నేటి నుంచి పెళ్లి కూతురమ్మ పండగ..

ABN , First Publish Date - 2021-01-13T05:16:36+05:30 IST

ఆ ఊరి పేరు పెళ్లి కూతురమ్మ చెరువు.ఈ పేరు కాస్త వినడానికి ఆసక్తి కలిగిస్తుంది. ఓ పెళ్లి కూతురు పేరుతోనే ఆ ఊరు ఏర్పడింది.

నేటి నుంచి పెళ్లి కూతురమ్మ పండగ..
పెళ్లికూతురుమ్మ ఆలయం

కరోనాతో తిరునాళ్లు రద్దు

మూడు రోజులు దర్శనానికి అనుమతి

ఆచంట, జనవరి 12 : ఆ ఊరి పేరు పెళ్లి కూతురమ్మ చెరువు.ఈ పేరు కాస్త వినడానికి ఆసక్తి కలిగిస్తుంది. ఓ పెళ్లి కూతురు పేరుతోనే ఆ ఊరు ఏర్పడింది. ఇది ఆచంట మండలం శేషమ్మ చెరువు పంచాయతీ సరిహద్దు..పెనుగొండ మండలం దేవ గ్రామం సరిహద్దులో ఉంది. ఈ ఊరి ప్రత్యేక ఏమిటంటే ప్రతి ఏటా సంక్రాంతికి మూడు రోజులు పాటు ఓ పెళ్లి కూతురమ్మకు అనేక మంది భక్తులు వచ్చి పూజలు చేస్తారు.కొన్ని దశాబ్దాల కిందట ఆచంటకు చెందిన ఒక అబ్బాయికి, పెనుగొండకు చెందిన ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి పెనుగొండలోని వధువు ఇంట ఏర్పాటు చేశారు. వరుడు తన పల్లకీలో కూర్చుని ఆచంట నుంచి వెళుతూ ఒక అటవీ  ప్రాంతంలో పామును చంపుతాడు. పెళ్లయిన తరువాత ఆచంటకు ఇదే దారిలో పల్లకీలో భార్యతో వెళుతూ సరిగ్గా పామును చంపిన ప్రదేశంలో మళ్లీ ఆగుతారు.ఆ సమయంలో అతను చంపిని పాము తల వరుడిని కాటేయడంతో చనిపోతాడు. ఇది చూసిన పెళ్లి కుమార్తె బంధువులకు కబురు పెట్టించి అక్కడే నిప్పులు గుండం ఏర్పాటు చేసుకుని భర్త శవంతో పాటు కాలి బూడిదైంది. దీంతో అమె జ్ఞాపకంగా ఒక చిన్న గుడి కట్టారు.ఆ గుడిలో పెళ్లి కుమార్తె తన భర్తను ఒడిలో ఉంచుకుని మరణించిన దృశ్యంతో విగ్రహలు ఉండేవి. 1982లో ఆలయాన్ని పునరుద్ధరించారు.నూతన దంపతుల విగ్రహాల మధ్యలో పాము విగ్రహం ఉంచారు. పెళ్లి కుమార్తెకు ఎడమ వైపున ఆమె తండ్రి విగ్రహం కూడా ఉంటుంది. ప్రతీ ఏడాది తిరునాళ్లు భారీగా జరిగేవి. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పెళ్లి కూతురమ్మ తిరునాళ్లను రద్దు చేసినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు కేవలం అమ్మవార్లను భక్తులు దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు. 


Updated Date - 2021-01-13T05:16:36+05:30 IST