వ్యాక్సిన్‌కు వెనకడుగెందుకు...?

ABN , First Publish Date - 2021-03-24T06:09:54+05:30 IST

కరోనా మళ్లీ తరుముకొస్తోంది. వ్యక్తిగత శ్రద్ధ, జాగ్రత్త ఇప్పుడెంతో అవసరం. దీనికి తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. తీవ్ర చర్యలు చేపడుతున్నాయి. రెండు నెలల క్రితమే వ్యాక్సినేషన్‌ ఆరంభించినా చాలా మంది మొగ్గు చూపలేదు.

వ్యాక్సిన్‌కు వెనకడుగెందుకు...?

తొలి దశ ఉచితమే అయినా తగ్గిన సంఖ్య .. 

వైద్య సిబ్బంది సహా మిగతా వారిదీ అదే దారి

ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది 

ఇకపై 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ : కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ

కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం సిద్ధం

మాల్స్‌, హోటల్స్‌, సమూహాలపై నిఘా

మాస్క్‌ లేకుంటే వెయ్యి పెనాల్టీ


కరోనా మళ్లీ తరుముకొస్తోంది. వ్యక్తిగత శ్రద్ధ, జాగ్రత్త ఇప్పుడెంతో అవసరం. దీనికి తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. తీవ్ర చర్యలు చేపడుతున్నాయి. రెండు నెలల క్రితమే వ్యాక్సినేషన్‌ ఆరంభించినా చాలా మంది మొగ్గు చూపలేదు. ఇప్పుడు కేంద్రం తాజాగా నిబంధనలు సవరించి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి వీలుగా మాస్క్‌ లేకుంటే వెయ్యి పెనాల్టీకి దిగింది. విద్యా సంస్థలు, మాల్స్‌, బహిరంగ ప్రదేశాల్లో ప్రజా కదలికలపైనా పూర్తిగా దృష్టి పెట్టబోతున్నారు. ప్రత్యేకించి లక్షణాలు కనపడని కరోనా మరింత విస్తరించకుండా ముందస్తు కట్టడి కే సిద్ధమవుతున్నారు. 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

కరోనా కట్టడికి విరామం లేకుండా శ్రమించిన వారందరికీ ముందస్తుగా వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తగు సంఖ్యలో డోసులను సరఫరా చేసింది. కానీ ఎక్కువ మంది వ్యాక్సిన్‌ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. రకరకాల అపోహలు, వదంతులే దీనికి కారణం. వ్యాక్సిన్‌ వేయించుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయన్న అను మానాలతో విద్యావంతులు వెనక్కు తగ్గగా ఆ కోవలో కొంతమంది వైద్యులు చేరారు. డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బందికి తొలిదశలో జనవరి 18 నుంచి వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 27,323 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లను గుర్తించగా.. 24,144 మంది మాత్రమే వ్యాక్సిన్‌కు సిద్ధపడ్డారు. ఎనిమిది రోజుల్లోపు ఈ వ్యవహారం పూర్తి చేయాలని తలపెట్టారు. సెకండ్‌ డోస్‌కు వచ్చేసరికి ఈ సంఖ్య 15,015 మందికి పడిపోయింది. కేవలం వందతులు, అపోహలే ప్రధాన కారణం. వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల కేవలం తొలి అరగంటలోనే ఏమైనా ఇబ్బంది ఉంటే బయట పడుతుందని చెప్పినా రెండో డోసుకు సిద్ధపడలేదు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 41,862 మంది ఉన్న ట్లు గుర్తించారు. తొలి డోస్‌ కింద 29,119 మంది వ్యాక్సిన్‌కు సిద్ధపడగా, రెండో డోస్‌కు వచ్చేసరికి ఈ సంఖ్య కాస్త 7,759కి పడిపోయింది. తొలి డోస్‌ వ్యాక్సిన్‌కు సిద్ధపడిన వారిలో 22 వేల మందిపైగా డుమ్మా కొట్టినట్లే. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. తాజాగా 45 నుంచి 59 ఏళ్ల వయో పరిమితి ఉన్న వారికి వ్యాక్సిన్‌కు సిద్ధపడగా కేవలం 2020 మంది మాత్రమే ముందుకు వచ్చారు. 60 ఏళ్లు పైబ డిన వారు ఇప్పటి వరకూ 41,119 మంది వ్యాక్సిన్‌ వేయించుకోగలిగారు. కరోనా రెండో మారు దూసుకువస్తుందా..? వెళ్లిపోయిందనే ఉద్దేశంతోనే చాలామంది వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెనక్కు తగ్గారు. కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌.. ఈ రెండు రకాల వ్యాక్సిన్‌లను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు నెలలుగా అందుబాటులో ఉంచారు. కానీ ప్రజలకు అవగాహన కల్పించే రీతిలో పెద్దగా యంత్రాంగం స్పందించకపోవడంతో వ్యాక్సిన్‌ పొందే వారి సంఖ్య పెద్దగా నమోదు కాలేదు.


