అయినా.. కిక్కెక్కలా!

ABN , First Publish Date - 2021-12-31T05:57:51+05:30 IST

మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వానికి వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది.

అయినా.. కిక్కెక్కలా!

ధరలు తగ్గినా మొగ్గు చూపని మందుబాబులు
పది రోజులైనా పెరగని అమ్మకాలు.. రూ.5.5 కోట్లకు తగ్గింది
పాత బ్రాండ్లపై అధికారుల దృష్టి.. న్యూ ఇయర్‌పైనే ఆశలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వానికి వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి నెలకొంది. మద్యం ధరలు తగ్గించినా మందు బాబులను  మాత్రం ఆకట్టుకోలేక పోయింది. ప్రతి జిల్లా రోజుకు ఎనిమిది కోట్ల మేర అమ్మకాలు లక్ష్యంగా పది రోజుల క్రితం మద్యం ధరలను 20 శాతం తగ్గించింది. అయినా అమ్మకాలు ఏమాత్రం పెరగలేదు. పైపెచ్చు తగ్గాయి. నవరత్నాల హామీలో భాగంగా మద్యం ధరలు పెంచి దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రభు త్వం ప్రకటించింది. దాదాపు మూడు రెట్లు ధరలు పెం చింది. అప్పట్లో రూ.70 ఉన్న క్వార్టర్‌ ధర రూ.250 నుంచి 300 పెంచింది. పాత బ్రాండుల స్థానంలో నాశిరకం కొత్త బ్రాం డులు తెచ్చింది. మద్యంపై ఆదాయం పెంచుకోవడం కోసం నవ రత్నాల హామీకి నీళ్లొదిలేసింది. మందుబాబులను తాగించడమే లక్ష్యంగా పెట్టుకుని రెండుసార్లు మద్యం ధరలను తగ్గించింది. కిందటేడాది నవంబరులో 20 శాతం మద్యం ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా జిల్లా ప్రజలతో రోజుకు రూ.8 కోట్ల మేర తాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈనెల 20 నుంచి మరో 20 శాతం ధరలు తగ్గించింది.


గతవారం కంటే తగ్గాయి


మద్యం ధరలు తగ్గించిన తరువాత అమ్మకాలు భారీగా పెరుగుతాయని భావించారు. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. జిల్లాలో ధరలు తగ్గించక ముందు వారం రోజుల్లో అంటే డిసెంబరు 13 నుంచి 20 వరకూ జిల్లాలో 60.22 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ వారం రోజుల్లో రోజు వారీ సగటు అమ్మకాలు రూ.7.5 కోట్ల సగటుతో మొత్తం 58,400 కేసుల మద్యం, 12,078 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. కాగా మద్యం ధరలు తగ్గిన అనంతరం వారం రోజుల్లో 49.6 కోట్ల మేర అమ్మకా లు జరిగాయి. ఈ వారం రోజులు కూడా 7.08 కోట్ల రూపాయల రోజువారీ సగటుతో మొత్తం 57,943 కేసుల లిక్కరు, 15,855 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ధరల తగ్గింపుతో ఆశించిన ఫలితం రాకపో వడంతో ప్రభుత్వం పాత బ్రాండులను రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. మందు బాబులు కోరుకున్న పాత బ్రాండ్లతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో పాత బ్రాండ్లు దర్శనమిస్తాయని కొత్త ఏడాది జోష్‌ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-12-31T05:57:51+05:30 IST