21 రోజుల తర్వాతే..

ABN , First Publish Date - 2021-12-25T06:10:27+05:30 IST

ధాన్యం సొమ్ములు చెల్లింపుకోసం ప్రభుత్వం మూడు వారాల గడువు విధించింది.

21 రోజుల తర్వాతే..

ధాన్యం సొమ్ములు చెల్లింపునకు గడువు

రైతులకు ఇవ్వాల్సింది రూ.500 కోట్లు

ఇప్పటివరకు ఇచ్చింది రూ. 105 కోట్లు 

తాడేపల్లిగూడెం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సొమ్ములు చెల్లింపుకోసం ప్రభుత్వం మూడు వారాల గడువు విధించింది. కొనుగోలు కేంద్రాల్లో నమోదు అనంతరం 21 రోజులు పూర్తయిన తర్వాతే రైతు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తోంది. గడచిన రబీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గడువు పెంచింది. వాస్తవానికి తెలుగుదేశం హయాంలో 48 గంటల వ్యవధిలోనే రైతులకు చెల్లించేవారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది 15 రోజులకు పెంచింది. ప్రస్తుత ఖరీఫ్‌లో మరో వారం రోజులు అదనంగా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో రైతులకు సొమ్ములు చెల్లింపులో జాప్యం తప్పడం లేదు. అధికారికంగా మాత్రం సకాలంలో సొమ్ములు చెల్లిస్తున్నట్టు నమోదవుతోంది. రైతులకు అందేసరికి కాలయాపన అవుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట చేతికందడంలోనే కాలా తీతమైంది. వాతా వరణం సహకరించకపోవడంతో ధాన్యం ఒబ్బిడి చేసుకోవ డానికి నెలరోజుల సమయం పట్టింది. తీరా విక్రయిద్దామంటే నూక అధికంగా ఉందంటూ కమీషన్‌దారులు నసుగు తున్నారు. మరోవైపు ధాన్యం రంగుమారిపోవడంతో కమీషన్‌ దారులకే రైతులు అప్పగిస్తున్నారు. ధాన్యం సక్రమంగా ఉంటే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటోంది. వ్యాపారులు ఎగబడు తున్నారు. అదే దెబ్బతిన్న ధాన్యానికి ధరలు తగ్గిస్తున్నారు. మొత్తంపైన రైతు పేరుతోనే కొనుగోలు కేంద్రాల్లో నమోదవుతున్నాయి. రైతుల నుంచి ధాన్యం సేకరణ వేగ వంతం కావాలన్న ఉద్దేశంతో అధికారులు కాస్త నిబంధనలు సడలించారు. ముందుగా మిల్లులకు చేరుకునే అవకాశం కల్పించారు. అక్కడకు వెళ్లిన వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిల్లర్లే సంచులను సమకూరుస్తున్నారు. దాంతో ధాన్యం కొనుగోలులో సమస్య తీరింది. సొమ్ముల విషయంలోనే గడువు పెంచారు. ఫలితంగా రైతు ఖాతాలో త్వరితగతిన జమకావడం లేదు. ఖరీఫ్‌లో 11 లక్షల టన్నుల ఽధాన్యం కొనుగోలు చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 3.76 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. రైతులకు రూ. 500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి రూ. 105 కోట్లు చెల్లించారు.  

Updated Date - 2021-12-25T06:10:27+05:30 IST