మరి ఇప్పుడేం చేస్తారు 

మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతం గా ఉండబోతోందని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే తేల్చేశారు. తెలుగు రాష్ట్రాల్లోను ఈ దూకుడు ఉంటుందని, ఈ మేరకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వేయించుకుం టే కొంతలో కొంత కట్టడి చేయవచ్చునని మరోసారి ప్రభుత్వం మేలుకొంది. ఈ మేరకు మంగళవారం కేంద్రం కీలక నిర్ణ యం తీసుకుంది. 45 ఏళ్ల పైబడిన వారంద రికీ వ్యాక్సిన్‌ అన్ని వైద్య శిబిరాల్లోనూ కొనసాగిం చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఇప్పటి వరకూ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే వ్యాక్సిన్‌కు నగదు తీసుకుంటుండగా  ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వేస్తున్నారు. ప్రత్యేకించి నిర్ణీత పరిమిత వయసులో ఉన్న వారంతా ఒక ఏమాత్రం జాప్యం చేయకుండా వదంతులు నమ్మకుండా, అపోహలకు తావు ఇవ్వకుండా తక్షణం వ్యాక్సిన్‌కు సిద్ధపడాల్సిన అవసరం కనిపిస్తోంది. 


మాస్క్‌ పెట్టుకోలేదో..? 

కరోనా కట్టడిలో భాగంగా మాస్క్‌ విధిగా ధరించాలని కొత్త ఆంక్షలు తెరముందుకు తెచ్చిం ది. రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మాస్క్‌లు ధరించ కుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చల విడిగా తిరిగే వారికి వెయ్యి రూపాయల చొప్పున అపరాధ రుసుం విధించనుంది. ఇప్పటికే ఏలూరు నగరంతోపాటు భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు వంటి ముఖ్య పట్టణాల న్నింటిలోనూ మాల్స్‌, హోటళ్ళు, జన సమూహం ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తుచర్యలకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇతర జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌ కేసులు నమోదవుతోన్న తీరు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి రానీయకుండా ముందస్తు కట్టడికే సిద్ధమవుతున్నారు. 


భయం వద్దు.. వ్యాక్సిన్‌ వేయించుకోండి : డీఐజీ కేవీ మోహనరావు 

ఏలూరు క్రైం, మార్చి 23 : ప్రతి ఒక్కరూ భయపడకుండా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకో వాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన రావు సూచించారు. విజయవాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద పోలీస్‌ క్లినిక్‌లో మంగళవారం మధ్యా హ్నం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది, ప్రజలు భయపడకుండా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు లేవని చెప్పారు. అపోహలు నమ్మవద్దని కోరారు. కరోనా సెకండ్‌ వేవ్‌ పొంచివున్న కారణంగా పోలీస్‌ సిబ్బంది, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. 

 రెండు రోజుల్లో సచివాలయాలకు..

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 23 : గ్రామ/వార్డు సచివాలయాల్లో సంబంధిత పీహెచ్‌సీల ఆధ్వర్యంలో పంపిణీ చేయతలపెట్టిన కొవిడ్‌ టీకా మందును రెండు రోజుల్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ను వేసేందుకు నిర్దేశిత గ్రూపుల వ్యక్తుల డేటాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సచివాలయాలు, పీహెచ్‌సీలకు పంపింది. టీకా మందు వేయడానికి సచివాలయాల్లో నాలుగు గదులు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. కానీ, కొన్నిచోట్ల మూడు, అంతకంటే తక్కువ గదులు ఉండడం, మరికొన్నిచోట్ల మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ మేరకు లోటు ఉన్నచోట అవసరమైన వసతులు కల్పించడం, వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారికి కుర్చీలు వంటివి సమకూర్చేందుకు కావాల్సిన బడ్జెట్‌ నిధులు రెవెన్యూ శాఖ భరిస్తుందా, లేక ప్రభుత్వమే వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తుందా అనే సందిగ్దతపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 93 పీహెచ్‌సీలకు వ్యాక్సిన్‌ నిల్వలను పంపిణీ చేసి వాటిని భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్‌సీ పరిధిలో రోజుకొక సచివాలయాన్ని ఎంపిక చేసి టీకా మందును వేయనున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతిని నియంత్రించే చర్యల్లో భాగంగా హోలీ పండుగ వేడుకలపై పరిమితులు విధించే అవకాశాలు లేకపోలేదని సమాచారం.


ఆసుపత్రులను  సిద్ధం చేయండి : కలెక్టర్‌ ముత్యాలరాజు

ఏలూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి):జిల్లాలో కొవిడ్‌ కేసుల నియంత్రణ, నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలె క్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలపై ఆయన వైద్య ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన మంగళవా రం కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు ఎక్కువవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి నుంచే జిల్లాలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకో వాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్‌, బ్లాకులను గుర్తించి సిద్ధం చేసుకో వాలి. ఏలూరు జిల్లాసుపత్రి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వంటి ప్రధాన పట్టణాల్లో ఏరియా ఆసుప త్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, 108 వాహనాలను కొవిడ్‌ బాఽధితుల కోసం సిద్ధంగా ఉంచాలి. వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉన్న వారినే ఆసుపత్రుల్లో చేర్చాలి. బాధితులున్న ప్రాంతా ల్లో కంటైన్మెంట్‌ జోన్లను కట్టుదిట్టంగా అమలు చేయాలి. షాపింగ్‌ మాల్స్‌లో మాస్కులు, భౌతికదూరం పాటించడం, శానిటైజషన్‌ను తప్పని సరిగా వినియోగించాలి’ అని వివరించారు.60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా వాక్సిన్‌ వేయాలన్నారు. ఇందుకు ప్రతి పీహెచ్‌సీలో నోడల్‌ ఆఫీసర్‌ను నియమించి నూరు శాతం వాక్సినేషన్‌ అమలు జరిగేలా చూడటంతోపాటు డోర్‌ టూ డోర్‌ సర్వే చేయించి ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో సునంద, డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌, డీటీసీ సిరిఆనంద్‌, డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, ఆర్‌డీవో రచన, తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2021-03-24T06:09:54+05:30 IST