టిక్కెట్ తెగలేదు...
ABN , First Publish Date - 2021-07-09T05:25:57+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా అన్నింటితో పాటు వినోద రంగం కుదేలైంది.

అనుమతిచ్చినా తెరుచుకోని థియేటర్లు
సమస్యలపై ప్రభుత్వానికి విన్నపం
ఏలూరు కల్చరల్, జూలై 8 : కరోనా మహమ్మారి కారణంగా అన్నింటితో పాటు వినోద రంగం కుదేలైంది. ప్రధానంగా సినిమా థియేటర్లు గతేడాది ఆరు నెలలు, ఈ ఏడాది రెండు నెలలుగా మూతపడ్డాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం సడలింపుల్లో భాగంగా హోటళ్లు, జిమ్ములతో పాటు సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమ తించింది. 8వ తేదీ నుంచి సినిమాహాళ్లు తెరచుకోవచ్చునని కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. అయితే ప్రదర్శనలు వేసేందుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో జిల్లాలో గురువారం ఎక్కడా బొమ్మ పడలేదు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుంచి యాజమాన్యాలకు, ఇటు కార్మికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతించింది. రోజూ థియేటర్లు శానిటైజ్ చేయాలని, సగం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని నిబంధనలు విధించింది. నిబంధనలతో థియేటర్లు నడపడం కష్టమని భావించిన యాజ మాన్యాలు తెర ఎత్తలేదు. గతేడాది ఆరు నెలలు, ఈ ఏడాది రెండు నెలలు హాళ్లు మూత పడినందున విద్యుత్ బిల్లులు రాయితీతో పాటు పన్నులు చెల్లింపులో వెసులుబాటు కల్పించాలని, గతంలో ఉన్న విధంగానే కొత్త సినిమాలు, ప్రముఖ హీరోల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి, టిక్కెట్ల ధర విషయంలోనూ సడ లింపు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో యజమానులు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఒక వేళ తెరచినా కరోనా భయంతో ఎంత మంది ప్రేక్షకులు వస్తారోనన్న భయం యజమానులను వెంటాడుతోంది. దీనికి తోడు కొత్త సినిమా ఊసేలేదు. థియేటర్లు తెరిచినా నష్టాలు తప్పవన్న భావనలో కొందరు యజమానులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 91 థియేటర్లు ఉన్నాయి. ప్రధాన హాళ్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యేకంగా పరోక్షంగా రెండు వేల కుటుంబాలకు పైగా ఉపాధి పొందుతున్నాయి. వీరి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గతంలో విధానమే కొనసాగించాలంటూ ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.