కష్టాల్లో మీ–సేవ

ABN , First Publish Date - 2021-10-12T05:46:57+05:30 IST

సమస్యల సుడిలో మీ–సేవ కేంద్రాలు సతమతమవు తున్నాయి.

కష్టాల్లో మీ–సేవ

వెంటాడుతున్న స్టేషనరీ కొరత

ధ్రువీకరణ పత్రాలకూ సమస్యే

ఇండెంట్‌ ఇచ్చినా సకాలంలో అందని పత్రాలు

సచివాలయాలు రావడంతో సేవలకు దూరం

ఏలూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : సమస్యల సుడిలో మీ–సేవ కేంద్రాలు సతమతమవు తున్నాయి. సాంకేతిక సమస్యలతో పాటు స్టేషనరీ కొరత కారణంగా సేవలు బాగా తగ్గుముఖం పట్టాయి.ఫలితంగా మీ–సేవకు వచ్చే దరఖాస్తుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నాయి. వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలను సకాలంలో అందించలేకపోవడంతో వినియో గదారులు మీ–సేవలకు దూరమైపోతున్నారు. 


స్టేషనరీ కొరత

జిల్లాలో 14 అర్బన్‌ మీ–సేవ కేంద్రాలున్నాయి. వీటికి అనుబంధంగా ప్రాంచైజీ కేంద్రాలు 99 ఉన్నాయి. ఇవి కాకుండా శ్రీవెన్‌, ఏపీ ఆన్‌లైన్‌ల ఆధ్వర్యంలో మరో 400 వరకూ మీసేవ, అను బంధ కేంద్రాలు సేవలం దిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రాలకు హాలోగ్రామ్‌తో కూడిన పత్రాలు తప్పనిసరి. వీటిని ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం అందజేస్తుంది. ధ్రువీకరణపత్రాల డిమాండు ననుస రించి ఆయా సంస్థలు వీటికి ఇండెంట్‌ పెట్టుకుంటాయి. జిల్లాలోని అర్బన్‌ మీ–సేవ కేంద్రాల్లో ప్రతిరోజు సగటున 50 కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తులు అందుతున్నాయి. వీటికి తోడు రెవెన్యూ సేవలకు సంబంధించి 78 సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటికి కూడా తగిన స్టేషనరీ కావాలి. ఈ స్టేషనరీ సకాలంలో అందని కారణంగా దరఖాస్తు దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి ధ్రువీకరణ పత్రాలు అడుగు తోంది. ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.దీంతో ధ్రువీకరణ పత్రాలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రధాన మీ–సేవ కేంద్రాల్లో రోజుకి 100కు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మీ–సేవల్లోనూ 10 వరకూ వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో డిమాండు పెరగడంతో తగిన స్థాయిలో స్టేషనరీ అందుబాటులో లేకుండాపోతోంది. 


సచివాలయ సేవలతో మరిన్ని కష్టాలు

రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ 543 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. అన్నిరకాల ధ్రువీకరణపత్రాలు, రికార్డులు కూడా అక్కడ లభిస్తున్నాయి. ఫలితంగా వినియోగ దారులు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో మీ–సేవల ప్రభ మసక బారిపోయింది. దీనికి తోడు తాజాగా సమస్యల కారణంగా వాటి పరిస్థితి మరింతగా దిగజారుతోంది. 

Updated Date - 2021-10-12T05:46:57+05:30 IST