బడ్జెట్‌లో నిరాశే...!

ABN , First Publish Date - 2021-05-21T05:17:52+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు మినహా మిగిలిన నీటిపారుదల శాఖల ప్రాజెక్టులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.4793.75 కోట్లు కేటాయించగా,

బడ్జెట్‌లో నిరాశే...!

పోలవరం భూసేకరణకు రూ.4,510 కోట్లు 

మిగిలిన ప్రాజెక్టుల కేటాయింపుల మాటేంటి ? 

చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతలకు నిధులేవి ?

కనిపించని డెల్టా ఆధునికీకరణ ప్రస్తావన

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాల అసంతృప్తి


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు మినహా మిగిలిన నీటిపారుదల శాఖల ప్రాజెక్టులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.4793.75 కోట్లు కేటాయించగా, ఇందులో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలులో భాగంగా భూసేకరణకు రూ.4,510 కోట్లు వెచ్చిస్తారు. మెట్టలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందించే చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించలేదు. రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయితే మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ఆధార పడకుండా వర్షాకాలంలో గోదావరి జలాలతో సాగు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తాడిపూడి కాలువ కార్యరూపం దాల్చింది. ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు మరో రూ.150 కోట్లు అవసరం. చింతలపూడి ప్రాజెక్ట్‌ పూర్తి కావాలంటే ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంది. జిల్లాలో ప్రాధాన్యం వున్న ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి.. ఇతర అభివృద్ధి, శాశ్వత పనులకు మొండిచేయి చూపించారు. పశ్చిమ డెల్టాలో సక్రమంగా సాగు నీరు అందించాలంటే ఆధునికీకరణ పనులు పూర్తికావాలి. బడ్జెట్‌లో దీనిని ప్రస్తావించలేదు. గంపగుత్తగా నీటిపారుదల శాఖకు రూ.13 వేల కోట్లకుపైగా  నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అందులో కృష్ణా, తుంగభద్ర బోర్డు పరిధిలో చేపట్టే ప్రాజెక్ట్‌లు సహా మరికొన్నింటిని ప్రస్తావించారు. పశ్చిమకు ప్రాధాన్యం మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలోనే ప్రత్యేకత కనబరిచారు. ఆధునికీకరణకు నిధులు కేటాయిస్తేనే పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. అలా ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడంతో గత ఏడాది నీటి పారుదల శాఖ అధికారులకు చుక్కెదురైంది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని పశ్చిమ డెల్టా ఆధునికీకరణకు రూ.250 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అయినా ప్రభుత్వం ఆమోదించలేదు. అంచనాలను తిప్పి పంపింది. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ  ఆధునికీకరణ ప్రస్తావన లేకపోవడంతో ప్రభుత్వం నుంచి చుక్కెదురు కానుందన్న ఆందోళన డెల్టా రైతాంగంలో నెలకొంది. 


మెడికల్‌ కళాశాల ప్రస్తావన

రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. అందులో భాగంగా జిల్లాలో రెండు కళాశాలలు ఏర్పాటవుతాయి. ఇప్పటికే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా.. నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కళాశాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అది ఎక్కడనేది ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నారు.  


విద్యా రంగం వికసించేనా ?

జిల్లాలో కొత్త విద్యా సంస్థలు నెలకొల్పే విషయంలో స్పష్టత లేదు. వెంకట్రా మన్నగూడెం ఉద్యాన విశ్వ విద్యాలయాన్ని ప్రస్తావించలేదు. ఎప్పటిలాగే జీతభత్యాలు, నిర్వహణ కోసం బ్లాక్‌ గ్రాంట్‌ ఇచ్చేందుకే పరిమితమైంది. అధ్యయన, పరిశోధనలు, విశ్వ విద్యాలయ విస్తరణకు చెప్పుకోదగ్గ నిధులు కేటాయించలేదు. నాడు–నేడు రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు కేటాయించారు. ఆ ప్రాతిపదికన జిల్లాకు దాదాపు రూ.300 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. జిల్లాలో తొలి విడత నాడు–నేడు పనులను 1,125 పాఠశాలల్లో చేపట్టారు. మలి విడతలో మరిన్ని పాఠశాలల్లో చేపట్టేందుకు నిధులు మం జూరు కానున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలో రహదారుల అభివృద్ధికి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు, వాస్తవ విడుదలకు పొంతన లేదు. గడిచిన రెండేళ్లలో ఆర్‌అండ్‌బీ రహదారులు జిల్లాలో అభివృద్ధి చెందలేదు. ఈసారి అదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే బడ్జెట్‌ కేటాయింపులు వాస్తవరూపం దాల్చాలి. అయితే బడ్జెట్‌పై అధికార పార్టీ మినహా మిగిలిన పక్షాలన్నీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 


