17 మరణాలు.. 2,066 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-05-21T05:19:42+05:30 IST
కరోనా తీవ్రతతో జిల్లాలో రెండో రోజు గురువారం 17 మంది మృతిచెందారు.

ఏలూరు ఎడ్యుకేషన్, మే 20 : కరోనా తీవ్రతతో జిల్లాలో రెండో రోజు గురువారం 17 మంది మృతిచెందారు. కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి, మృతుల సంఖ్య సరళిని పరిశీలిస్తే సోమవారం నుంచి గురువారం వరకు రికార్డు స్థాయిలో 6,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 58 మంది బాధితులు కరోనా కాటుకు బలవడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే జిల్లాలో 2,066 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, ఒకేరోజున ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మృత్యుల సంఖ్య ఉండడం ఇదే ప్రథమం. తాజా కేసులతోపాటు యాక్టివ్ కేసుల సంఖ్య 14,421కి పెరిగింది. కొత్తగా 42 చోట్ల కంటైన్మెంట్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి.
చితి మంటలు ఆరకముందే
పాలకొల్లు/రూరల్, మే 20 : భార్య చితి మంటలు ఆర కుండానే భర్త మృతి చెందిన ఘటన పాలకొల్లు మండలంలో విషాదాన్ని నింపింది. పూలపల్లికి చెందిన బొందా వెంకటరమణ భార్య మంగతాయారు(52) కొవిడ్ బారినపడి కాకినాడ ప్రభుత్వాసు పత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం రాత్రి మృతి చెందారు. బుధవారం పాలకొల్లులో అంత్యక్రియలు నిర్వహిం చారు. అప్పటికే కరోనాతో బాధపడుతున్న భర్త వెంకటరమణ(57) భార్య అంతిమ సంస్కారానికి వెళ్లి ఇంటికి రాగానే పరిస్థితి విషమించింది.ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
24 గంటలు గడవకుండానే..
భార్య మరణించిన 24 గంటలు గడవకముందే.. భర్త గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. పంచాయతీరాజ్ శాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేసిన పాలకొల్లుకు చెందిన పోకల శేషావతారం(84) భార్య సత్యరత్నం(79) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. దీనిని జీర్ణించుకోలేని భర్త కూడా బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఒకే రోజు కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వీరి కుమారుడు నరేశ్‌కుమార్ ఆంధ్రజ్యోతి పాలకొల్లు టౌన్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.