హామీలే మిగిలాయి...

ABN , First Publish Date - 2021-05-30T05:58:37+05:30 IST

వైసీపీ అధికార పగ్గాలకు చేపట్టి నేటికి రెండేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేరకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి.

హామీలే మిగిలాయి...
బియ్యపు తిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ప్రతిపాదిత ప్రదేశం

రెండేళ్ల పాలనలో ఎక్కడివక్కడే..

ఫిషింగ్‌ హార్బర్‌లో కదలిక లేదు

ఎక్కడికక్కడే నిలిచిన ఆక్వా సిటీ

కొల్లేరు రెగ్యులేటర్లు అంతే

ముందుకు కదలని ఎత్తిపోతలు

కొరవడిన ముందుచూపు..


వైసీపీ అధికార పగ్గాలకు చేపట్టి నేటికి రెండేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేరకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు వచ్చిన అనేక హామీలు ఇప్పటికీ గాలిలో తేలాడుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు వెల్లువ మాటున కీలకమైన అనేక అభివృద్ధి పనులు మూలన పడ్డాయి. ఎన్నో పథకాలు ఎక్కడవక్కడే ఉన్నాయి..


(ఏలూరు– ఆంధ్రజ్యోతి) 

ఆక్వా రంగం అభివృద్ధికంటూ నరసాపురం తీరాన ఆక్వా యూనివర్శిటీకి పునాది వేసి ప్రోత్సహిస్తామ న్నారు. వేలాది మంది మత్య్సకారులను ఆదుకునేందుకు వారి బతుకు తెరువు చేపల వేటలో అవాంతరాలు తలెత్తకుండా, బోట్లను నిలుపుకునేందుకు బియ్యపు తిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ అన్నారు.అదీ నెరవేరలేదు. కొల్లేరుకు సముద్ర పునీరు ఎగబాకకుండా అడ్డుకట్ట వేసేందుకు రెగ్యులేటర్లు కడతామని హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు జీవం పోసుకోలేదు.  ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాల పరిధిలో మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు మాత్రం కొంతలో కొంత ఒక అడుగు ముందుకు వేసి పునాదులు వేయడానికి సిద్ధపడుతున్నారు. 


తీరంలో మాటిచ్చారుగా ! 

నరసాపురం తీరంలో అభివృద్ధే లక్ష్యంగా అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అనేక హామీలు గుమ్మరించింది. ఇంతకుముందు మెరైన్‌ యూని వర్శిటీగా ఉన్న పేరును మార్చి ఆక్వా యూనివర్శిటీగా నామకరణం చేసి ఆ మేరకు భూములు పరిశీలించా ల్సిందిగా కమిటీలు వేసి దాదాపు 600 ఎకరా ల్లో ఈ యూనివర్శిటీని విస్తరించాలని దీనికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది న్నరగా యూనివర్శిటీకి రూపము రాలేదు.. పనుల్లో  అడుగు ముందుకు పడలేదు. బియ్యపు తిప్ప– వేముల దీవి మధ్యన 600 ఎకరాల సేకరణ పూర్తి అయింది. నిర్మాణ ప్రతిపాదనలకు రూ.300 కోట్లు. యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ను తాత్కాలికంగా నియమించారు. 2015లో తొలిసారిగా యూనివర్శిటీకి అప్పటి ప్రభుత్వం కార్యరూపం ప్రకటించింది. ఆక్వా యూనివర్శిటీ ఎక్కడ ఉండాలనే దానిపై భీమవరం, నరసాపురం నియోజకవర్గాల మధ్య ఒకానొక దశలో పోటీ ఏర్పడింది. చివరకు నరసాపురం, బియ్యపు తిప్పవద్ద ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. గడిచిన రెండేళ్లల్లో యూనివర్శిటీ ప్రక్రియ కాస్త ముందుకు సాగక పోగా మూలన పడింది. 


