పొదుపు మంత్రం

ABN , First Publish Date - 2021-11-21T05:48:41+05:30 IST

కరోనా కొత్త గుణపాఠాలు నేర్పింది. ఆర్థిక అత్యవసరాలకు ఏం చేయాలో గుర్తుచేసింది. ఇప్పుడు చాలా మంది అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెడుతున్నారు.

పొదుపు మంత్రం

కరోనా వేళ పెరిగిన ఆర్థిక భద్రత.. వైద్యావసరాలకు పెద్దపీట

అత్యవసర ఖర్చులకు నగదు నిల్వ.. స్థిరాస్తులపై మక్కువ

తిరిగి రాబట్టుకుంటున్న అప్పులు.. అత్యవసరాలకు అందని అప్పు

పేద వర్గాల్లో నగదు కష్టాలు.. జీవిత బీమాపై పెరిగిన ఆసక్తి


ఆకాష్‌ దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. మరుసటి రోజే జ్వరం వచ్చింది. కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్‌గా తేలింది. మానసిక ఆందోళనకు గురై మిత్రులకు ఇచ్చిన అప్పులపై దృష్టి పెట్టాడు. ఆసుపత్రి అవసరాలకు బాకీలు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించాడు. వారికి సమకూరక ఎవరూ ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక భార్య బంగారు నగలు కుదువపెట్టి సొమ్ము తెచ్చుకుని వైద్యం చేయించుకున్నాడు. ఈ అనుభవంతో పొదుపుపై దృష్టి పెట్టాడు.


ఆనంద్‌ తన వద్ద ఉన్న సొమ్ముతో స్థలం కొన్నాడు. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కట్టడంతో మరింత ఆర్థిక భారం పెరిగింది. ఓ వైపు బ్యాంకు ఈఎంఐ, మరోవైపు పిల్లల విద్య, వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రుల మందులకు అవుతున్న ఖర్చు లెక్కిస్తే తనకు వస్తున్న జీతంకంటే బడ్జెట్‌ అధికమైంది. దీంతో ఏడాదికి రెండుసార్లు తిరుమల వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్నాడు. వేసవిలో వెళ్లే లగ్జరీ టూర్‌ను వదులుకున్నాడు. పండుగకు కొనే దుస్తుల బడ్జెట్‌ను రెండింతలు తగ్గించి పొదుపుపై దృష్టి సారించి.. వైద్యావసరాలు తగలకుండా ఉండాలని ప్రార్థన చేసే పరిస్థితికి వచ్చాడు.


పాలకొల్లు, నవంబరు 20 : కరోనా కొత్త గుణపాఠాలు నేర్పింది. ఆర్థిక అత్యవసరాలకు ఏం చేయాలో గుర్తుచేసింది. ఇప్పుడు చాలా మంది అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెడుతున్నారు. ఆర్థిక లావాదేవీలను క్రమపర్చుకుంటున్నారు. ఏ సమయంలో ఏ ఖర్చు మీద పడుతుందో తెలియని పరిస్థితుల్లో ముందుజాగ్రత్తకు పెద్దపీట వేస్తున్నారు. బయట ఇచ్చిన చేబదుళ్లు, చిన్నతరహా అప్పులతోపాటు పెద్ద మొత్తాలను సైతం వెనక్కి తీసుకుంటున్నారు. మధ్య, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు స్థిరాస్తులవైపు దృష్టి సారిస్తున్నాయి. కొంత నగదు నిల్వ ఉంటే మరికొంత బ్యాంకు రుణాలు తీసుకుని వ్యక్తిగత భవన నిర్మాణాలు చేపట్టేవారు కొందరైతే.. మరికొందరు తాము బయట ఇచ్చిన అప్పులు వసూళ్లు చేసుకుని పొలాలు కొనుగోళ్లు చేస్తున్నారు. గతేడాది మార్చిలో వెలుగుచూసిన కరోనా ప్రజలకు అనేక పాఠాలు నేర్పడంతోపాటు ఉన్నట్టుండి ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితులు ఎదురుకావడంతో అధిక కుటుంబాలకు నగదు నిల్వలపై శ్రద్ధ పెరిగింది. తమ స్థోమతకు తగ్గట్టుగా కొంత నగదును ఇంటిలో నిల్వ ఉంచుకుని వైద్యం వంటి అత్యవసర అవసరాలకు వినియోగిస్తున్నారు. రెండు దశాబ్దాలకు ముందు కనుమరుగైన చిన్నమొత్తాల పొదుపు పథకాలు ఇప్పుడు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో విలాసాల వంటి అనవసరపు ఖర్చులు తగ్గించుకుని అత్యవసరాలకే సొమ్ములు వెచ్చించే విధంగా నెలవారీ బడ్జెట్‌ రూపొందించుకుంటున్నారు. జిల్లాలోని అనేక పేద, మధ్య తరగతి కుటుంబాలలో పొదుపు ఆవశ్యకతను గుర్తించి నగదు నిల్వ చేయడానికి ప్రాఽధాన్యం ఇస్తుండగా మరికొందరు బంగారం కొనుగోలు చేస్తున్నారు. అధిక వడ్డీ వస్తుందని బయట అప్పు ఇస్తే అవసరానికి తిరిగిరాని పరిస్థితి. స్థిరాస్తులపై అధిక మొత్తం పెట్టుబడి పెట్టినా అవసరానికి నగదుగా మారదు. నగదు నిల్వ ఉంచితే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. బంగారంపై పెట్టుబడి పెడితే ధర పెరుగుతూ ఉండడమే కాకుండా, అత్యవసరానికి బంగారంపై రుణం పొందే అవకాశం. ఇంకా అవసరమైతే అమ్మి సొమ్ము చేసుకునే అవకాశాలు ఉండడంతో బంగారం కొనుగోలుపై మక్కువ చూపిస్తున్నారు.


