పండుగ స్పెషల్స్‌

ABN , First Publish Date - 2021-01-12T06:07:47+05:30 IST

అడ్డంగా.. అయాచితంగా.. డబ్బులు సంపాదిస్తే దాడులు చేసే ఆదాయపు పన్ను అధికారులను చూశాం. కానీ ఈ సారి కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు ఆడినట్టు తెలిసిందా..! క్షణా ల్లో వచ్చి దాడులు చేస్తారు.

పండుగ స్పెషల్స్‌
కలపర్రు టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ

జూదాలపై ఐటీ కన్ను.. 

రంగంలోకి పది బృందాలు  

అయినా తగ్గని పందెంరాయుళ్లు

వందల కోట్లు డ్రా.. 

ఖాళీ అవుతున్న ఏటీఎంలు

ఓ వైపు మద్య నిషేధం అంటూనే.. కొత్త/పాత బ్రాండ్లతో కిక్‌ 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

అడ్డంగా.. అయాచితంగా.. డబ్బులు సంపాదిస్తే దాడులు చేసే ఆదాయపు పన్ను అధికారులను చూశాం. కానీ ఈ సారి కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు ఆడినట్టు తెలిసిందా..! క్షణా ల్లో వచ్చి దాడులు చేస్తారు. ఏటా భీమవరం తోపాటు మరో 15చోట్ల దాదాపు వారంపాటు రూ.500 కోట్లకుపైగా చేతులు మారుతుంటాయని ప్రచా రం. మహారాష్ట్ర, చెన్నై, బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల నుంచి డబ్బు సంచులతో దిగుతున్న వారి సంఖ్య  ఏటా పెరుగుతూనే ఉంది. గత ఏడాది కోడిపందేల్లో చెప్పాపెట్టకుండా దాదాపు రూ.150 కోట్లకు పైగా చేతులు మారగా, పేకాటలో రూ.60 కోట్లు లావాదేవీలు జరిగినట్టు అంచనా. అసలింతకీ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఎవరెవరు దీనికి ఆలవాలంగా మారారనే దానిపైనే అందరి దృష్టి పడింది. భీమవరం కేంద్రంగా ఈ మూడు రోజులపాటు సాగే కోడి పందేలే కాకుండా పండుగ సంబరాలకు కేంద్రంగా ఇదే మారడంతో ఐటీ దృష్టిని ఆకర్షించింది.  జిల్లాకు 10 ఐటీ బృందా లు దిగినట్లు ఎస్పీ నారాయణనాయక్‌ ప్రకటించడంతో  కలకలం రేగింది. అయినాసరే పండుగలాగే జరపాలి. దేనికైనా సిద్ధమన్నట్లుగా ఇప్పటికే కొందరు దాదాపు అన్నింటికి రెడీ అయిపోయారు. 


ఏటీఎంలు ఖాళీ 

పండుగ వచ్చిందంటే చాలు విపరీతమైన నగదు వినియోగం ఉంటుంది.  సంక్రాంతి పం డుగకు చిన్నా పెద్ద తేడా లేకుండా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విందు, వినోదాలు కోడి పందేలు, జూదానికి పెద్దపీట వేస్తారు. సంప్రదాయంగా ఇదంతా ఎప్పటి నుంచో వస్తున్నదేనని తాము కొత్తగా ప్రవేశపెట్టింది లేదని కొత్త భాష్యాలు చెబుతారు. అందుకనే పెద్దింటి ఇళ్లల్లోని కొందరు పిల్లలకు సైతం పాకెట్‌ మనీగా పండుగ బంపర్‌ ఆఫర్ల వేలకు వేలు ఇచ్చేస్తారు. ఇదంతా పండుగ మూడు రోజుల్లో గుండాట, మరో దానికి కర్పూరంలా కరిగిపోతుంది. ఈ పరిస్థితుల నేపఽథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అనేక ఏటీఎం లన్నీ ఖాళీ అయ్యాయి. పండుగ ముందు అమ్మ ఒడి పథకం కింద ఇచ్చిన డబ్బు బ్యాం కులకు చేరగా వాటిని డ్రా చేసుకునేందుకు ఒత్తిడి ఆరంభమైంది. వీటన్నింటికి తగ్గట్టు గానే కరోనా ముగిసిన తరువాత దాదాపు అతి పెద్ద పండుగగా వచ్చిపడిన సంక్రాంతి వేళ దుస్తులు కొనుగోలుకు అంచనా ప్రకారం ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లకు పైగానే వెచ్చించారు. ఇంకోవైపు ఏటీఎంలతో పాటు బ్యాంకు ఖాతాల్లో సొమ్మును డ్రా చేసుకునేందు వేల మంది క్యూలో ఉన్నారు. ఈ పరిస్థితి మరో రెండు రోజలు కొనసాగబోతోంది. 


