కాల్వ నీరు ఎగదన్ని ఇటుక బట్టీల మునక
ABN , First Publish Date - 2021-03-24T06:28:41+05:30 IST
పైడిమెట్ట ఎత్తిపోతల పథకం లస్కర్ నిర్లక్ష్యం కారణంగా ప్రక్కిలంకలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలు మునిగిపోయి ఇటుకలు కరిగిపోయాయని బట్టీల యజమానులు ఆరోపించారు.

లస్కర్ తప్పిదం వల్లేనని యజమానుల ఆరోపణ
తాళ్లపూడి, మార్చి 23 : పైడిమెట్ట ఎత్తిపోతల పథకం లస్కర్ నిర్లక్ష్యం కారణంగా ప్రక్కిలంకలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలు మునిగిపోయి ఇటుకలు కరిగిపోయాయని బట్టీల యజమానులు ఆరోపించారు. స్థానిక శివాలయం వెనుక పుంతరోడ్టులో కూన పెద్దిరాజు ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. పైడిమెట్ట కాల్వ నుంచి తాళ్లపూడి శివారుకు పొలాలకు నీరందించడానికి కాల్వ పక్క బోదెలు మూసేసి అధికస్థాయిలో నీటిని లస్కర్ విడుదల చేశాడని, దీంతో కాల్వలో నుంచి నీరు పైకి ఎగదన్ని కూన పెద్దిరాజు, చాదరాశి రాజు, అడ్డాల సుబ్బారావు, పోతుల గంగాచలం నిర్వహిస్తున్న ఇటుకబట్టీలు మునిగి పోయాయని యజమానులు లబోదిబోమన్నారు. ఈ సందర్బంగా కూన పెద్దిరాజు మాట్లాడుతూ కాల్పుకు ఏర్పాటు చేసిన ఇటుకలు మట్టి ముద్దలుగా మారాయని, సుమారు రూ. 10 లక్షలకు పైగా నష్టం జరిగిందని వాపోయాడు. తనకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు. మరో మూడు బట్టీల యజమానులు కూడా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.