భార్య, అత్తింటి వేధింపులు తాళలేక...
ABN , First Publish Date - 2021-01-21T04:08:08+05:30 IST
భార్య, అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మనస్తాపంతో భర్త ఆత్మహత్య
ఏలూరు క్రైం/ఆచంట, జనవరి 20 : భార్య, అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన వడ్లమూడి ఏడుకొండలు (35)కు లక్ష్మీకుమారితో చాలా కాలం కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. ఆ తరువాత ఆమె గల్ఫ్ వెళ్లి ఈ నెల 7వ తేదీన వచ్చింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఈ నెల 18వ తేదీన లక్ష్మీకుమారి ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సెలింగ్‌లో కూడా ఏడుకొండలును అతని భార్య లక్ష్మీకుమారి, ఆమె అక్క దొండపాటి ప్రభావతి, మధ్యవర్తిగా వచ్చిన రవిశంకర్ అలియాస్ నాని వేధించి అవమానపరిచారు. వారి వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై అక్కడ నుంచి బయటకు వచ్చిన అతను పురుగుమందు తాగాడు. విషయం గమనించిన వారి బంధువులు వెంటనే ఏలూరు ప్రభుత్వాసుత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు.ఈ సంఘటనపై ఏలూరు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్లమూడి ఏడుకొండలు మృతికి కారకులైన అతని భార్య లక్ష్మీ కుమారి, ఆమె అక్క దొండపాటి ప్రభావతి, ఆమె తరపున వచ్చిన మధ్య వర్తి రవిశంకర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.