కొందరికేనా తోడు..?

ABN , First Publish Date - 2021-12-28T06:04:22+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరు మేడి పండు చందంగా తయారైంది. ప్రచారం అట్టహాసంగానూ, అమలు అంతంత మాత్రంగా తయారైంది.

కొందరికేనా తోడు..?

నేడు జగనన్న తోడు మూడో విడత ప్రారంభం 

జిల్లాలో మొత్తం దరఖాస్తులు 86,723

బ్యాంకు లాగిన్‌కు వెళ్లినవి 73,968

ఆమోదం పొందినవి 940

ఏలూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరు మేడి పండు చందంగా తయారైంది. ప్రచారం అట్టహాసంగానూ, అమలు అంతంత మాత్రంగా తయారైంది. మంగళవారం ప్రారంభం కాబోతున్న జగనన్న తోడు మూడో విడత లబ్ధిదారుల ఎంపిక ఒక్కశాతం కూడా పూర్తికాక పోవడమే అందుకు నిదర్శనం. జిల్లాలో పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వేలల్లో ఉండగా, ఇప్పటి వరకూ పథకం పొందిన వారు వందల్లో ఉన్నారు. జిల్లాలో 86,726 మంది దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తులు పరిశీలించి గ్రామీణ పేద రిక నిర్మూలనా సంస్థ సెర్ప్‌, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) 73,698 మందిని అర్హులుగా గుర్తించింది. గ్రామాలకు సంబంధించి 64,434 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం నిర్ణయించుకోగా 76,525 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 72 వేల మందిని అర్హులుగా గుర్తించి బ్యాంకు లాగిన్‌కు పంపించారు.  929 మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేం దుకు ఆమోదం లభించింది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి 16,210 మందికి రుణాలు మంజూరు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించుకోగా 10,198 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1500 మంది దరఖాస్తులను బ్యాంకు లాగిన్‌కు పంపగా వాటిలో 11 మందికి మాత్రమే ఇప్పటి వరకూ రుణాలు మంజూ రయ్యాయి. తొలి రెండు విడతల్లో జిల్లాలో 90,300 వేల మందికి జగనన్న తోడు రుణాలు మంజూరయ్యాయి.తొలివిడతకు సంబంధించి ఇప్పటివరకూ 2,512 మంది మాత్రమే రుణాలను తిరిగి చెల్లించారు. 42,176 మంది ఇంకా కడుతూ ఉన్నారు. 529 మంది మాత్రం కట్టకండా ఆపేశారు. వీరిలో 12,680 మంది మాత్రమే రెన్యువల్‌కు అర్హత సాధించారు.    


 మూడొంతుల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులే

జగనన్నతోడు పథకం ద్వారా వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేకుండా రూ.10 వేలు రుణం అందించి వారి వ్యాపార,ఆర్థికాభివృద్ధిని పెంచాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సంక్షేమ సహాయకులకు బాధ్యత అప్పగించింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనం తొలి విడతలో కొంత మేర నెరవేరింది. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మొరాయిస్తుండడంతో ప్రభు త్వం స్త్రీనిధి ద్వారా రెండో విడత పథకానికి రుణాలు ఇప్పించారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి లబ్ధిదారుల ఎంపిక సెర్ప్‌, మెప్మాలకు అప్ప గించారు. దీంతో ప్రస్తుత లబ్ధిదారుల్లో మూడొంతుల మంది డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలే ఉన్నారు. దీంతో సాధారణ వ్యాపారులు పథకానికి దూరమయ్యారు. 


 బ్యాంకు లాగిన్లకు పంపాం : శరత్‌, ఏపీఎం

జిల్లాలో సెర్ప్‌ పరిధిలో 76,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 72 వేల మందిని అర్హులుగా గుర్తించాం. ఆ దరఖాస్తులను బ్యాంకు లాగిన్లకు పంపాం. వారు ఇప్పటి వరకూ 929 మందిని ఓకే చేశారు.  ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అందరికీ రుణాలు వస్తాయి.  

Updated Date - 2021-12-28T06:04:22+05:30 IST