ఫిషింగ్‌ హార్బర్‌దీ ఇదే దారి 

అటు నెల్లూరు నుంచి  ఇటు కృష్ణా జిల్లా నుంచి చేపల వేటకు మర బోట్లలో పెద్ద సంఖ్యలో మత్స్య కారులు గోదావరి సముద్ర ప్రాంతానికి ఏటా వస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వీరికి ఆసరా కల్పించేందుకు ఫిషింగ్‌ హార్బర్‌ను తల పెట్టారు. ప్రభుత్వ పరంగా కాస్తంత ఒత్తిడి తెచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేయడంలో స్థానిక నేతలు సక్సెస్‌ అయ్యారు. జిల్లా యంత్రాంగం తీర ప్రాంత భూములను విని యోగించు కోవడం ద్వారా అటు యూనివర్శిటీ ఇటు హార్బర్‌కు నరసాపురమే అనువైన ప్రాంతంగా గుర్తిం చింది. గతేడాది సెప్టెంబరులో ఈ ప్రాంతాలను మత్స్య శాఖ మంత్రి  సందర్శించారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ బృందాలు  ప్రతిపాదిత స్థలాలను సందర్శించి వెళ్లాయి. ఇంకేముంది హార్బర్‌ నేడోరేపో రాబోతుంద నుకున్న మత్స్యకారులకు ఇందంతా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. హార్బర్‌ పనులకు శ్రీకారం చుట్టలేదు. రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని పునాదిరాయి వరకూ కూడా తీసుకెళ్లలేకపోయారు. 


రెగ్యులేటర్లు ఏం చేశారు..  

కొల్లేరుకు ఉప్పుటేరు మీదుగా సముద్రపునీరు ఎగబాకి మంచినీటి సరస్సు కాస్త ఉప్పుసాంద్రతతో దెబ్బతింటోంది. దీనిని నివారించాలంటే కొల్లేరుపై రెగ్యులేటర్‌ నిర్మించాల్సిందే. ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు. చాలాకాలం నుంచి ఆక్వా రంగ నిపుణులు మిగతా నిపుణులు తమ ప్రతిపాదనలను ప్రభుత్వాలకు సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రతినిధులు రెగ్యులేటర్‌ నిర్మాణానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రూ.370 కోట్ల వ్యయ ప్రతిపాదనతో రెగ్యులేటర్‌ నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదంతా జరిగి ఏడాదిన్నర పైబడే అవుతోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌లు ప్రభుత్వం కూడా ఈ ప్రతిపా దనలపై ఒకింత వివరాలను అందజేసింది. త్వరలోనే కొల్లేరు ప్రాంతా న్ని సందర్శించి రెగ్యులేటర్‌ అనువైన ప్రాంతాన్ని స్వయంగా వీక్షిం చేందుకు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు. తీరా ఇప్పుడు రెగ్యులేటర్ల ఊసే లేదు. దీనిపై కోటి ఆశలు పెంచుకున్న వారందరికీ నిరాశ ఎదురైనట్టు అయింది.  


  వైఎస్‌ మాట నిలబెట్టుకుంటామన్నారుగా..  

అధికారంలోకి రాకమునుపు... అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఒకటి నిలబెట్టుకోలేకపోయింది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.లక్షా 35 వేల నుంచి తాను అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.5 లక్షల వరకూ పెంచి పరిహారం అందిస్తానని నిర్వాసితులకు అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.  ప్రతి కుటుంబానికి ఆరు న్నర లక్షల నుంచి పరిహారం కాస్త రూ.10 లక్షలకు పెంచు తామని హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టి నేటితో రెండేళ్లు అవుతుంది. కాని పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టు కోలేదు. ఇప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం ప్రాంతంలో నాటి హామీ కోసం ఇప్పటికీ గిరిజనులు పట్టుబడు తూనే ఉన్నారు. 


మిగతా సాగునీటి పథకాల మాటేంటి 

జిల్లాలో కాల్వల ఆధునికీకరణ దగ్గర నుంచి ఎత్తిపోతల పథకాల వరకూ రెండేళ్లలో అనేక ఆటంకాలు, మరెన్నో అవరోధాలు. వీటికి తగ్గట్టుగానే ప్రత్యేకించి తగిన చొరవ లేకపోవడం స్థానిక  ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే చొరవ  చేయక పోవడం నష్టదాయకంగానే మారింది. చింతలపూడి ఎత్తిపోతలలో రైతులు ఈనాటికి న్యాయం జరగలేదు. తాడిపూడి ఎత్తిపోతల్లో పిల్ల కాల్వలకు దిక్కులేకుండా పోయింది. కాల్వల ఆధునికీకరణ పనులు వెనుకంజ వేశాయి. రహదారుల నిర్మాణం దారుణంగా మారింది. ధాన్యం సేకరణలో రైతులకు ఎప్పటికప్పుడు సొమ్ములు అందడం లేదు. ఇలా ఒకదాని వెంబడి ఒకటి ఎక్కడి కక్కడ స్తంభించిపోయాయి. ముచ్చ టగా మూడో ఏట అయినా ఇవి పుంజుకుంటాయా లేదా అన్నదే ఇప్పుడు అందరిలోనూ సందేహాలు, మరెన్నో అంచనాలు. 
Updated Date - 2021-05-30T05:58:37+05:30 IST