వ్యాక్సిన్ వార్...
ABN , First Publish Date - 2021-05-09T05:19:29+05:30 IST
జిల్లా వ్యాప్తంగా 24 వ్యాక్సినేషన్ సెంటర్ల (సీవీసీ)లో శని వారం నిర్వహిం చిన వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టు తప్పింది..

వ్యాక్సిన్‌కు జనం పరుగులు
కిక్కిరిసిన పంపిణీ కేంద్రాలు
భౌతికదూరం లేదు..భయమూ లేదు..
ప్రణాళిక లేదంటూ జనం ఆవేదన
ఏలూరు ఎడ్యుకేషన్, మే 8 : జిల్లా వ్యాప్తంగా 24 వ్యాక్సినేషన్ సెంటర్ల (సీవీసీ)లో శని వారం నిర్వహిం చిన వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టు తప్పింది.. దాదాపు అన్నిచోట్ల జనం కిక్కిరిసిపోయారు. రెండో డోసు కోసం వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సరైన ప్రణాళిక, లబ్ధిదారులకు సమాచారం అందించడంలో తడబడడంతో జనం ఇక్కట్లు పడ్డారు. దీనికితోడు 18 రోజుల విరామం తరు వాత కోవాగ్జిన్ సరఫరా కావడం, కేవలం 6,650 డోసు లను మాత్రమే జిల్లాకు పంపడంతో రెండో డోసు వ్యాక్సి నేషన్ కోసం లబ్ధిదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ప్రవాహంలా తరలివచ్చిన లబ్ధిదారులను అదుపు చేసేందుకు పోలీసులను మోహరించాల్సి వచ్చింది. భౌతిక దూరం పాటించేలా వారిని అదుపుచేసేందుకు పోలీసులు చెమటోడ్చారు. టీకా పంపిణీలో జిలా ్లవ్యాప్తంగా పంపిణీ కేంద్రాల వద్ద పలు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
రెండో డోసు కోవాగ్జిన్ టీకా మందు కోసం మార్చి నెల నుంచి ఎదురుచూస్తోన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్ల వయసు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు కూడా తరలివచ్చారు. వీరికి అదనంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 45 సంవత్సరాలు వయసు పైబడిన సాధారణ ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా ఉత్సవ్ కార్యక్రమాల్లో కోవాగ్జిన్ తొలి డోసు వేయించు కున్న వారంతా ఇప్పుడు రెండో డోసు వ్యాక్సిన్‌కు అర్హులే అయినందున పెద్ద సంఖ్యలో వచ్చారు.తొలి డోసు కోవాగ్జిన్ వేయించుకున్న గ్రామ/వార్డు సచివా లయాల్లోనే రెండో డోసు వ్యాక్సిన్ పంపిణీ అవుతుం దని ఇంతకుముందు వైద్యాధికారులు చెప్పారు. దీనికి విరుద్దంగా అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారన్న విషయాన్ని ఆ నోటా, ఈ నోటా తెలుసుకున్న లబ్ధిదారులు సీవీసీలు ఉన్న చోటకు దూరాబారమైనా పరు గులు తీశారు. కొన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచే రెండో డోసు కోసం వేచి ఉన్నారు.ఇక మీదట పంపిణీ చేసే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా మందు ఏదైనా సరే సీవీసీల వద్ద సీని యర్ సిటిజన్ల కోసం, మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా భౌతిక దూరం పాటిస్తూ క్యూలు పెడితే తోపులాటలు, కరోనా వ్యాప్తికి అవకా శాలు ఉండవు. ఏ రోజుకారోజు ప్రాంతాల వారీగా సీవీసీల్లో పంపిణీ చేసే టీకా మందు డోసుల సంఖ్య, తొలి డోసు లేదా రెండో డోసు వంటి వివరాలను ముందుగానే మీడియా ద్వారా జారీ చేస్తే అందరికీ సౌలభ్యంగాను, పారదర్శకంగాను ఉంటుంది.
గూడెంలో టోకెన్ పద్ధతి
తాడేపల్లిగూడెం, మే 8 (ఆంధ్రజ్యోతి) :తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో వ్యాక్సిన్ కోసం జనం ఎగబడ్డారు. దీంతో వ్యాక్సిన్ వేసే ప్రాంగణమంతా కిటకిటలాడింది. దీనిని అరికట్టేందుకు మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ కౌంటర్ వద్దకు ఒకేసారి అంతా వెళ్లకుండా కమిషనర్ బాల స్వామి టోకెన్‌లు కేటాయించారు. క్యూ పద్ధతిని పాటించారు. రెండో డోస్ 240 మందికి సరిపడా వచ్చింది. కొందరికి కోవా గ్జిన్ రెండో డోస్ లేకపోవడంతో వెనుదిరిగారు.
