మరో అల్పపీడనం

ABN , First Publish Date - 2021-09-30T05:04:18+05:30 IST

గులాబ్‌ తుఫాన్‌ తీరం దాటినప్పటికీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడన ద్రోణి భయపెడుతోంది.

మరో అల్పపీడనం
శెట్టిపేట బ్రిడ్జి వద్ద వర్షపునీరు

 తగ్గిన తమ్మిలేరు, తగ్గని ఎర్రకాలువ వరద

 పొంగుతున్న యనమదుర్రు డ్రెయిన్‌

 గోదావరికి వరద.. విలీన మండలాల్లో భయం

ఏలూరు సిటీ, సెప్టెంబరు 29 : గులాబ్‌ తుఫాన్‌ తీరం దాటినప్పటికీ బంగాళాఖాతంలో మరో అల్ప పీడన ద్రోణి భయపెడుతోంది. ఇప్పటికే రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని 39 వేల 361 ఎకరాల్లో వరితోపాటు వివిధ రకాల పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. సుమారు 470 ఎకరాల్లోని పండ్ల తోటలు దెబ్బతినడంతో  రెండు న్నర కోట్ల వరకు నష్టం వాటిలింది. తమ్మిలేరు, ఎర్రకాలువలకు వరద పోటు తగ్గినా యనమదుర్రు డ్రెయిన్‌ పొంగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో ఎర్రకాలువకు వచ్చిన వరదల వల్ల తాడేపల్లిగూడెం మండలంలో వందలాది ఎకరాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. నిడదవోలులో శెట్టిపేట రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నీరు నిలిచి పోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాలతో పాటు భీమవరంలో యనమదుర్రు ఉధృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు, ఎర్రకాలువ కింద వరదల కారణంగా 39 వేల 361 ఎకరాల్లో పంటలు ముంపు లోనే ఉన్నాయని వ్యవసాయ శాఖాధికారుల నివేదికలు చెబుతున్నాయి.వర్షాలు శాంతిస్తే పంట నష్టాలు తగ్గుతాయని, అయితే అల్పపీడన ప్రభావం ఉందని వాతావారణ శాఖ ప్రకటించటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గత 24 గంటల్లో ఆచంట మండలంలో అత్యధికంగా 46.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సరాసరి వర్షపాతం 11.8 మి.మీ. కాగా వీరవాసరం 38.4, తణుకు 35.8, బుట్టాయిగూడెం 30, భీమవరం 29.2, పాలకోడేరు 26.4, పాలకొల్లు 26.2, ద్వారకాతిరుమల 25.4, పెదవేగి 25.2, దెందులూరు 22.4, పోడూరు 21.6 మి.మీ వర్షపాతం నమోదైంది.   


పునరావాస కేంద్రాలు నిర్వహించాలి కలెక్టర్‌ మిశ్రా

భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆర్డ్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి బుధవారం ఆయన వర్షాలు, వరదలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వరద తగ్గుముఖం పట్టి పునరావాస కేంద్రాల ప్రజలు వారి గృహాలకు తిరిగి వెళ్లినప్పుడు శాని టేషన్‌, ఫాగింగ్‌ తప్పని సరిగా చేయించా లన్నారు. దీనివల్ల మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులు రాకుండా నిరోధించవచ్చునన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆరు మండలాల్లోని 28 గ్రామాలు ప్రభావిత మయ్యాయన్నారు. 43 వేల 761 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని, 188.2 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ప్రభావం ఉందన్నారు. 58 ఇళ్లు దెబ్బ తిన్నాయన్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని 52 రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీనివల్ల రూ.8.40 కోట్ల విలువైన తాత్కాలిక రోడ్లు, రూ.137.94 కోట్లు విలువైన శాశ్వత రోడ్లు దెబ్బ తిన్నట్టు చెప్పారు. జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, డీఆర్‌వో వి.డేవిడ్‌రాజు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-30T05:04:18+05:30 IST