రిజిస్ర్టేషన్ల బాదుడు?

ABN , First Publish Date - 2021-12-26T05:53:14+05:30 IST

ఆదాయం కోసం తహతహలాడుతున్న రాష్ట్ర ప్రభు త్వం ప్రజలపై మరో భారాన్ని మోపింది.

రిజిస్ర్టేషన్ల బాదుడు?

ఆదాయమే లక్ష్యంగా చార్జీల వసూళ్లు

ఒక్కో లావాదేవీకి 12.5 శాతం స్టాంపు ఫీజు

రోజుకో రకం చార్జీలతో ఠారెత్తిస్తున్న ప్రభుత్వం

నిన్న అసమ భాగాలపై.. నేడు పవర్‌ ఆఫ్‌ అటార్నీపై వాత

కుదేలైపోతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం


కరోనా అనంతర కాలంలో ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలు దారుణంగా పడిపోయాయి. అన్ని వర్గాలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో జిల్లాలో ఆస్తులు అమ్ముకునేవారే గాని కొనేవారు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు స్తంభించి పోయే పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తులు, రియల్‌ ఎస్టేటు వ్యాపారుల చొరవతో వారి వద్ద ఉన్న సొమ్మును అడ్డం వేసి లావాదేవీలు నామమాత్రంగానైనా నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. ఈ తరహా లావాదేవీల్లో కీలకంగా ఉండే ‘సేల్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ’పై చార్జీల మోత మోగించింది. పాత విధానాన్నే కొద్దిగా మార్చి భారీగా ఫీజులు కొల్ల గొడుతోంది. దీంతో జిల్లాలో ఆస్తులు అమ్మేవారే కానీ కొనేవారు కనిపించని పరిస్థితి ఏర్పడింది.


ఏలూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : 

ఆదాయం కోసం తహతహలాడుతున్న రాష్ట్ర ప్రభు త్వం ప్రజలపై మరో భారాన్ని మోపింది. రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్త కొత్త మెలికలతో ప్రజల ఆదాయాన్ని భారీగా కొల్లగొడుతోంది. కిందటి నెల అసమ భాగ పంపిణీలపై మోత మోపిన ప్రభుత్వం, నేడు సేల్‌  కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీపై భారాన్ని మోపింది. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలు కనీస స్థాయికి పడి పోయిన ఈ సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో మధ్యవర్తులు, రియల్లర్లు, వ్యాపారులు లావాదేవీలు నిర్వహించేందుకు ముందుకు రాని పరి స్థితి ఏర్పడింది. ఒక్కో లావాదేవీపై గతంలో కంటే నాలుగు శాతం భారం పెరిగింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ రూపంలో జరిగే ఒక్కో క్రయవిక్రయ లావాదే వీకి ఉన్న ఆస్తిలో 12.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో మధ్యవర్తులు ఆస్తులు కొనాలన్న ఆలోచనకే స్వస్తి చెబుతున్నారు.  


కొత్త విధానంతో 4 శాతం అదనం

ఆస్తుల క్రయవిక్రయాలకు సేల్‌ కమ్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ కీలకంగా ఉంటుంది. పవర్‌ ఆఫ్‌ అటార్నీకి కక్షిదారుడు చనిపోయేంత వరకు లైఫ్‌ ఉండడం, ఒక్క శాతమే అదనంగా స్టాంపు ఫీజు ఉండడంతో మధ్య వర్తులు, రియల్టర్లు ముందుగా ఆస్తులు కొని ఆ తరు వాత తగిన రేటు వచ్చే వరకు వేచి ఉండి విక్రయిం చుకుంటారు. దీని వల్ల మధ్యవర్తులు లాభపడు తుంటారు. పవర్‌ ఆఫ్‌ అటార్నీ విధానం లేకుంటే రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఒక్కో లావాదేవీకి 7.5 శాతం చొప్పున మొ త్తం 15 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. సేల్‌ కమ్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ విధానంలో జరిగే లావాదేవీలో మధ్యవర్తి తన పేర పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేసుకున్నం దుకు ఐదు శాతం స్టాంపు ఫీజు చెల్లించినా, ఆస్తిని వేరేవారికి విక్రయించిన సమయంలో నాలుగు శాతం వెనక్కి వచ్చేస్తుంది. అంటే అతడు ఒక శాతం మాత్ర మే స్టాంపు ఫీజు కడతాడు. మొత్తం లావాదేవీకి 8.5 శాతం స్టాంపు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త విధానంలో తాజా నిర్ణయం ప్రకారం పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేసుకున్న వ్యక్తే ఆ ఆస్తిని కొనుక్కుంటే గతంలో మాదిరిగానే నాలుగు శాతం తిరిగి ఇచ్చేస్తారు. లేదని అతడు బయటివారికి విక్ర యిస్తే గతంలో తిరిగి ఇచ్చిన నాలుగు శాతం ఫీజు వెన క్కి రాదు. ఫలితంగా ఒక్కో లావాదేవీకి 12.5 శాతం స్టాంపు ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అంటే లక్ష రూపాయల ఆస్తికి పవర్‌ ఆఫ్‌ అటార్నీ ద్వారా జరిగే లావాదేవీకి ఎనిమిదిన్నర వేలు స్టాంపు ఫీజు కింద చెల్లి స్తే, ఇప్పుడు పన్నెండున్నర వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మధ్యవర్తులు ముందుకు రావడం లేదు. 


క్రయవిక్రయాలు కుదేలు.. 

జిల్లాలో సగటున ప్రతి నెలా 35 వేల రిజిస్ట్రేషన్లు జరు గుతాయి. వీటిలో ఐదువేల రిజిస్ట్రేషన్లు కూడా క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో 80 శాతానికి పైగా బాండ్లు, తనఖా రిజిస్ట్రేషన్లు మాత్రమే ఉంటు న్నాయి. మిగిలినవాటిలో గిఫ్ట్‌డీడ్‌, పార్టీషన్‌ రిజి స్ట్రేషన్లే మెజారిటీ జరుగుతుంటాయి. గత రెండేళ్లుగా కొత్తకొత్త పద్ధతుల్లో భూ ముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీల భారం 40 నుంచి 60 శాతా నికి పెరిగింది. ఈ భారంతో జిల్లాలో క్రయవిక్రయ లావా దేవీలు బాగా తగ్గాయి. అయితే మధ్యవర్తులు, రియ ల్టర్ల వ్యాపార దృష్టి కారణంగా లావాదేవీలు ఆగ కుండా నామమాత్రంగానైనా సాగుతున్నాయి. ప్రభు త్వ తాజా నిర్ణయంతో మధ్య వర్తులు, రియల్టర్లు పూర్తిగా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా అంతంత మాత్రంగా జరుగుతున్న ఈ లావాదేవీలు కూడా జరుగుతాయో లేదోనన్న పరిస్థితి ఏర్పడింది.  

Updated Date - 2021-12-26T05:53:14+05:30 IST