గొంతులోకి గరళం
ABN , First Publish Date - 2021-12-15T05:39:25+05:30 IST
అలవాటులో పొరపాటుగా చేపల చెరువులు అనుకునేరు.. అసలు కానేకాదు.. కలుషితం కావడంతో చూడడానికి అలా కనిపిస్తున్నా.. ఇవి మంచినీటి చెరువులే సుమా..

ఆకివీడులో కలుషితమైన తాగునీరే సరఫరా
8 చెరువులు ఉన్నా ఉపయోగం సున్నా
అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం
రోగాల బారిన పడుతున్న నగరవాసులు
ఆకివీడు, డిసెంబరు 14 : అలవాటులో పొరపాటుగా చేపల చెరువులు అనుకునేరు.. అసలు కానేకాదు.. కలుషితం కావడంతో చూడడానికి అలా కనిపిస్తున్నా.. ఇవి మంచినీటి చెరువులే సుమా.. ఏంటీ మంచినీటి చెరువులా అని ఆశ్చర్యపోకండి.. మేం చెప్పేది నిజం.. నేటికీ ప్రజలు ఆ చెరువులో నీటిని తాగుతున్నారు.. ఆ నీటిని తాగుతున్న వాళ్లు ఉన్నారా.. లేరా అని అనిపిస్తుంది కదూ.. ఉన్నా అంత పనీ జరుగుతోంది. ఏ క్షణం ఎవరు ఏ రోగం బారిన పడుతున్నారో అర్ధం కాకుండా ఉంది.. చిన్నారుల నుంచి పెద్దల వరకూ అంతా బాధితులే. అయినా కనీసం పట్టించుకున్న అధికారులు లేరు.. పాలకులు లేరు. ఆకివీడు నగర పంచాయతీ ప్రజలు మాత్రం నేటికీ ఉన్న నీటితో గొంతు తడుపుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అధికారులు. పాలకుల మనసు మాత్రం కరగడంలేదు.
8 చెరువులున్నా..నిరుపయోగమే..
ఆకివీడు నగర పంచాయతీలో సుమారు 50 ఎకరాల్లో మొత్తం 8 మం చినీటి చెరువులు ఉన్నాయి.వీటిలో మూడు చెరువులు కొండయ్య చెరువు, దొరగారి చెరువు, తురకచాకలి చెరువులు పూడుకుపోయి వాడుకలో లేవు.. ఇక గతేడాది వరకూ వాడుకలో ఉన్న గాలిబ్ చెరువు చిన్న చిన్న సమస్యల కారణంగా గత ఐదు నెలలుగా వినియోగంలో లేదు. భుజబలరాయుడు చెరువు, భుజబలరాయుడు స్టోరేజ్ ట్యాంక్, ఆనాల చెరువు, ధర్మాపురం అగ్రహారంలో చెరువులు ఉన్నాయి. ప్రస్తుతం నగర పంచాయతీ వాసులకు ఈ నాలుగు చెరువుల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నాలుగు చెరువులూ కలుషిమైనా ఆ నీటినే నగర వాసులకు విడుదల చేస్తున్నారు.
45 వేల మందికి కలుషిత నీరే దిక్కు
ఆకివీడులో సుమారు 45 వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం ఈ నాలుగు చెరువుల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవివచ్చిందంటే మాత్రం మొత్తం అన్ని చెరువులను అందుబాటులోకి తీసుకురావాల్సింతే. అయితే నేటికీ అటువంటి ప్రయత్నాలేం లేవు. అటు పాలకులు.. ఇటు అధికారులు ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. మరో పక్క ఉన్న చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా చోద్యం చూస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా ఉంటే రానున్న వేసవిలో ఇబ్బందులు పడక తప్పదని ప్రజలు వాపోతున్నారు.
ఇదీ నాలుగు చెరువుల వ్యథ..
గాలిబ్ చెరువులో నిండుగా తాగునీరున్నా చిన్న చిన్న సమస్యలతో ఆరు నెలలుగా వినియోగంలో లేదు. భుజబలరాయుడు, ఆనాల మంచినీటి చెరువుల నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు.నగర పంచాయతీకి ఇంజనీర్ (ఏఈ) లేకపోవడంతో పట్టించుకునే నాథుడు లేడు. ఒక్కో చెరువు శుభ్రతకు సుమారు నెల రోజులు పట్టవచ్చు. ఇప్పటి నుంచి చర్యలు చేపట్టకపోతే కాలువలు కట్టే సమయానికి శుభ్రం కాకపోవచ్చు
భుజబలరాయుడు చెరువుకు సంబంధించి ఫిల్టర్ బెడ్‌లలో ఇసుక మార్చి ఐదేళ్లవుతోంది.ఎగువన మురుగుకాల్వయిన వెంకయ్య వయ్యేరు కాల్వ మనకొచ్చే సరికి పంటకాలువ కావడంతో అక్కడే నీరు కొంచెం కలుషితమవుతోంది.ప్రజలకు సరఫరా చేసే మంచినీటి చెరువులు,ఫిల్టర్ బెడ్‌లు శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా తయారయ్యాయి.
భుజబలరాయుడు స్టోరేజ్ ట్యాంకు మంచినీటి చెరువుకు సమీపంలో సామూహిక మరుగు దొడ్లు ఉన్నాయి.ఆ మరుగుదొడ్లు పూడుకుపోయి తుప్పల మధ్య నిరుపయోగంగా మారాయి. దీంతో చుట్టు పక్కల ప్రజలు చెరువు పక్కనే మలవిసర్జన చేసి ఆ స్టోరేజ్ ట్యాంకు చెరువులోనే కడుక్కుంటున్నారు. పరిసర ప్రాంతాన్ని స్థానికులు డంపింగ్‌గా వినియోగిస్తున్నారు. మలవిసర్జనలు, డంపింగ్ చేయడంతో పందులు వాటిని తిని స్టోరేజ్ ట్యాంకు చెరువులోనే స్నానాలు చేస్తున్నాయి.
ఆనాల మంచినీటి చెరువు చుట్టూ సుమారు 50 కుటుంబాలు పైనే పాకలు వేసుకుని ఉంటున్నాయి. స్టోరేజ్ ట్యాంకు చెరువు చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో ఆక్రమణకు గురవుతోంది. చెరువులు రాత్రుళ్ళు అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మందుబాబులు తాగిన తరువాత ఆ సీసాలు మంచినీటి చెరువులో పడేస్తున్నా రు. ప్రతీ చెరువు వద్ద కాపలాదారులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.. వేసవి నాటికి చెరువులను సిద్ధం చేయాలి.
ఎల్లుండి నగర పంచాయతీ తొలి పాలకవర్గ సమావేశం
నగర పంచాయతీ మొదటి పాలకవర్గ సమావేశం శుక్రవారం జరుగుతుందని కమిషనర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. 20 వార్డుల కౌన్సిలర్లు పాల్గొంటారన్నారు.దీనిలో భాగంగా పలు సమస్యలపై చర్చిస్తారన్నారు.