సీజనల్‌ వ్యాధులపై యుద్ధం

ABN , First Publish Date - 2021-08-28T04:39:15+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యాధులను అరికట్టడానికి కార్పొరేషన్‌ అధి కారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఎంహెచ్‌వో) గోపాల నాయక్‌ వివరించారు.

సీజనల్‌ వ్యాధులపై యుద్ధం

మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ గోపాల నాయక్‌

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఆగస్టు 27: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యాధులను అరికట్టడానికి కార్పొరేషన్‌ అధి కారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (ఎంహెచ్‌వో) గోపాల నాయక్‌ వివరించారు. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ, మురుగునీటి పారుదల సరిగ్గా లేకపోవడం, ఎప్పటి కప్పుడు చెత్త ఎత్తకపోవడం, చెత్తపై పందులు దొర్లడం తద్వారా దోమల వ్యాప్తి వెరసి ప్రజలు అనారోగ్యాల పాలు కావడం వీటిని అరికట్టడానికి తీసు కునే చర్యలను వివరించారు. 

 నగర పాలక సంస్థలో సుమారు 55 వేలకు పైగా కుటుంబాలు ఉన్నా యి. నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లను 9 సర్కిళ్లుగా,  ఈ సర్కిళ్లను 173 ప్యాకెట్లుగా విభజన చేశాం. ఒక్కో పాకెట్‌కు 250 నుంచి 350 గృహాలు ఉంటాయి. ఈ ప్యాకెట్‌కు ఇద్దరు పారిశుధ్య కార్మికులను నియమించాం. వీరు ఉదయం 5.30 గంటల నుంచి 10.30 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించడం, రోడ్లపై ఉన్న చెత్తను ఎత్తడం, డ్రైయిన్లను శుభ్రం చేయడం, దోమలు ప్రబలకుండా స్ర్పేచల్లడం లాంటివి చేస్తున్నాం. పర్మినెంట్‌ పారి శుధ్య కార్మికులు 166 మంది, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు 316 మంది ఉన్నారు. వీరితో పాటు గ్రామ సచివాలయాల్లో శానిటరీ సెక్రటరీలు 62 మంది, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, 18 మంది మేస్త్రీలు ఉన్నారు. 

రోడ్లపై ఉన్న చెత్తను ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను పోణంగిలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నాం. రోజుకు 79 టన్నులు చెత్త వస్తుంది. దీనిలో 25 టన్నుల తడిచెత్త, 54 టన్నుల పొడిచెత్త వస్తుంది. తడిచెత్తతో పోణంగిలోని డంపింగ్‌ యార్డులో వర్మి కంపోస్టు తయారు చేస్తున్నాం. రోజుకు సుమారు 300 కేజీలు వర్మి కంపోస్టు వస్తుంది. దీనిని పార్కుల్లోని చెట్లకు, డివైడర్ల మధ్యలో ఉన్న చెట్లకు, ఇంకా ప్రభుత్వం పెంచే మొక్క లకు ఉపయోగిస్తున్నాం. అవసరమైతే రైతులు కొనుగోలు చేసుకోవచ్చు. 

దోమలు వల్ల మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలో ఈ కేసులు ఎక్కడా లేవు. దోమలు నివారించడానికి రోడ్లపై నిల్వ ఉన్న నీటిని తొలగించడం, డ్రైయిన్లలో ప్రతి రోజు సిల్టు తీయడం చేస్తున్నాం. అనంతరం దోమలు ప్రబలకుండా యాంటీ లార్వా ఆయిల్‌ బాల్స్‌ వదులుతున్నాం. రాత్రి సమయంలో దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తున్నాం. డ్రైయిన్లలో నీరు నిల్వ ఉన్న చోట గంబూషియా చేపలను వదులుతున్నాం.  

నగరంలో సుమారు రెండు వేల పందులు వరకూ ఉండవచ్చు. వర్షాకాలంలో పందుల వల్ల పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందుకనే నెల రోజుల నుంచి పందులు పట్టుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.  ఇప్పటికే పందుల యజమానులకు నోటీసులు ఇచ్చాం.  నగరంలో తిరుగుతున్న వీధి కుక్కులను పట్టుకుని ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నాం. రేబిస్‌ సోకుండా వ్యాక్సినేషన్‌ చేస్తున్నాం.  

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కాచిచల్లార్చిన నీరు తాగాలి. వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. దోమల నుంచి రక్షణ పొందడానికి దోమ తెరలు వాడాలి. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.  జ్వరాలు వచ్చినప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.  

Updated Date - 2021-08-28T04:39:15+05:30 IST