒక రాయి ఎత్తి గాలిలో బలంగా విసరండి చాలు..’ అని ప్రముఖ హిందీ కవి దుష్యంత్ కుమార్ ఎమర్జెన్సీ సమయంలో ఇదే విధంగా దేశ రాజకీయాలపై దట్టంగా అలముకున్న నల్లటి మేఘాలను చూసి రాశారు. ప్రస్తుత పరిస్థితి అదేవిధంగా ఉన్నది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-08-04T06:06:43+05:30 IST