నగదు నిల్వలకు కొరత లేదు : ఎల్‌డీఎం స్పష్టీకరణ 

జిల్లాలో అమ్మ ఒడి  ఆర్థిక సాయం 3,55,051 మంది తల్లులు/సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.532 కోట్లు సోమవారం జమైంది. ఈ నగదు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఒకే దఫా బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లడం వల్ల మూడు రోజులపాటు నగదు కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌(ఎల్‌డీఎం) ఎ.సూర్యనారాయణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్థావించగా అమ్మ ఒడి మొత్తానికి సరిపడా నగదు నిల్వలు బ్యాంకుల వద్ద ఇప్పటికే ఉన్నందున, నగదు ఉపసంహరణకు కొరత ఏర్పడబోదన్నారు. 


పుంజు కోసం పాట్లు 

కొద్దిమాసాలుగా కోడిపుంజుల పెంపకంలో తలమునకలైన వారంతా తాజా పరిణామాలపై కాస్తంత అసంతృప్తితోనే ఉన్నారు. పోలీస్‌ యంత్రాంగం పందేలు జరగనీయకుండా మోహరించింది. కోడికి కత్తులు కట్టే వారి దగ్గర నుంచి, పెంచే వారిపైన బైండోవర్లు పెడుతున్నారు. ఒకవేళ పందేల బరికి ఎవరు తలొగ్గినా అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడంతోపాటు స్థలం యజమానిపైనా కేసులు ఉంటాయని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సీజన్‌లో ఏటా దాదాపు రూ.5 కోట్ల విలువైన పుం జులను ఉభయ గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేస్తారు. ఈసారి సీన్‌ రివర్స్‌ కావడంతో ఇప్పటికే పందెం పుంజులు పెంచిన వారంతా బిక్కచచ్చి పోయారు. ఒక్కో పుంజు రంగు, జాతకాన్ని బట్టి రూ.5 వేల దగ్గర నుంచి రూ.70 వేల వరకు ధర పలికేది. ఇప్పుడా పరిస్థితులు తెలుసుకుని పెంపంకం దారులు బావురుమంటున్నారు. 


పండగ వేళ ‘బ్రాండ్లు’ ఎన్నో 

ఓ వైపు మద్య నిషేధం అంటూనే మరోవైపు ప్రభుత్వపరంగా మద్యం దుకాణాలన్నింటిని రకరకాల బ్రాండ్లతో నింపేశారు. కొన్నిచోట్ల ఎక్కువ అమ్ముడ వుతున్న బ్రాండ్లన్నీంటిని మోతాదుకు మించి మరీ స్టాక్‌ను నింపేశారు. ఇప్పటికే మద్యం విక్రయాలు దాదాపు రెట్టింపయ్యా యి. ఐదు నెలలుగా దూసుకుపోతున్న అమ్మ కాలు ఈ దెబ్బతో రికార్డును సృష్టించబోతున్నాయి. ఒక్క పశ్చిమలోనే దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం విక్రయాలకు చేరువ కాబోతున్నాయి. మద్యం ధరలు అధికంగా ఉండడంతో సారా వైపు పల్లెల్లో జనం తొంగిచూస్తున్నారు. వీటి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చేపల చెరువు గట్ల మీద ఇప్పటికే వ్యవహారం సాగుతోంది. తెలంగాణ మందు ఆంధ్రకు వచ్చి చేరుతోంది. ఇక్కడ మద్యం ధరలు అధికంగా ఉండడంతో కొంద రు పండుగపూట తమ లగేజీలతోపాటు తెలంగాణ  మద్యాన్ని రహస్యంగా చేర్చేస్తున్నారు. 


