నిర్మలమ్మా ఇదేం..లెక్కమ్మా..?
ABN , First Publish Date - 2021-02-02T05:20:18+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ, సహాయ పునరావాసం వ్యయాల కేటాయింపులను రెండేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో చూపించడం లేదు. నాబార్డు ద్వారా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే.

పోలవరం ఊసేలేదు.. వేతన జీవులకు నిరాశే..
వంట నూనెలకు రెక్కలు.. మద్యం ధరలకు కిక్
జలజీవన్‌కు కొత్తరూపు.. పన్ను రాయితీ వృద్ధులకే
కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా పెదవి విరుపులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ నిరాశ మిగిల్చింది. బీజేపీయే తర పక్షాలన్నీ ఇదేం బడ్జెట్ అంటూ విరుచుకుపడ్డాయి. సామాన్యులు పెదవి విరిచారు. ఆంధ్రుల జీవనాడి పోల వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా లెక్కలు కనిపించ లేదు. ఆదాయ పన్ను పరిమితి ఊసే లేదు. మద్యం ధరలు కేక పుట్టిస్తాయి. వంట నూనె ధరలు భగ్గుమం టాయి. ఆక్వాకు పెద్ద ఉద్దీపన లేదు. ఇలా జిల్లావాసులకు పెద్దగా మేలు చేకూర్చలేదనే విమర్శలు వినిపించాయి.
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ, సహాయ పునరావాసం వ్యయాల కేటాయింపులను రెండేళ్లుగా వార్షిక బడ్జెట్‌లో చూపించడం లేదు. నాబార్డు ద్వారా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే.. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటన చేసేవారు. నిర్మాణ, పునరావాసాలకు విడి విడి కేటాయింపులు ఉండేవి. తాజా బడ్జెట్‌లో సీతారామన్ నోటి వెంట పోలవరం ప్రస్తావన వినిపించలేదు. పద్దులో కేటాయింపులు కనిపించ లేదు. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.55 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరినా, కేంద్ర మంత్రికి విన్నవించినా వార్షిక బడ్జెట్‌లో దీని ప్రస్తావన జరగకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
వంట నూనెలు.. మద్యం ధరల ఘాటు
ఈ బడ్జెట్‌లో ప్రత్యక్ష, పరోక్ష వడ్డింపుల ధోరణే కనిపించింది. మధ్య తరగతి ఆశించే ఫ్రిజ్‌లు, ఏసీలు భారం కాబోతున్నాయి. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వంట నూనె ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఒక రకంగా పామాయిల్ పండించే రైతులకు కేంద్ర బడ్జెట్ ద్వారా శుభవార్తే వినిపించింది. మిగతా వంట నూనెల మాదిరిగానే పామాయిల్ ధరలు భారీగా ఉండబోతున్నాయి. ఇది జిల్లాలో పామాయిల్ పండించే వేలాది మంది రైతులకు మరింత ప్రోత్సాహకరంగా ఉండనుంది. ఇప్పటికే మద్యపాన నిషేధం పేరిట రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మద్యం ధరలను పెంచుకుంటూ పోయింది. గతంకంటే ధరలన్నీ నాలుగింతలు పెరిగాయి. ఇప్పుడు మద్యం ఉత్పత్తి సంస్థలపై వంద శాతం సుంకం విధించడానికి కేంద్ర వార్షిక బడ్జెట్‌లో సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో భారీగా మద్యం ధరలు పెరగ బోతున్నాయి. ఇంతకు ముందు మాదిరి బడ్జెట్‌లోనే సిగరెట్ ధరల పెంపు వంటి విధాన ప్రకటన ఉండేది. ఈసారి ఎందుకనో ఈ ప్రస్తావన కనిపించలేదు. దీంతో కొంతలో కొంత పొగరాయుళ్లకు ఊరటే.
