మురుగునీటికి మార్గమేదీ ?
ABN , First Publish Date - 2021-03-25T04:51:56+05:30 IST
రెవెన్యూ డివిజన్ కేంద్ర మైన కొవ్వూరు పట్టణంలో దశాబ్ధాలుగా మేజర్ అవుట్‌లెట్ డ్రెయినేజీల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి.

పరిష్కారానికి నోచుకోని డ్రెయిన్ల సమస్య... మురుగు నీరు నిల్వతో దుర్గంధం, దోమలు
కొవ్వూరు, మార్చి 24: రెవెన్యూ డివిజన్ కేంద్ర మైన కొవ్వూరు పట్టణంలో దశాబ్ధాలుగా మేజర్ అవుట్‌లెట్ డ్రెయినేజీల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి. పట్టణంలోని 23వ వార్డు నుంచి వాడుకనీరు, వర్షపునీరు సక్రమంగా బయటకు పోయేమార్గం లేకపోవడంతో దోమలకు నిలయంగా మారింది. కచ్చాడ్రెయిన్‌లలో గుర్రపుడెక్క పెరిగి పూడుకుపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలచిపోతున్నది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మేజర్ అవుట్‌లెట్‌ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలో ఏలూరు బైపాస్ రోడ్డుకు ఇరుపక్కల, నందమూరు రోడ్‌లో రోడ్డుకు ఇరు పక్కల, రైల్వేస్టేషన్, ఔరంగాబాద్, శ్రీనివాసపురం కాలనీల నుంచి కొంగలబాడవ వరకు సుమారు 13 కిలోమీటర్లు అవుట్‌లెట్ డ్రెయిన్‌లు విస్తరించి ఉన్నాయి. వీటిలో 60శాతంపైగా కచ్చా డ్రెయినేజీలు కావడంతో పట్టణంలో మురుగునీరు సక్రమంగా పారక దోమలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల నందమూరు రోడ్‌లో రెండు మేజర్ డ్రెయిన్లు నిర్మాణానికి సుమారు రూ.2 కోట్లతో టెండర్లు పూర్తి అయ్యి నిర్మాణం చేపట్టే సమయంలో కరోనా కారణంగా నిలచిపోయాయి. ప్రస్తుతం ధరల పెరుగుదలతో నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పాత టెండరును రద్దుచేసేందుకు అఽధికారులు చర్యలు చేపడుతున్నారు.
డ్రెయినేజీల సమస్య పరిష్కరిస్తాం
శ్రీనివాసపురం నుంచి కొంగలబాడవ వరకు 4 కోట్ల రూపాయలతో డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నందమూరు రోడ్‌లో నిలిచిపోయిన డ్రెయినేజీల నిర్మాణాలకు రీటెండర్లు పిలుస్తాం. అదేవిధంగా పట్టణంలో కాంటూరు లెవిల్స్‌తో డ్రెయినేజీల నిర్మా ణం చేపట్టేందుకు కాంప్రహెన్సివ్ డ్రెయిన్ల సర్వే పూర్తయ్యింది. మురుగునీరు సక్రమంగా బయటకు పోయే విధంగా కొంగలబాడవ, ఏలూరు రోడ్‌లోని వెంకాయమ్మ చెర్వు వద్ద మురుగునీరు ట్రీట్‌మెంటు ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
– కమిషనర్ కేటీ.సుధాకర్