కట్టు తప్పిందా..
ABN , First Publish Date - 2021-10-29T05:30:00+05:30 IST
రోడ్లన్నీ గోతులమయం.. ప్రయాణమంటే ప్రాణాలు హరీ అనే పరిస్థితి. ఇటు చూస్తే ఇసుక కష్టాలు..
నవరత్నాలు విసిరితే చాలు.. మిగతా వాటి జోలికెళ్తే ఒట్టు
నీరుగారిన ఇరిగేషన్ పనులు
మంత్రి ఇలాకాలో ఇళ్లెక్కడ
కుర్చీలు ఫుల్... నిధులు నిల్
సొంత పదవులతోనే సరి
మంత్రులది ఎవరి దారి వారిదే
డీఆర్‌సీ నుంచి జడ్పీ వరకూ అంతా సైలెంట్
ప్రధాన విభాగాలు పడకేశాయ్
జిల్లాలో ఇదో కొత్త చరిత్ర
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
రోడ్లన్నీ గోతులమయం.. ప్రయాణమంటే ప్రాణాలు హరీ అనే పరిస్థితి. ఇటు చూస్తే ఇసుక కష్టాలు.. అటు చూస్తే ధరల బాదుడు. ఈ వైపు ఎయిడెడ్ సెగలు.. ఆ వైపు ఉద్యోగుల అసంతృప్తి. ఇరిగేషన్ పనుల పెండింగ్.. రైతులకు సాగు కష్టాలు.. ఇలా ఎటు చూసినా అడుగడుగునా పాలనా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. కష్టాలు తీర్చండి మహాప్రభో అన్నా పట్టించుకునే నాథుడే లేడు. మంత్రులది ఎవరి దారి వారిదే. శాఖల మధ్య సమన్వయలోపం. ఒకప్పటి కట్టు చెదిరిపోయింది.. ఇప్పుడంతా బెట్టు చేసే పరిస్థితి. తొలుత అనుభవరాహిత్యమంటూ కాలయాపన చేశారు. ఇప్పుడేమో చేతిలో చిల్లిగవ్వ లేదంటూ దాట వేస్తున్నారు. ఏతా వాతా అంతటా వైఫల్యాల సెగలూ.. పొగలే ! వైసీపీ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు అయినా పాలనలో కనిపిస్తున్న లోపాలెన్నో..!
ఒకనాడు అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు మధ్య ఒకింత సయోధ్య ఉండేది. పాలనాపరమైన చర్చలు జరిగేవి. ఒకరు దూకుడుగా వెళుతుంటే ఇంకొకరు సర్ది చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాలుగు నియోజక వర్గాలు పరిధిలో 255 గ్రామాలకు తాగు నీరందించే సత్యసాయి నీటి పథకం నిర్వహణలో అంతా అయోమయం. దీని కింద పని చేస్తున్న 160 మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. నిర్వహణ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ వేడుకున్నారు. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ కదలలేదు. తొమ్మిది నెలలుగా విరామం లేకుండా ఉద్యోగులు నిరసన చేస్తున్నా ఎవరికీ పట్టదు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చినవారు ఆ తరువాత ఏమైందో చెప్పడానికి ఇప్పటికీ ఇష్టపడడం లేదు. అంతలా నిర్లక్ష్యం. జిల్లాలో రోడ్ల తీరు అధ్వాన్నం. ఆర్‌అండ్‌బీ ఎప్పుడో చేతులెత్తేసింది. ఆ శాఖ యావత్తు దిక్కులు చూస్తోంది. నయాపైసా విదల్చని ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. కీలకమైన పంచాయతీ శాఖలో పనులన్నీ ఎక్కడికక్కడే. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన జిల్లా పరిషత్‌లోనూ అంతా సైలెంటే. దీనికితోడు ప్రభుత్వ కార్పొరేషన్లన్నీ నిధులు లేక మూలన పడ్డాయి. వచ్చే వారు వెళ్లే వారితో నిత్యం కళకళలాడే ఈ కార్యాలయాల ముఖం చూడడానికే ఎవరూ ఇష్టపడడం లేదు. ఆఖరికి రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులదీ నిరాదరణే. ఇచ్చింది చాలులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
సాగు నీటిలో సాగదీత
నిధుల లేమితో చింతలపూడి ఎత్తిపోతల పథకం నీరుగారిపోయింది. ఈ జిల్లాతోపాటు పొరుగున వున్న కృష్ణా జిల్లాకు తాగు, సాగు నీరందించే ఈ పఽథకం లక్ష్యం దెబ్బతింది. ఈ పథకం పరిధిలో వున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నోరు మెదిపిన పాపానపోలేదు. ఆఖరికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ అప్పుడప్పుడు పోలవరం వస్తున్నా మిగతా పనుల విషయంలో సమీక్షలకే దిక్కులేదు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో అంతా గోళ్లు గిల్లుకునే పరిస్థితి. కాల్వల ఆధునికీకరణ ఎప్పుడో మూలనపడింది. శివారు భూము లకు నీరందడం లేదు. తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిస్థితీ అదే. ఎర్ర కాల్వ, యనమదు ర్రు పరిస్థితి గురించి చెప్పనక్కరలేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సరికొత్త ఆర్డర్లు, ఆచరణలో మాత్రం ఎక్కడా అడుగు ముందుకే పడడం లేదు.
