కష్టమే మిగిలింది

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

పెరిగిన పెట్టుబడి వ్యయం మొక్కజొన్న రైతుల ఆదాయంపై పెనుప్రభావాన్ని చూపిస్తోంది.

కష్టమే మిగిలింది
ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు

పెరిగిన పెట్టుబడి..తగ్గిన రాబడి

15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు

గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల విజ్ఞప్తి


 పెదవేగి, మార్చి 22: పెరిగిన పెట్టుబడి వ్యయం మొక్కజొన్న రైతుల ఆదాయంపై పెనుప్రభావాన్ని చూపిస్తోంది. దుక్కుల దగ్గర నుంచి ఎరువులు, కూలీల ధరలు భారీగా పెరగడంతో కష్టానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయామని రైతులు వాపోతున్నారు. మెట్టప్రాంతమైన పెదవేగి మండలంలో రబీ సీజనులో అత్యధిక శాతం రైతులు మొక్కజొన్న (సీడ్‌)ను సాగు చేస్తారు. మండలంలో రబీ సాగులో సుమారు 15 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఆయిల్‌ ధరల పెరుగుదలతో దుక్కుల ధరలు పెరిగాయి. మరోవైపు కూలీలు కూలి ధరను పెంచేశారు. ఇక ఎరువుల ధరలు సరేసరి. కత్తెర పురుగు రైతుల పుట్టి ముంచింది. పెరిగిన పెట్టుబడితో పాటుగా కత్తెర పురుగును ఎదుర్కొవడానికి అదనంగా పురుగుల మందులకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఎకరం మొక్కజొన్న సాగుకు సుమారు రూ.55 వేలు నుంచి 60 వేలు పెట్టుబడి వ్యయం అవుతుంది. అయితే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినా దిగుబడి మాత్రం ఐదారు టన్నులు మించడం లేదు. టన్ను రూ.14 వేలకు మాత్రమే కొనుగోలు చేయడంతో  రైతులు అప్పుల పాలవుతున్నారు.  ఈ పరిస్థితిలో వ్యవసాయం నష్టాలనే మిగుల్చుతోందని రైతులు పేర్కొంటున్నారు. . పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే కుటుంబ జీవనం ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది నష్టాలనే మూటగట్టుకునే దుస్థితి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


పెట్టుబడి రూ.60 వేలు : పెన్మెత్స శివరామరాజు, రైతు, వెంకటకృష్ణాపురం 

గతేడాది ఎకరానికి రూ.50వేలు పెట్టుబడి కాగా ఆరు టన్నులు దిగుబడి వచ్చింది. రూ.72 వేలు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి రూ.60 వేలు అయ్యింది. కాగా కత్తెర పురుగు విజృంభణ దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఐదు టన్నులు మించి దిగుబడి వచ్చేలా లేదు. ఏడు ఎక రాలు కౌలుకు సాగు చేశాను. పెరిగిన పెట్టుబడి వ్యయంతో నష్టమే తప్ప శ్రమకూడా మిగిలేలా లేదు.

 ఈ ఏడాదీ నష్టాలే:  కొల్లి కోటివరప్రసాద్‌, రైతు, గార్లమడుగు 

వాతావరణం అనుకూలించకపోవడంతో విత్తనాలను ఆలస్యంగా డిసెంబరునెలలో నాటాం. ఆ ప్రభావం దిగుబడిపై పడింది. విత్తడం ఆలస్యం కావడంతో పొగమంచు కారణంగా కండెలు గింజలు తగ్గడంతో దిగుబడి తగ్గింది. ఒక పక్క భారమైన ఎరువులు, మరోపక్క తగ్గిన దిగుబడితో ఈ ఏడాది నష్టాలే మిగిలాయి. గతేడాది ఫర్వాలేదనుకున్నాం. ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పెరగకకుండా ఉంటే కొంత మేర ఆశించిన ఆదాయం వచ్చేది.

Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST