మళ్లీ వస్తున్నా...

ABN , First Publish Date - 2021-03-21T05:30:00+05:30 IST

సరిగ్గా గతేడాది ఇదే సమయంలో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. ఒక్క ఏలూరు నగరంలోనే గడిచిన ఏడాదంతా కరోనా కేసులతో తొలిస్థానం ఆక్రమించింది.

మళ్లీ వస్తున్నా...

కరోనా లాక్‌డౌన్‌కు ఏడాది

పొంచి ఉన్న ముప్పు.. వ్యాక్సిన్‌తోనే తొలగేను

ఏడాదిలో 542 మంది బలి.. 96 వేల పాజిటివ్‌ కేసులు


లాక్‌డౌన్‌.. 2020 మార్చి 22వ తేదీ.. 

ఆ రోజు గుర్తుకు వస్తేనే ఇప్పటికీ అనేకమంది గుండెలు అరచేత్తో పట్టుకుంటారు. కరోనా వేగాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించి నేటికి ఏడాది కావస్తోంది. కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. మార్చి నుంచి నవంబర్‌ వరకూ నెలలపాటు సుదీర్ఘంగాను, మరికొన్ని నెలలు కేవలం రాత్రుళ్లకే పరిమితమైన లాక్‌డౌన్‌ ఏడాది కాలంలో జన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కరోనా ధాటికి ఏకంగా వందల మంది బలయ్యారు. వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. లాక్‌డౌన్‌ విధించిన ఆనాటి చేదు గుర్తులు చెరిగిపోలేదు. నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోలుకోలేక చతికిలబడిన సంస్థలు ఎన్నో. ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక దిక్కుతోచని వారెందరో. మళ్లీ కరోనా మెల్లమెల్లగా కోరలు చాస్తోంది. మొదటి నుంచే అడ్డుకట్ట వేయాలి.. లేదంటే మరింత నష్టపోతాం.

(ఏలూరు– ఆంధ్రజ్యోతి)

సరిగ్గా గతేడాది ఇదే సమయంలో కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. ఒక్క ఏలూరు నగరంలోనే గడిచిన ఏడాదంతా కరోనా కేసులతో తొలిస్థానం ఆక్రమించింది. ఢిల్లీ నుంచి ఆరంభమై కాశీ నుంచి ప్రయాణించి తంగెళ్ళమూడి, పిన కడిమిలో తిష్ఠవేసి ఊరంతా పాకి కరోనా గుబులు పుట్టిం చింది. గతేడాది నవంబర్‌ నాటికే నమోదైన వేల కేసుల్లో 40 శాతం దాదాపు 30 వేల కేసులు ఒక్క ఈ నగరంలోనే కని పించాయి. ఆశ్రం ఆసుపత్రి, ప్రభుత్వాసుపత్రి నిత్యం వంద లాది మంది రోగులతో కిటకిటలాడింది. అటు కృష్ణా జిల్లా నుంచి తూర్పు గోదావరి నుంచి అనేక మంది ఇక్కడే చేరి చికిత్స పొందారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగావకా శాలు కోల్పోయారు. రోజు వారీ పనిలేక కూలీలు రేషన్‌ సరుకుల మీదే ఆధారపడ్డారు. ప్రైవేటు సంస్థలన్నీ ఉద్యోగుల ను ఇళ్లకు పంపించాయి. ఆనాటి కరోనాదెబ్బ నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంట్నుది. గతేడాది మార్చి నుంచి దాదాపు ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా అనేక మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏడాది పొడవునా వివిధ పరీక్షల్లో 94 వేల 409 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మూడు నెల లుగా అడపాదడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే 10 కేసులు తెరముందుకు వచ్చాయి. అన ధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 96,900 మంది కాగా, మృతి చెందిన వారి సంఖ్య 542 మందికి పైగానే. ఇంతటి విపత్తు వేళ ప్రజలంతా అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.  


ఇప్పుడేం చేయాలి..?

లాక్‌డౌన్‌ విధించి నేటితో ఏడాది పూర్తి. ఆనాడు పడిన కష్టాలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. బస్సులు, రైళ్లు ఆగిపో యాయి. ట్రాన్స్‌పోర్టు నిలిచిపోయింది. ఆరు నెలలకుపైగా ఆర్టీసీ బస్సులు నడవలేదు. దేనికైనా ద్విచక్ర వాహనమే గతి. అప్పట్లో రోడ్ల మీద పరుగులు పెట్టింది అంబులెన్సులే. కానీ ఇప్పుడు ఆనాటి ముప్పు పొంచే ఉంది. క్రమంగా జిల్లాలో అడపాదడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కరోనా వేలల్లో విజృంభించి నప్పుడు జిల్లాలో మాత్రం కరోనా బాధితుల సంఖ్య అత్యల్పంగానే ఉండేది. మే నాటికి ఒక్కసారిగా వేలల్లోకి దూసుకుపోయింది. భీమవరం, నర్సాపురం, పెనుగొండ, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం, నిడదవోలు, కొవ్వూరు పట్టణాలు కరోనా ధాటికి నిలబడలేకపోయాయి. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవ రం, కొవ్వూరు ప్రాంతాల్లో పేదలకు నిర్మించిన టిడ్కో గృహా లనే వైద్య సేవలకు వినియోగించారు. వేలమంది కరోనా బాధితులు టిడ్కో గృహ సముదాయాల్లోనే కాలం గడిపారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పొరుగు జిల్లాల్లోనూ కరోనా శరవేగంగా పాకుతోంది. ఇది ముప్పుగా పరిగణించక ముందే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. వేలాది మందికి కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్లో నమోదు చేసుకున్న వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించుకుని ఆ  దిశగా ఏర్పాట్లు చేసింది. కొవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ అందుబాటు లోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వ్యాక్సిన్‌పై విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుజాగ్రత్త అవసరం. 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించు కోవాలని ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది


వ్యాక్సిన్‌తోనే కట్టడి  

కరోనా పొంచే ఉంది. చాలా మంది మాస్క్‌ తీసివేశారు. సమూహాలుగా ఎక్కడపడితే అక్కడ ఒకటైపోతున్నారు. కేర్‌లెస్‌గా వ్యవహరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించాలి. దగ్గు, తుమ్ము, జ్వరంతో బాధపడుతూ ఉంటే ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా లక్షణాలు ఏవీ బయటపడకుండానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. 45 ఏళ్లు పైబడిన వారంతా అనుమానాలు వీడి వదంతులుమాని ధైర్యంగా వ్యాక్సిన్‌కు సిద్ధప డాలి. ప్రయాణించేటప్పుడు, ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ మోహన్‌ కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటూనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోనూ కొవిడ్‌ బెడ్‌లకు సిద్ధమవుతున్నారు. కరోనా కఽథ ముగియలేదు.. బహుపరాక్‌.


Updated Date - 2021-03-21T05:30:00+05:30 IST