ఏలూరులో బారులు తీరారు
ఏలూరు ఫైర్‌స్టేషన్, మే 8 : రెండో విడత వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు యుద్ధం చేయాల్సి వచ్చింది. శని వారం ఏలూరులో నాలుగు సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారం భించారు. ఒక్కో సెంటర్‌లో కేవలం 450 మందికి మాత్రమే సరిపోను వ్యాక్సిన్‌ను ఇచ్చారు. నాలుగు సెంటర్లకు కలిపి 1800 మందికి వ్యాక్సిన్ వేశారు. కానీ ఒక్కో సెంటర్ వద్ద వేల సంఖ్యలో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ ఇబ్బందులు పడ్డారు. కొంత మందికైతే మాస్క్‌లు కూడా లేవు.మండుటెండలో వ్యాక్సిన్ కోసం బారులు తీరిన జనాల్లో అనేకమంది బీపీ, షుగర్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే. ఒక పద్ధతీపాడు లేకుండా చేపట్టిన వ్యాక్సినేషన్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకొల్లులో తోపులాట
పాలకొల్లు అర్బన్, మే 8 : పాలకొల్లులో అర్బన్‌హెల్త్ సెంటర్, 26వ వార్డులోని గ్రామ సచివాలయంలో వ్యాక్సినేషన్ చేపట్టారు. ప్రజలు ఉదయమే వ్యాక్సిన్ వేస్తున్న కేంద్రాలకు చేరుకున్నారు. గుంపులు, గుంపులుగా చేరడంతో పట్టణ సీఐ ఆంజ నేయులు సిబ్బందిని ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. నరసాపురం డీఎస్సీ వీరాంజనేయరెడ్డి పరిశీలించారు. తోపులాటకు దిగవ్దని, అందరికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టోకెన్లు ఇవ్వనున్నామని ఆ ప్రకారం వ్యాక్సిన్లు వేస్తారన్నారు. 400 మందికి రెండో డోసు వ్యాక్సిన్లు వేసినట్టు పోడూరు పీహెచ్‌సీ వైద్యాధికారి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు తెలిపారు.
తణుకులో అటూ..ఇటూ..
తణుకు,మే 8: శనివారం ఉదయం కోవాగ్జిన్ 600 డోసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మునిసిపల్ కార్యాలయం సమీపంలో నెంబర్ 1 స్కూలులో వ్యాక్సిన్ వేస్తారని తెలిసి 6 గంటలకే వందలాది మంది క్యూకట్టారు. తీరా వ్యాక్సిన్ వేసే సమయానికి బాలురున్నత పాఠశాలకు మారిపోయింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా వ్యవహరిస్తున్నారని కనీసం ఎక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారో తెలియడం లేదని పట్టణా నికి చెందిన అప్పారావు వాపోతున్నారు. ఇంకా సుమారు 2 వేలు పైబడి కోవాగ్జిన్ రెండవ డోసు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
భీమవరంలో భౌతికదూరం అసలే లేదు
భీమవరం, మే 8 : భీమవరంలో శనివారం మూడు కేంద్రా ల్లో వ్యాక్సిషన్ జరిగింది. రెండు అర్బన్ హెల్త్ సెంటర్ కేంద్రాలు, బీవీ రాజు పార్కు సచివాలయం వద్ద వ్యాక్సిన్లు వేశారు. శనివారం 800 డోసులు కోవాగ్జిన్ రావడంతో రెండో డోసు పూర్తిచేశారు. ఇంకా 11 వేల మంది వరకు ఈ రెండో డోసు కోవాగ్జిన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొవిషీల్డ్ వారి పరిస్థితి ఈ విధంగానే ఉంది. వ్యాక్సిన్ సకాలంలో రాకపోవడంతో డోసుల కోసం వచ్చిన వారు నిరాశగా వెనుతిరుగుతున్నారు. జనం భౌతిక దూరాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఒకరిని ఒకరు తోసుకుంటూ ఆయా సెంటర్లల్లో భయంకర మైన వాతావరణం కనిపించింది..
ప్రభుత్వం కళ్లు తెరవాలి –తోట సీతారామలక్ష్మి, టీడీపీ అధ్యక్షురాలు
రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధతకు, నిర్లక్ష్యానికి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కరోనా విలయతాండవం చేస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం ప్రతిపక్షాల్ని అణిచివేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి 18సంవత్సరాల పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ అందించాలి.
