తెలిసిన వ్యక్తే కదా అని అప్పులు తెచ్చి మరీ వడ్డీలకిచ్చారు.. ఆమె మోసం చేయడంతో..

ABN , First Publish Date - 2021-01-13T06:18:04+05:30 IST

సొంత సొమ్ములే కాదు.. అప్పులు తెచ్చి..

తెలిసిన వ్యక్తే కదా అని అప్పులు తెచ్చి మరీ వడ్డీలకిచ్చారు.. ఆమె మోసం చేయడంతో..
పరశురామ్‌, సావిత్రి, శ్రీనివాస్‌ (ఫైల్‌)

అప్పులిచ్చి.. ఆత్మహత్య!

భీమవరంలో పసిబిడ్డ సహా తల్లిదండ్రుల బలవన్మరణం

బంధువులకు వాయిస్‌ మెసేజ్‌ 


పాలకోడేరు(పశ్చిమ గోదావరి): సొంత సొమ్ములే కాదు.. అప్పులు తెచ్చి మరీ వడ్డీలకు ఇచ్చారు. వందలు, వేలు కాదు.. సుమారు 50 లక్షల రూపాయలు. ఇవి వసూలు కాకపోవడంతో.. డబ్బు తీసుకున్న ఆమె ఐదు రోజులుగా కనిపించకపోవడంతో బిడ్డ సహా భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పాలకోడేరు మండలం కుముదవల్లిలోని యూకలిప్టస్‌ తోటల్లో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం మండలం యనమదుర్రులో చీడే పరశురామ్‌(46) ధనసావిత్రి (35), వెంకటశ్రీనివాస్‌ (ఏడాదిన్నర) కుటుంబం నివసిస్తోంది. అధిక వడ్డీలకు ఆశపడి అత్తిలికి చెందిన హైమావతి అనే మహిళకు వీరి వద్ద ఉన్న నగదుతోపాటు వేరే వ్యక్తుల వద్ద నుంచి తెచ్చిన నగదును అప్పుగా ఇచ్చారు. అయితే ఆ మహిళ తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఐదు రోజులుగా కనిపించకుండా పోవడంతో భార్యభర్తలు మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నామని పాలకోడేరు ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తి తెలిపారు. 


మమ్మల్ని ఏమీ అనవద్దు..

బిడ్డ శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తీసుకు వెళతామని ఇంటి వద్ద చెప్పి భీమవరం వచ్చారు. అక్కడ నుంచి కుముదవల్లిలోని ఓ బిస్కట్‌ ఫ్యాక్టరీ పక్కనే వున్న తోటల్లోకి వెళ్లి మంగళవారం ఉదయం వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి బాలుడితో సహా మృతి చెందారు. చనిపోవడానికి ముందు సావిత్రి వాయిస్‌ మెసేజ్‌ను బంధువులకు పంపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చంటి పిల్లాడిని ఇంటి వద్ద ఉంచేద్దామనుకున్నాం. ఎవరికీ భారం కాకూడదనే వెంట తీసుకుపోతున్నాం. మేం ఎవరికీ అప్పులు లేం. మమ్మల్ని ఎవరూ ఏమీ అనవద్దు. మా తల్లిదండ్రులను ఏమీ అనవద్దు. ఇంటి దగ్గరున్న రాజు (మొదటి భార్య కుమారుడు)ను జాగ్రత్తగా చూడండి అంటూ వాయిస్‌ మెసేజ్‌ పెట్టారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్‌ఐ నాగభూషణం మృతదేహాలను పరిశీలించారు.


Updated Date - 2021-01-13T06:18:04+05:30 IST