పంపు సెట్లకు మీటర్లు వద్దు
ABN , First Publish Date - 2021-01-20T05:47:58+05:30 IST
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దని విద్యుత్ టారిఫ్ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు
ఏలూరు సిటీ, జనవరి 19: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దని విద్యుత్ టారిఫ్ ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారీఫ్ ఖరారు చేసేందుకు రెండు రోజులుగా ఏపీఈపీడీసీఎల్ ప్రధాన కార్యాయలం విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టగా జిల్లాకు చెందిన రైతులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దని కోరారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసే సమయంలో 11 శాతం ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జీలు, 3 శాతం రవాణా, స్టోరేజి, హాండ్లింగ్ చార్జీలు, అదనంగా జీఎస్‌టీ వసూలు చేస్తున్నారని వాటి నుంచి మినహా యింపు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సం బంఽధించి విద్యుత్ బిల్లులను హెచ్‌టీ కేటగిరీ–2 నుంచి హెచ్‌టీ కేటగిరీ–3లోకి మార్చాలని సంబంధిత కంపెనీ వారు కోరారు. జిల్లాలోని 6 విద్యుత్ డివిజన్ కేంద్రాల్లో ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జనార్ధనరావు, విద్యుత్ శాఖ ఏలూరు ఈఈ (టెక్నికల్) ఝాన్సీ, ఏలూ రు ఈఈ నారాయణ అప్పారావు, ఈఈలు రఘునాథ బాబు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.