పక్క గ్రామాలకు వింత వ్యాధి

ABN , First Publish Date - 2021-01-21T04:58:39+05:30 IST

వింత వ్యాధి బాధితుల సంఖ్య 33కు చేరింది. ప్రస్తుతం పూళ్ళ గ్రామంతో పాటు భీమడోలు, గుండుగొలను గ్రామాలకు వ్యాధి వ్యాపించింది.

పక్క గ్రామాలకు వింత వ్యాధి
పూళ్ల గ్రామంలో పొలంలో సొమ్మసిల్లిన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తున్న రైతులు

33కి చేరిన బాధితుల సంఖ్య

26 మంది డిశ్చార్జి

భీమడోలు, జనవరి 20 : వింత వ్యాధి బాధితుల సంఖ్య 33కు చేరింది. ప్రస్తుతం పూళ్ళ గ్రామంతో పాటు భీమడోలు, గుండుగొలను గ్రామాలకు వ్యాధి వ్యాపించింది.  మంగళవారం సాయంత్రం, బుధవారాల్లో నలుగురు వ్యాధి బారిన పడ్డారు. పూళ్ళ గ్రామంలో వింత వ్యాధి బారినపడిన బాధితుల సంఖ్య బుధవారం నాటికి 29కి చేరింది. 26 మందిని డిశ్చార్జి చేసి మరో ముగ్గురుని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు వైద్యులు లీలా ప్రసాద్‌ తెలిపారు.


భీమడోలు, గుండుగొలను గ్రామాల ప్రజలకు వణుకు..  

పూళ్ళ గ్రామానికి వింత వ్యాధి వదలకముందే.. భీమడోలు, గుండుగొలను గ్రామాలను తాకింది. మంగళవారం సాయంత్రం గుండుగొలను గ్రామానికి చెందిన గండికోట దుర్గారావు ఇదే గ్రామానికి చెందిన తాలిబోయిన దుర్గారావులకు వింత వ్యాధి లక్షణాలు సోకి కుప్పకూలిపోగా భీమడోలు సామాజిక వైద్య కేంద్రానికి తరలించారు. అలాగే భీమడోలులోని ఇందిరా కాలనీకి చెందిన బాలిన పోలినాయుడుకి కూడా ఫిట్స్‌ రావడంతో భీమడోలు తరలించగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే బుధవారం ఉదయం భీమడోలు శివారు అర్జావారిగూడెం ప్రాంతానికి చెందిన కొనగర్ల శామ్యూల్‌కు కూడా ఈ లక్షణాలు రావడం, స్మృహకోల్పోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి నట్లు డాక్టర్లు తెలిపారు. అర్జావారిగూడెం, అరుంధతి కాలనీలతో పాటు గుండు గొలనులో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భీమడోలు, గుండుగొలనులో పారిశుధ్యం, ఆహార పదార్థాల వాడకంపై పంచాయతీ అధికారులు ప్రచారం నిర్వహించారు. 


కొనసాగుతున్న వైద్య శిబిరాలు 

వింతవ్యాధి సోకి అనారోగ్యాలతో బాధపడుతున్న పూళ్ళ గ్రామంలోని పలు కాలనీల్లో బాధితులకు చికిత్సలు అందించేందుకు వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక వైద్య బృందాలు, వైద్యులు ఇంటింటి సర్వే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అలాగే స్థానిక పీహెచ్‌సీ వద్ద అత్యవసర సేవలు అందించేందుకు నాలుగుకుపైగా 108 వాహనాలను సిద్ధం చేసి ఉంచారు.


భయాందోళనలో పూళ్ళ, భీమడోలు గ్రామస్థులు

వింత వ్యాధి సోకి పూళ్ళ గ్రామంలోని పలు కాలనీల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి భీమడోలు, పరిసర గ్రామాలను తాకడంతో ఈ గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పూళ్ళలోని కొన్ని కాలనీల్లోని ప్రజలు బంధువుల ఇళ్ళకు తరలిపోతున్నట్లు సమాచారం. కరోనా సమయంలో కూడా ఇంతటి భయాందోళనకు గురికాలేదంటూ ప్రజలు వాపోతున్నారు. 


Updated Date - 2021-01-21T04:58:39+05:30 IST