వ్యాపారాలు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-31T04:51:41+05:30 IST

చిన్న వ్యాపారులకు కరోనా. లాక్‌డౌన్‌ ఆర్థిక కష్టాలు తెచ్చిపెట్టింది.

వ్యాపారాలు లాక్‌డౌన్‌

తణుకు, మే 30: చిన్న వ్యాపారులకు కరోనా. లాక్‌డౌన్‌ ఆర్థిక కష్టాలు తెచ్చిపెట్టింది. రెండు సంవత్సరాల నుంచి కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని వర్తకులు వాపోతున్నారు. షాపుల అద్దెలు కట్టలేక, విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు చెబుతున్నారు.

 జిల్లా వ్యాప్తంగా ఆరు వేల కిళ్ళీ, బీడి, సిగరెట్‌, సోడా, కూల్‌ డ్రింక్స్‌ వర్తకులు ఉన్నారు. ఒక్కో షాపుకు ఇద్దరు చొప్పున ఉన్నప్పటికి సుమారు పన్నెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి అదనంగా కుటుంబ సభ్యులు పనిచేస్తారు. ఇంత ఉపాధి ఉన్న చిన్న వర్తకులు ఇపుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి, రెండు వేవ్‌లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. గత సంవత్సరంలో, ప్రస్తుతం మార్చి, ఏప్రిల్‌, మే నెలలు వ్యాపారాలకు కీలకం. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌ వల్ల పూర్తిగా నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు.

చిన్నబోయిన చిరు వ్యాపారం
ఇరగవరం, మే 30: కరోనా కాటుతో అన్ని రంగాలు కుదేలువుతున్నాయి. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని చిరు వ్యాపారుల జీవితం తల్లకిందులైంది. కొవిడ్‌ కట్టడి చేయడం కోసం అధికారులు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. ఈ విధానం చిరువ్యాపారులకు బతుకు భారంగా మార్చింది. దూర ప్రాంతాల నుంచి కూరగాయలు, పండ్లు తెచ్చుకొని గ్రామాలలో విక్రయిస్తున్నారు. ఓపక్క కరోనా మహమ్మారి భయపెడుతున్నా వ్యాపారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. 12 గంటలు వరకు మాత్రమే అరకొరగా జరిగే వ్యాపారంతో జీవనం భారంగా మారిందని చిరువ్యాపారులు వాపోతున్నారు. 
చెత్త కుప్పలో పడేస్తున్నాం..
 విన్నా శ్రీను, కూరగాయల వ్యాపారి – రేలంగి
కూరగాయలు అన్నీ అమ్మేందుకు సమయం లేకపోడంతో పాడైపోతున్నాయి.  కుళ్ళిన కాయగూరలను చెత్తకుప్పలో పడేస్తున్నాం. నష్టం వాటిల్లుతున్నా వ్యాపారం దెబ్బతినకూడదని కొనసాగిస్తున్నాం.  Updated Date - 2021-05-31T04:51:41+05:30 IST