కత్తిదూసిన కోడి

ABN , First Publish Date - 2021-01-13T05:30:00+05:30 IST

ఖాకీలు కన్నెర్రజేసినా.. అధికారులు హెచ్చరికలు చేసినా.. వందల మందిని బైండోవర్‌ చేసినా.. వేలాది కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నా.. బరుల వద్ద నిఘా ఉంచినా.. కోడి కత్తి దూసింది.

కత్తిదూసిన కోడి
యలమంచిలి మండలం కలగంపూడిలో కోడి పందేలు

డెల్టా ప్రాంతంలో జోరుగా పందేలు

యథేచ్ఛగా పేకాట, గుండాట

ఫ్లడ్‌లైట్ల వెలుగులో జూదం

బరుల వద్ద కనిపించని ఖాకీలు


ఖాకీలు కన్నెర్రజేసినా.. అధికారులు హెచ్చరికలు చేసినా.. వందల మందిని బైండోవర్‌ చేసినా.. వేలాది కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నా.. బరుల వద్ద నిఘా ఉంచినా.. కోడి కత్తి దూసింది. కసితీరా కొట్లాడింది. పందెగాళ్లు పండగ చేసుకున్నారు. మూడు రోజుల పండుగలో బుధవారం భోగి రోజు గంటల వ్యవధిలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సంప్రదాయం పేరిట డింకీ పందేలుగా ప్రారంభమైనా కత్తికట్టిన కోడి రక్తం బరిలో కలిసింది.. నిర్జీవంగా పకోడీ అయింది.. అంతేనా పోలీసు హెచ్చరిక బోర్డు పక్కనే పందేలు సాగాయి. రద్దీ అదుపు చేసేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేసి రాత్రివేళ ఫ్లడ్‌లైట్‌ వెలుగులో నిరాటంకంగా పందేలు సాగించారు. కోడిపందేలతోపాటు పేకాట, గుండాట ప్రత్యేక ఆకర్షణ. పాలకొల్లు రూరల్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో కోడిపందేలు జరగకుండా ఎస్‌ఐ అడ్డుకున్నారు.


భీమవరం మండలంలో పెదగరువులో సాగిన కోడిపందేల్లో లక్షలాది రూపాయలు చేతులుమారినట్లు సమాచారం. తాడేరు, తుందుర్రు, దిరుసు మర్రు, యనమదుర్రు తదితర ప్రాంతాల్లో చిన్న, పెద్ద బరుల్లో పందేలు సాగాయి. వీరవాసరం మండలంలో కొణితివాడ, నౌడూరు, మత్స్యపురి గ్రామాల్లో కోడిపందేల బరులు ఏర్పాటయ్యాయి. అక్కడక్కడ చిన్న బరుల్లో కూడా పందేలు సాగాయి. కాళ్ళ మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. సీసలిలో సంప్రదాయ డింకీ కోడి పందేలను ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రారంభించారు. సీసలి, పెదఅమిరం, జక్కరం, మాలవానితిప్ప, ఏలూరుపాడు, దొడ్డనపూడి, కాళ్ళకూరు తదితర గ్రామాల్లో కోడిపందేలు యఽథేచ్ఛగా నిర్వహించారు. సీసలిలో బరిలో రద్దీ అదుపు చేసేందుకు బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాగిన పందేల్లో మొదటి రోజు కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు పందెగాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. పాలకోడేరు మండలంలో గొల్లలకోడేరు, పాలకోడేరు, కోరుకొల్లు, మోగల్లు, వేండ్ర, శృంగవృక్షం, పెన్నాడ, విస్సాకోడేరు, గరగపర్రు గ్రామాలలో పందేలు సాగుతున్నాయి. నరసాపురం  మండలంలోని లక్ష్మణేశ్వరంలో రెండు పెద్ద బరులు వేశారు. తూర్పుతాళ్ళు, కొప్పర్రు, పీఎంలంక గ్రామాల్లో బరులు వెలిశాయి. కోడి పందేలతో పాటు గుండాట కూడా జోరుగా సాగింది. ఆచంట నియోజకవర్గంలోని పోడూరు, పెనుమంట్ర మండలాల్లో కోడిపందేలు అదుపు లేకుండా సాగాయి. యల మంచిలి మండలం కలగంపూడిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిం చారు. యలమంచిలి, వడ్డిలంక, బూరుగుపల్లి, గుంపర్రు, కొంతేరు గ్రామా ల్లో చిన్న బరులు ఏర్పాటు చేశారు. ఉండి మండలం కోలమూరులో హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసిన చోటే కోడి పందేలు నిర్వహించడం విశేషం. ఉండి, పాములపర్రు, చెరుకువాడ, మహదేవపట్నం, కలిగొట్ల, పెదపుల్లేరు తదితర గ్రామాల్లో పందేలు హోరెత్తాయి. పాలకొల్లు పట్టణ స్టేషన్‌ పరిధిలో చేరిన పూలపల్లి, పందిగుంట, బైపాస్‌రోడ్డుకు ఇవతలివైపు కోడి పందేలు, పేకాట, గుండాట పెద్ద ఎత్తున జరిగాయి. మొగల్తూరు పంచాయతీలో నాలుగు ప్రాంతాలు, కొత్తపాలెం, రామన్నపాలెం పంచాయతీ పులపర్తివారి తోట, కెపిపాలెం నార్త్‌, పేరుపాలెం సౌత్‌, కొత్తోట, కాళీపట్నం గ్రామాల్లో ప్రత్యేక బరులు వేసి కోడి పందేలు, గుండాట, కోతాట నిర్వహిస్తున్నారు, ఆకివీడు మండలంలో దుంపగడప, అజ్జమూరు, ఆకివీడు, గుమ్ములూరు, సిద్దాపురం గ్రామాలలో కోడిపందేలు, గుండాట, పేకాట నిర్వహించారు. కోడి పందేల వద్ద కత్తుల కొరత స్పష్టంగా కనబడింది.

భీమవరం / రూరల్‌ / కాళ్ళ / వీరవాసరం / పాలకోడేరు / ఉండి / ఆకివీడు రూరల్‌ / నరసాపురం / మొగల్తూరు / ఆచంట / యలమంచిలి / పాలకొల్లు రూరల్‌

Updated Date - 2021-01-13T05:30:00+05:30 IST