అన్నదాతకు గుండెకోత

ABN , First Publish Date - 2021-06-21T05:39:38+05:30 IST

అన్నదాత పరిస్థితి అస్తవ్యస్తం గా తయారైంది.

అన్నదాతకు గుండెకోత

బస్తాకు రూ.200 వరకు కట్‌

ఎంటీయూ 1153, 1156 రకాల ధాన్యంపై సాకులు 

మద్దతు ధర రూ.1401చెల్లిస్తున్నది రూ.1200 


భీమవరం, జూన్‌ 20 : అన్నదాత పరిస్థితి అస్తవ్యస్తం గా తయారైంది. అష్టకష్టాలు పడి పంట పండిస్తే.. చేతికొచ్చిన  ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అమ్మి రెండు నెలలైనా సొమ్ము రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ధాన్యం సొమ్ములో సాకులు చెప్పి అడ్డకోలుగా కోత కోస్తున్నారు. ఎంటీయూ 1153, 1156 రకాలకు బస్తాకు రూ.200 కోత విధిస్తున్నారు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. ఇవేం అడ్డకోలు కోతలంటూ లబోదిబో మంటున్నారు. ఈ సీజన్లో పంట కొనుగోలు ప్రారంభించాక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1153, 1156 రకం ధాన్యానికి బస్తాకు రూ.200 కోత వేసి కొంటున్నారు. వాస్తవానికి ధాన్యం మద్దతు ధర రూ.1401 ఉంది. ఇతర రకా లు ఆ ధరకే కొంటున్నారు. కానీ ఈ ధాన్యం అమ్ముతున్న రైతుకు రూ.1200లే చెల్లిస్తుండడంతో అన్నదాతలు ఆవే దన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఈ రకం ధాన్యాన్ని పం డించవద్దని ప్రభుత్వం చెప్పిందంటూ కోత విధించి కొంటున్నారు. ఖరీఫ్‌ జాబితాలో ఈ ధాన్యం ఉంది. మొదట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేల ద్వారా దీనిని కొన్నారు. తరువాత కొద్ది రోజులకు నీ ధాన్యం ఆన్‌లైన్‌ అవడం లేదంటూ సొమ్ము చెల్లింపులో జాప్యం చేస్తున్నారు.  దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం రావడం లేదని వాపోతున్నారు. తొలి రోజుల్లో రూ.1250కు కొన్నారు. ప్రస్తుతం 1200లకు కొంటున్నారు. 75 కేజీల ధాన్యం బస్తా రూ.1401లకు కొనాలి. కానీ ఏకంగా రూ.200 తగ్గించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రకాల ధాన్యం జిల్లాలో సుమారు 4 లక్షలు మెట్రిక్‌ టన్నులు ఉంటుందని చెబుతున్నారు. తగ్గించిన ధర ప్రకారం చూస్తే హెక్టార్‌కు రూ.6 వేలు రైతు నష్టపోతున్నాడు.  


 ఇది అన్యాయం

ఈ రకం ధాన్యంపై కోత విధించడం సరికాదు. 150–200 రూపాయిలు తగ్గించడం అన్యాయం. కరో నా పరిస్థితులను ఆసరాగా చేసుకుని అయినకాడికి రైతులు అమ్ముకునేలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. వెంటనే సరిదిద్దాలి. 

– గాదిరాజు నాగేశ్వరరాజు(నాగబాబు),   రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి.

 

కౌలు రైతులకు నష్టం

ఈ పంట అమ్మకాల్లో  కౌలు రైతులు నానా ఇబ్బందులు పడ్డా రు. ధర భారీగా తగ్గించడం, సొ మ్ము జమ చేయడంలో ఆలస్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. నెలలు తరబడి డబ్బులు వేయకపోవడంతో తెచ్చిన అప్పులకు  వడ్డీలు కట్టి నష్టపోతున్నాం.  

ఎం.రామాంజనేయులు, కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి

 

 ఎప్పుడూ చూడలేదు

దాళ్వా ధాన్యం విక్రయాల్లో ఇలాంటి ధర తక్కువ కొనుగోళ్ళు 20 ఏళ్ళుగా ఎప్పుడూ చూడలేదు. మద్దతు ధరకంటే 150 రూపాయిలు తక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనడంతో 20 రోజుల పాటు ధాన్యం అమ్మలేకపోయాం. తప్పనిసరి పరిస్ధితుల్లో వాతావరణానికి భయపడి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చింది.  

కె.జనార్దనరావు, రైతు, భీమవరం మండలం


డబ్బులు పడక ఇబ్బందులు పడుతున్నాం..

జి.వెంకటేశ్వరరావు, రైతు, భీమవరం మండలం

అక్కడ ఇక్కడా తెచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం అమ్మాం. నెలా పదిహేనురోజుల నుంచి ధాన్యం సొమ్ము రాక ఇబ్బంది పడుతున్నాం. పదిహేను ఎకరాలు సాగు చేశాం. ఐదు లక్షలుపైగా రావాల్సి ఉంది. ఎరువులకు, పురుగుమందులకు అరువు తెచ్చిన చోట చెల్లింపులు చేయలేక అవస్థలు పడాల్సి వస్తుంది.   

Updated Date - 2021-06-21T05:39:38+05:30 IST