జలజీవన్‌కు మరింత ప్రోత్సాహం
అందరికి సురక్షిత మంచి నీరందించే క్రమంలో బడ్జెట్‌లో జలజీవన్ పథకం కింద భారీ కేటాయిం పులు చూపించారు. ఈ పథకంలో ఇప్పటికే అనేక ప్రతిపాదనలు జిల్లా నుంచి ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు అంతంత మాత్రంగా ఉండడంతో ఈ పథకం జిల్లాలో ముందుకు సాగలేదు. ఈసారి భారీ కేటాయింపులు ఉండడంతో పనులు మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉచిత గ్యాస్ విధానం అమలులోకి తేవాలనే నిర్ణయంపై వినియోగ దారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు వ్యక్తిగత వాహనాలు 15 ఏళ్లు దాటితే చెత్తకు పంపేయాలని ఆదేశాలు న్నాయి. ఈసారి కేంద్రం దీనిని సడలించింది. వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు, మిగతా వాహనాలు 15 ఏళ్లపాటు వినియోగంలో ఉండవచ్చునని కొత్తవరం ప్రకటించారు. వాహనదారులకు ఊరట కలిగించే అంశం.
ఆదాయపు పన్ను పరిమితి మాటేంటి ?
కరోనా దెబ్బతో కుదేలైన వారందరినీ ఆదుకు నేందుకు ఆదాయపు పన్ను పరిమితి మరింత పెంచాలని అంతా ఆకాంక్షించారు. 75 ఏళ్ల పైబడిన వయో వృద్ధులకు ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వరం ప్రకటించారు. ఈ కారణంగా జిల్లావ్యాప్తంగా 80 వేల మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను పరిమితి రెండున్నర లక్షలు పైబడి ఉండాల్సిందిగా అందరూ కోరుకుంటున్నట్లు ఎలాంటి హామీ కాని వరం కాని ప్రకటించ డానికి కేంద్రం సుముఖంగా లేనట్లు తేలిపోయింది. దీంతో వేతన జీవులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడ్జెట్ భారమే : చెరుకూరి శ్రీనివాసరావు, చార్టెడ్ అకౌంటెంట్, తణుకు
ఆదాయ పన్ను శ్లాబులలో ఉద్యోగులకు ఇచ్చే స్టాండర్డ్ డిటక్షన్‌లో ఎటువంటి మార్పు లేకపోవడం ఉద్యోగవర్గాలకు నిరాశ కలిగించింది. ఎక్కడా లేని విధంగా పెట్రోలు, డీజిల్ రేట్లపై అగ్రిసెస్ విధించి, రేటు పెంచడం, టోలు రూపేణా అడుగడుగనా అధిక మొత్తాలను చెల్లించడం వల్ల వస్తు రేట్లలో పెరుగుదల మధ్య తరగతి వర్గాలపై భారం పడుతుంది. గత బడ్జెట్‌లో మార్పుల వల్ల ఆదాయపన్ను మదింపు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇప్పుడు ఇన్ కం టాక్స్ ట్రిబ్యునల్ అప్పీలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం పన్ను చెల్లింపుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లాభాపేక్ష లేని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కోటి వార్షిక టర్నోవర్‌పై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని రూ.5 కోట్ల వరకూ పెంచడం వల్ల ఆయా సంస్థలకు ఎంతో ఊరట కలిగిస్తుంది.
ప్రజల నడ్డి విరిచారు – గన్ని వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, ఏలూరు, నరసాపురం టీడీపీ అధ్యక్షులు
కేంద్ర బడ్జెట్ సామాన్యుల నడ్డి విరిచేదిగా ఉంది. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించలేక పో యింది. వైసీపీ ఎంపీలంతా కేంద్ర ముందు మోకరి ల్లారు. అగ్రి ఇన్‌ఫ్రా పేరిట పెంచిన పన్నులు వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మద్యం ధరలు ఇప్పటికే పెరిగాయి. వీటిపై వంద శాతం సెస్సు విధించడం దుర్మార్గం. బీజేపీ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇచ్చారు. పోలవరం ఊసే లేదు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేదు. విశాఖ, విజయవాడ మెట్రో లైన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.