సంక్షేమం మాటున
ఇప్పుడు అధికారుల నోట నవరత్నాల మంత్రం ఒక్కటే. ఏ విషయం లేవనెత్తినా దిక్కులు చూస్తారు. అదిగో ఇదిగో అంటూనే కాలం గడిపేస్తారు. వ్యవసాయ రుణాలు చెల్లింపులో ఇప్పటికే బ్యాంకులు వెనకడుగు వేశాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 32 వేల పింఛన్లు ఎత్తివేసినా, 40 వేలకుపైగా రేషన్ కార్డులను తొలగించినా దిక్కులేదు. మహాప్రభో అంటూ బీదా బిక్కి జనం కలెక్టరేట్‌ను ఆశ్రయించినా ఫలితం లేదు. స్పందన విజ్ఞాపనలకే పరిమితమైంది. ఒకటో రెండో తప్ప మిగతా అర్జీలన్నీ వెయి టింగ్‌లోనే. ఆఖరికి ఈ ఏడాది రెండు లక్షల గృహాల నిర్మాణం లక్ష్యం కాగా గృహ నిర్మాణ మంత్రి రంగనాథరాజు సొంత జిల్లాలోనే ఎన్నో ఆటంకాలు, మరెంతో నిర్లక్ష్యం వెంటాడుతోంది. మహిళా శిశు సంక్షేమం సంగతి సరేసరి. మరో మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖకు సారధ్యం వహిస్తుండగా ఇక్కడ రెండు మెడికల్ కళాశాలల నిర్మాణంలోనూ పురోగతి లేదు. కొల్లేరులో పర్యాటకానికి అని గొప్పలు చెప్పారు. ఏలూరు సిటీ ఇక అంతా స్మార్టే అన్నారు. ఆ రెండు మాటలు ఎక్కడా వినపడడం లేదు.
కుర్చీలు ఫుల్.. నిధులు నిల్
అధికార పార్టీలో ఎవరిని కదిపినా ఏదో ఒక పదవి. అది కార్పొరేషన్‌లోనో, స్థానిక సంస్థల్లోనో, ఆఖరికి కో ఆప్షన్‌లోనో.. ఎక్కడికక్కడ జిల్లావ్యాప్తంగా కుర్చీలు ఫుల్. కానీ పని చేసేందుకు నిధులు నిల్. అసాంతం అధికారిక కార్య కలాపాలు మందగమనంలో సాగుతున్నాయి. నవరత్నాల అమలు పర్యవేక్షిస్తే చాలు అనే ధోరణిలో అధికారులు ఉన్నారు. శాఖాపరమైన లోపాలపై ఎలాంటి సమీక్షలు లేవు. అభివృద్ధి కార్యక్రమాలకు సమీక్ష అవసరమైన డీఆర్‌సీ అడ్రస్ లేదు. దీనిని నిర్వహించాల్సిన ఇన్‌ఛార్జి మంత్రి ఆ దిశగా దృష్టి పెట్టలేదా అనే అనుమానం తలెత్తుతోంది. వివిధ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాల్లో ఎమ్మెల్యేలది వెనుకబాటే. ఆఖరికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ నేతలు, కార్యకర్తలే. సమస్య చెప్పుకునే ప్రజల సందడి తక్కువే.
ఎవరి దారి వారిదే
జిల్లాలో ముగ్గురు మంత్రులు సమన్వయంతో ఓవైపు యంత్రాంగాన్ని, మరోవైపు ఇతర వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ ముందుకు సాగడం లేదు. మంత్రి రంగనాఽథరాజు గుంటూరు జిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. మరో మంత్రి ఆళ్ల నాని అత్యధిక సమయం తన నియోజకవర్గమైన ఏలూరుకే కేటాయించారు. ఇంకో మంత్రి తానేటి వనితా ఇదే దారి. జిల్లా వ్యవహారాలను పర్యవేక్షించి యంత్రాంగంలో కదలిక తీసుకు వచ్చేలా పట్టు బిగించలేకపోతున్నారు. అధికారులు ఇదే పద్ధతి బాగుం దనుకుంటున్నారు. వీడియో కాన్ఫరెన్సులు, టెలి కాన్ఫరెన్సులు నిర్విరామంగా నడుస్తున్నాయి. గత ప్రభుత్వానికి ఇప్పటికి దీనిలో పెద్ద తేడా లేదు.