కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలలో వైసీపీ జెండా

ABN , First Publish Date - 2021-03-15T05:07:28+05:30 IST

జంగారెడ్డి గూడెం కొవ్వూరు మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి వన్‌సైడ్‌ అయ్యాయి.

కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలలో వైసీపీ జెండా
కొవ్వూరులో కౌంటింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

కొవ్వూరు: వైసీపీ–15,టీడీపీ–7,బీజేపీ–1 స్థానాల్లో గెలుపు

జంగారెడ్డిగూడెం: వైసీపీ–25, టీడీపీ–3, జనసేన–1 స్థానాల్లో గెలుపు


కొవ్వూరు, మార్చి 14: కొవ్వూరు మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. వేములూరు దీప్తి పాఠశాలలో ఆదివారం ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రారంభించారు. పట్టణంలో 23 వార్డులకు గాను 13 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో వైసీపీ–9,టీడీపీ– 4 ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 10వ తేదీన మిగిలిన 10 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం  దీప్తి పాఠశాలలో 19 టేబుల్స్‌ ఏర్పాటుచేసి ఒకేరౌండ్‌లో ఫలితాలను వెల్లడించారు. ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను బయటకు తీసుకువచ్చి కౌంటింగ్‌ ప్రారంభించారు. ప్రారంభించిన గంటలోనే ఫలితాలు వెలువడ్డాయి. 10 వార్డులలో వైసీపీ–6, టీడీపీ–3, బీజేపీ–1 స్థానంలో విజయం సాధించాయి. కౌంటింగ్‌ కేంద్రం వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ.ఎంవీవీఎస్‌ఎన్‌.మూర్తి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 25 స్థానాల్లో వైసీపీ విజయం


 జంగారెడ్డిగూడెం:  జంగారెడ్డి గూడెం మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి వన్‌సైడ్‌ అయ్యాయి. మునిసిపాలిటీలోని 29 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 25 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా, మూడు వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన పార్టీలు గెలుచుకున్నాయి. జంగారెడ్డిగూడెం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మునిసిలిటీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. మొదటి  రౌండ్‌లో ఒకటి నుంచి 15 వార్డులకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓట్లను లెక్కించారు. అయితే వీటిలో 5వ వార్డు నుంచి టీడీపీ  అభ్యర్థి కరుటూరి రమాదేవి, 10వ వార్డు టీడీపీ అభ్యర్థి తెలగారపు జ్యోతి, 4వ వార్డు జనసేన అభ్యర్థి వలవల తాతాజీలు మినహా మిగిలిన 12 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. అనంతరం రెండవ రౌండ్‌లో 16 నుంచి 29 వరకు 14 వార్డులకు సంబంధించి జరిపిన కౌంటింగ్‌లో 17వ వార్డు టీడీపీ అభ్యర్థి నంబూరి రామచంద్రరాజు గెలుపొందగా మిగిలిన 13 మంది వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 

 పటిష్ట భద్రత

పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్‌ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాలకు, యార్డు పరిసరాల్లోకి అనుమతి లేనివారిని రానివ్వలేదు. అలాగే జిల్లా ఎస్పీనారాయణ నాయక్‌ ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వరకు కౌంటింగ్‌ కేంద్రం వద్దే జిల్లా ఎస్పీ ఉన్నారు. జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల నాయకులు, కార్యకర్తలు పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక కౌంటింగ్‌ కేంద్రం వెలుపల ఎమ్మెల్యే ఎలీజా, నాయకులు, అభ్యర్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
Updated Date - 2021-03-15T05:07:28+05:30 IST