వరి గిట్టుబాటు ధర ఊసే లేదు

– తోట సీతారామలక్ష్మి, నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు

వ్యవసాయ బడ్జెట్‌లో ప్రాధాన్యతాంశాలు ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు కేటాయించారు. అసలు వరి రైతులకు గిట్టుబాటు ధర లభించే విధానంపై ప్రభుత్వ పాలసీని అమలు చేయాలని రైతు సంఘాలు దీర్ఘకాలంగా కోరుతున్నాయి. మా ప్రభుత్వ హయాంలో దీనిపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ధరల స్థిరీకరణ బడ్జెట్‌ వ్యయం ఏనాడు బయట పెట్టలేదు. ఆర్‌బీకేల పనితీరు మెరుగు పడడం లేదు. 


బడ్జెట్‌లో పస లేదు..

గన్ని వీరాంజనేయులు,ఏలూరు టీడీపీ అధ్యక్షుడు 

అంకెల గారడీ తప్ప బడ్జెట్‌లో పస లేదు. వివిధ విభాగాలకు గొప్ప కోసం కేటాయింపులు చేశారు. వీటిలో దేనికి ఎంతో చెప్ప కుండా వచ్చే రాబడిని చెప్పకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రకటించారు. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం ఉంది. ప్రతి నెలా జీతాలకు అప్పు చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్‌లో పోలవరం ఊసే లేదు. అసలు ఒక్క రోజు బడ్జెట్‌ సమావేశాలు ఏమిటి..వైసీపీ నేతలు దోచుకువడానికే ఈ బడ్జెట్‌ ప్రకటించారు.  


అంకెల గారడీ బడ్జెట్‌

– సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ 

ఇది సమతుల్యత, సమగ్ర విధానం లేని బడ్జెట్‌. అంకెల గారడీతో  ప్రజలను మోసపుచ్చేదిగా ఉంది. సంక్షేమ పథకాలకు తప్ప సంపద సృష్టిపై ప్రస్తావన లేకపోవడం దారుణం. చింతలపూడికి కేటాయింపులు చేయకపోవడం అన్యాయం. ఏలూరు, నర్సాపురంలో వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులకు శూన్య హస్తం చూపారు. 


నవరత్నాల బడ్జెట్‌ 

– సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు 


బడ్జెట్‌ నవరత్నాల కోసమే పెట్టినట్లు ఉంది. ప్రజల కరోనా బాధలు పట్టించుకున్న పాపన లేదు. ఆరోగ్య పరిరక్షణకు భరోసా ఇవ్వలేదు. కరోనా వ్యాధి కట్టడికి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందించేందుకు నిధులు కేటాయించ లేదు. రెండు వేల 300 కోట్లు కరోనాకు ఖర్చు చేసినట్లు చెప్పారు. మనకంటే చిన్న రాష్ట్రం కేరళలో రూ.20 కోట్లే ఖర్చు పెట్టారు. 

 

ఆక్వా ఆలోచనే లేదు

– గాదిరాజు నాగేశ్వరరాజు, రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి

ఆక్వా రైతులకు రక్షణకు ఇటీవల ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చారు. దాని అమలుకు సంబంధించిన ప్రత్యేక కోర్సు, టెక్నాలజీ వంటివి అమలు చేయలేదు. దానికి సంబంధించి ఈ బడ్జెట్‌లో ప్రకటన లేదు. ఆక్వా రంగానికి సంబంధించి కరోనాలో రైతులు చాలా నష్టపోయారు. వాళ్లను ఆదుకునే ఉద్దీపన చర్యలు లేవు. ఆక్వా రంగంపై తీసుకునే చర్యలపై అసలే ప్రస్తావనే లేదు. మత్స్యకార భరోసా ప్రకటించారు కానీ అవి రైతులకు సంతృప్తి కలిగే విధంగా లేవు. 


విద్యకు గతం కంటే తక్కువ

బడ్జెట్‌లో విద్యా రంగానికి కేవలం 10.71 శాతం మాత్రమే కేటాయించారని, ఇది గత ఏడాది కేటాయింపుల కంటే తక్కువని ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రెడ్డిదొర, బి.ఎ.సాల్మన్‌రాజు విమర్శించారు. కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం నిరాశకు గురిచేసిందన్నారు.


Updated Date - 2021-05-21T05:17:52+05:30 IST