  బీమాపై పెరిగిన ఆసక్తి

ఒకప్పుడు బీమా ఏజెంటు కనిపిస్తే పారిపోయే పరిస్థితి. దశాబ్ద కాలంగా జీవిత బీమాపై అధికశాతం పౌరుల్లో అవగాహన పెరిగింది. యాంత్రిక జీవనంలో తెలియకుండానే శరీరంలోకి ప్రవేశించే రోగాలు, ఆకస్మిక మరణాలతో ప్రజల్లో చైతన్యం పెరిగి బీమాను ఆదరిస్తున్నారు. కరొనా నేపథ్యంలో గత ఇరవై నెలలుగా మూడింట ఒకవంతు బీమా వ్యాపారం పెరిగినట్టు ఎల్‌ఐసీ వంటి సంస్థలు చెబుతున్నాయి. కరోనాతో డెత్‌ క్లైముల రేటు గణనీయంగా పెరిగినప్పటికీ అంతకంటే అధికంగా బీమా వ్యాపారం పెరిగినట్టు పలు బీమా సంస్థలు తమ త్రైమాసిక నివేదికల్లో పేర్కొంటున్నాయి.


  ఆరోగ్య బీమాకు ఆదరణ 

వైద్య ఖర్చులు పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనారోగ్యల బారినపడితే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెంచుకుని బీమా పాలసీలు కొనుగోళ్లు చేస్తున్నారు. భారతీయ జీవిత బీమా సంస్థతో పాటు పలు ప్రైవేటు బీమా సంస్థలు, జనరల్‌ ఇనూ్సురెన్స్‌ కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలు విక్రయిస్తున్నాయి. కరోనాకు ముందు అమ్మకాలతో పోలిస్తే పలు బీమా సంస్థలకు 50 శాతం అదనంగా పాలసీలు లభిస్తున్నట్లు చెబుతున్నాయి. గతంలో తపాల శాఖతోపాటు పలు బ్యాంకులు చిన్నమొత్తాల పొదుపునకు ప్రాధాన్యం ఇచ్చేవి. కిడ్డీ బ్యాంకు వంటి పథకాలతో చిన్న మొత్తాలను పొదుపు చేయించి, కొంత మొత్తం నగదు పొదుపైన తరువాత ఆ మొత్తాన్ని డిపాజిట్‌గా వేయించేవారు. పోస్టలు, పలు బ్యాంకుల ఏజెంట్లను నియమించి వర్తక సముదాయాలు, ఇళ్ల వద్ద రోజువారీ డిపాజిట్లు సేకరించేవారు. ఇప్పుడు దాదాపు ఈ తరహా పొదుపు పథకాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో వ్యక్తిగత పొదుపుపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. పెద్దలతోపాటు పిల్లలు తమ వద్ద ఉన్న చిన్న మొత్తాలను, తల్లిదండ్రులు తమ అవసరాలకు ఇచ్చే కొద్దిపాటి నగదును పొదుపు చేయడం గమనార్హం. మొత్తంగా కరోనా మహమ్మారి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పెట్టినప్పటికీ అధికశాతం పౌరులకు పొదుపు మంత్రం నేర్పింది.

Updated Date - 2021-11-21T05:48:41+05:30 IST