పనులకు.. ఎదురీత!

ABN , First Publish Date - 2021-06-23T05:06:37+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం పట్టణానికి స్విమ్మింగ్‌ పూల్‌ మంజూరు చేశారు.

పనులకు.. ఎదురీత!
నిలిచిపోయిన నిర్మాణ పనులు

 మూడేళ్లగా అసంపూర్తిగా స్విమ్మింగ్‌ పూల్‌ పనులు

 కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం

  తాడేపల్లిగూడెంలో అందుబాటులోకి రాని క్రీడా వసతి 

 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం పట్టణానికి  స్విమ్మింగ్‌ పూల్‌ మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం రూ.1.35 కోట్ల నిధులు కేటాయించారు. నిర్మాణ బాధ్యతలను హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. టెండర్‌లు పిలిచి అప్పట్లోనే పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కేవలం రంగులు వేయాల్సి ఉంది. యంత్ర పరికరాలను అమర్చి స్విమ్మింగ్‌ పూల్‌ను అందుబాటలోకి తేవాలి. కానీ ఆదిశగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. స్విమ్మింగ్‌ పూల్‌ వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజాప్రతినిధులు దానిపై శ్రద్ధ చూపడం లేదు. కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. గడచిన మూడేళ్లనుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషనరీ ఏర్పాటుకు ప్రత్యేకంగా  టెండర్‌లు పిలవాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బకాయిపడ్డ బిల్లులను ఏనాడో ట్రెజరీకి పంపారు. ప్రభుత్వ స్థాయిలోనే బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ తరుణంలో కొత్తటెండర్‌లు పిలిచినా కాంట్రాక్టర్‌లు రారన్న ఉద్దేశంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ కూడా ముందడుగు వేయలేకపోతోంది. స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి గూడెం పట్టణానికి మంచి క్రీడా వసతి అందుబాటులోకి వస్తుందని పట్టణ ప్రజలు భావించారు. పాఠశాల విద్యార్థులకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని ఆశించారు. ఏళ్లు గడుస్తున్నా  సరే అందుబాటులోకి రాకపోవడంతో పట్టణ ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు దీనిపై చొరవ చూపాల్సిన అవసరం ఉంది. 


Updated Date - 2021-06-23T05:06:37+05:30 IST