వచ్చేస్తున్నాం..

సంక్రాంతికి సొంతూళ్లకు చేరుతున్న జనం

కిటకిటలాడుతున్న జాతీయ, 

రాష్ట్ర రహదారులు 

టోల్‌ ప్లాజాల వద్ద భారీ క్యూలు

మార్కెట్లలో పెరిగిన రద్దీ

భీమవరం/ఏలూరు, జనవరి 11 : సంక్రాం తి సందడి మొదలైంది. రెండు రోజులుగా సొంతూళ్లకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓ వైపు డెల్టా రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు మార్కెట్లో సందడి పెరిగింది. భీమవరంలో మార్కెట్లు సైతం కళకళలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత కాస్త మెరుగుపడటంతో ఈ ఏడాది సంబరాలు ఉంటాయని ఆశిస్తున్నారు. రెండు రోజులుగా పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాలపై వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడంతో రెండు రోజులుగా డెల్టా మీదుగా వెళ్తున్న 165 జాతీయ రహదారి, గుడివాడ–కలిదిండి–భీమవరం స్టేట్‌ హైవే మీదుగా వందలాది వాహనాలు వెళుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ పెరిగింది. సొంత వాహనాలుపైన, బైకులుపైన వచ్చేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రైవేటు ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులను చేరవేస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే వారి సంఖ్య కూడా కనిపిస్తోంది. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది భీమవరంపై యథావిధిగానే పొరుగు ప్రాంతాల వారు దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరిగే అవకాశం లేదంటూ పోలీసు శాఖ పదే పదే ప్రచారం చేస్తోంది. ఇది గత రెండు దశాబ్దాలుగా మామూలే కదా. ఆ మూడు రోజులు పందేల నిర్వహణ ఖాయమన్న భావన ప్రచారంలో ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోడి పందేలకు సంబంధించిన బరులు ఏర్పాటు స్థలాలను గుర్తించారు. కొన్నిచోట్ల టెండ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు వ్యాపారం ఊపందుకోవడంతో బంగారం, వస్త్ర దుకాణాలు ఎలకా్ట్రనిక్‌ గూడ్స్‌ వ్యాపారం సాగుతోంది. సంక్రాంతి సంప్రదాయ వంటలను వ్యాపారులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి లాడ్జ్‌ బుకింగ్‌ 40 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే కనిపిస్తోంది. రానున్న మూడు రోజుల్లో 

ఈ సంఖ్య పెరగవచ్చని ఆశతో ఉన్నారు. 

కలపర్రు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఏర్పడింది. బండి వెనుక బండి అన్నట్లు వాహనాలు చీమల బారులా నడిచాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కోస్తా వాసులు సంక్రాంతి జరుపుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. పండుగ మూడు రోజులు ఉన్నప్పటికీ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ముందుగానే  బస్సులు, కార్లలో చేరుకుంటున్నారు. ట్రాఫిక్‌ రద్దీ వల్ల రోడ్లు దాటడానికి వీలు పడలేదు. ఫాస్ట్‌ టాగ్‌ ప్రవేశపెట్టినప్పటికీ టోల్‌గేటు వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. 




Updated Date - 2021-01-12T06:07:47+05:30 IST