ఘాటు.. ఉండేనా?

ABN , First Publish Date - 2021-03-24T05:56:52+05:30 IST

ప్రధాన వాణిజ్య పంట.. వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

ఘాటు.. ఉండేనా?
బేల్‌ తీసుకొస్తున్న కార్మికుడు

జిల్లాలో తెరుచుకోనున్న ఐదు కేంద్రాలు 

ఈ ఏడాది పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులు

కేజీ సరాసరి ధర రూ.200పై ఉంటేనే గట్టెక్కేది 

జంగారెడ్డిగూడెం, మార్చి 23 : ప్రధాన వాణిజ్య పంట.. వర్జీనియా పొగాకు కొనుగోలు ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని దేవర పల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2 సహా మొత్తం ఐదు వేలం కేంద్రాలు తెరుచుకోనున్నాయి. వీటి పరిధిలో 14,600 బ్యారన్‌లు ఉండగా.. 60 వేల ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. ఈ ఏడాది 38.5 మిలియన్‌ కిలోల పొగాకును రైతులు పండించినట్టు బోర్డు అధికారుల ప్రాఽథమిక అంచనా. కొనుగోళ్లకు సంబంధించి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరుస సీజన్లలో నష్టాలను చవిచూస్తున్న రైతులు ఈ ఏడాదైనా మంచి ధరలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా తోటలన్నీ దెబ్బ తినడంతోపాటు పెట్టుబడులు రెట్టింపయ్యాయి. క్యూరింగ్‌, పచ్చాకు కార్మికులు, రోజువారీ కూలీలు, తడులు, ఎరువులు ఇలా అన్ని విధాలుగా పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలో సరాసరి కేజీ పొగాకు ధర రూ.200 వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని రైతులు కోరుతున్నారు. వేలం ప్రక్రియలో అన్ని కంపెనీల్లో పాల్గొనే విధంగా బోర్డు ఆంక్షలు విధించాలని కోరుతున్నారు. గతేడాది ప్రారంభంలో ఒక మాదిరిగా ధరలు వున్నా క్రమేపీ ధరలు తగ్గుముఖం పట్టాయి. చివరకు వచ్చేసరికి లోగ్రేడ్‌ పొగాకు అత్యల్ప ధరలు పడ్డాయి. ఈ క్రమంలో చివరకు సరాసరి ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా ప్రతీ రైతుకు ఒక్కో బ్యారన్‌కు రూ.లక్ష పైగానే నష్టం వచ్చిందని, కనీసం బ్యాంక్‌ రుణాలు తీరక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస సీజన్‌లలో వస్తున్న నష్టాలతో ఇప్పటికే చాలా మంది రైతులు సాగుకు స్వస్తి పలికారు. ఈ ఏడాదిపైనే ఆశలు పెట్టుకున్న రైతులకు ధరలు ఏ రకంగా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ధరలు బాగుంటే కోలుకుంటామని, లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆరు సీజన్లలో కొనుగోళ్లిలా..

సంవత్సరం కనిష్టం గరిష్టం సరాసరి మొత్తం కొనుగోలు

2015 రూ.20 రూ.158 రూ.115.80 64.35 మి.కేజీలు

2016 రూ.10 రూ.185 రూ.132.53 39.54 మి.కేజీలు

2017 రూ.20 రూ.200 రూ.158.79 43.66 మి.కేజీలు

2018 రూ.23 రూ.172 రూ.138.74 61.18 మి.కేజీలు

2019 రూ.25 రూ.230 రూ.139.00 42.15 మి.కేజీలు

2020 రూ.30 రూ.212 రూ.139.91 41.99 మి.కేజీలు


ఏర్పాట్లు పూర్తి : కేవీ రాజప్రకాష్‌, రీజనల్‌ మేనేజర్‌

ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఎన్‌ఎల్‌ ఎస్‌ ఏరియా పరిధిలో 40 మిలియన్‌ కేజీల పొగాకు పండించేందుకు అనుమతులు ఉండగా ప్రాఽథమిక అంచనా ప్రకారం 38.5 మిలియన్‌ కేజీల పొగాకు పండినట్టు తెలిసింది. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలతో వేలం నిర్వహిస్తాం.


ఖర్చులు చూస్తే భయమేస్తోంది

గతేడాది పొగాకు సాగు, దానికైన ఖర్చు, కొనుగోలు చూస్తే భయమేసింది. పొగాకు రైతులు అన్ని విధాలా నష్టాల ఎదురై అప్పుల పాలయ్యారు. గత ఏడాదిలో ఒక్కో బ్యారన్‌కు వచ్చి రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు నష్టం వచ్చింది. ఈ ఏడాది మార్కెట్‌ ధరలు బాగుం డి సరాసరి కేజీ పొగాకు రూ.185లకు ఉంటేనే రైతు అప్పులు తీరేది.

కట్రెడ్డి కిట్టు, రైతు, బుట్టాయిగూడెంమా అప్పులు తీరాలంటే..

పెరిగిన ఖర్చులకు తగ్గట్టు పొగాకు కొనుగోలు జరిగి తేనే రైతు బయటపడేది. కౌలు, దుక్కులు, కూలీ సాగు పెట్టుబడులన్నీ పెరిగాయి. నాణ్యమైన పొగాకును పం డిస్తేనే కాదు దానికి సరైన ధరలు పడ్డప్పుడే రైతులకు లాభాలు. ఈ ఏడాది గరిష్టంగా కేజీ రూ.230 కొనుగోలు చేసి సరాసరి ధరలు బాగా ఉండాలి. లోగ్రేడ్‌ పొగాకు కేజీ రూ.150 ఉంటేనే సరాసరి నిలబడి రైతుల అప్పులు తీరేది. 

– మటపర్తి రామ్మోహనరావు, పొగాకు రైతు, వేళ్లచింతలపూడి

Updated Date - 2021-03-24T05:56:52+05:30 IST