సీనియార్టీ సిత్రాలు

ABN , First Publish Date - 2021-10-21T05:09:15+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ టీచర్లకు ప్రభుత్వ బడుల్లో స్థానాలను (వెకెన్సీ/పోస్టింగ్‌) కేటాయించేందుకు విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌తో సరికొత్త వివాదం రాజుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

సీనియార్టీ సిత్రాలు

 ఎయిడెడ్‌ టీచర్ల చేరికతో మారిపోనున్న జాబితాలు

 ఎయిడెడ్‌ సీనియార్టీని కూడా ప్రస్తుత పదోన్నతులకు చేర్చాలంటున్న టీచర్లు

జీరో సర్వీస్‌ సీనియార్టీ వల్ల విలీనం నిష్ఫలమంటూ పెదవి విరుపు

 స్పష్టత ఇవ్వని విద్యాశాఖ


ప్రభుత్వ పాఠశాలల్లో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ టీచర్లకు ప్రభుత్వ బడుల్లో స్థానాలను (వెకెన్సీ/పోస్టింగ్‌) కేటాయించేందుకు విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌తో సరికొత్త వివాదం రాజుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సుముఖత తెలియజేసిన ఎయిడెడ్‌ టీచర్ల సీనియార్టీకి ఏ తేదీని పదోన్నతికి ప్రామాణికంగా తీసుకుంటారో ఇంతవరకు విద్యాశాఖ స్పష్టత చేయకపోవడమే వివాదానికి దారితీసే అవకాశాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 20 : జడ్పీ/ఎంపీపీ పాఠశాలల టీచర్లకు పదోన్నతుల కౌన్సెలింగ్‌, ఎయిడెడ్‌ పాఠశాలల టీచర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో వెకెన్సీలను కేటాయించేందుకు షెడ్యూల్‌ను ఇంచుమించుగా కొద్దిరోజుల వ్యవధిలో నిర్వహించడానికి నిర్ణయించడం వలన ప్రధానంగా ఎయిడెడ్‌ టీచర్ల సీనియార్టీ గురించి ఏర్పడే సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  పురపాలక శాఖ మాదిరిగానే పంచాయతీరాజ్‌ శాఖ కూడా ఎయిడెడ్‌ టీచర్లకు జీరో సర్వీస్‌ సీనియార్టీనే తమ యాజమాన్యంలో వర్తింప చేస్తామంటే, చివరిసారిగా రిక్రూట్‌మెంట్‌ జరిగిన డీఎస్సీ–2018లో నియమితులైన ఉపాధ్యాయులకంటే ఎయిడెడ్‌ టీచర్లు జూనియర్లు అవుతారు. ఎందుకంటే ఒకటి, రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న సర్వీస్‌ సీనియార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లోకి విలీనం వలన జీరో సర్వీస్‌ సీనియార్టీనే తుది ప్రామాణికంగా తీసుకుంటే ఎయిడెడ్‌ టీచర్లంతా ఆయా యాజమాన్యాల్లో జూనియర్లు అయినట్టే. ప్రభుత్వమే తమను బలవంతంగా యాజమాన్యాన్ని మార్చుతున్నందున జీరో సర్వీస్‌ సీనియార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత టీచర్లు అంగీకరించే అవకాశాలు లేవు. అలాగని ఉద్యోగంలో చేరిన తేదీ నుంచే సర్వీస్‌ సీనియార్టీని లెక్కించి ఎయిడెడ్‌ టీచర్లకు మునిసిపల్‌/పంచాయతీరాజ్‌ పాఠశాలల్లోని వెకెన్సీల్లో నియమించడానికి ప్రభుత్వం నిర్ణయిస్తే సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నుంచి, మరీ ముఖ్యంగా భవిష్యత్తులో పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్న టీచర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదు. కాగా జడ్పీ/ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు ఈనెల 25న హెచ్‌ఎం వెకెన్సీలకు, 29, 30 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ వెకెన్సీలకు పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఎయిడెడ్‌ టీచర్లకు ప్రభుత్వ పాఠశాలల్లో వెకెన్సీల కేటాయింపునకు షెడ్యూల్‌ను ఈనెల 20వ తేదీన ప్రారంభించి నవంబర్‌ 6వ తేదీన నూతన బదిలీ స్థానాలకు నియామకపు ఉత్తర్వులు జారీ చేయడంతో ముగించనున్నారు.

 జిల్లాలో 463 మంది  ఎయిడెడ్‌ టీచర్లకు స్థాన చలనం 

జిల్లాలో మొత్తం 318 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 82 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో(జీరో ఎన్‌రోల్‌మెంట్‌) వాటిని ఇప్పటికే మూసివేశారు. మిగిలిన వాటిలో 177 పాఠశాలల యాజమాన్యాలు వారి వద్ద పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించారు. వీరిలో 207 మంది ప్రాఽథమిక పాఠశాలల్లోనూ, 25 మంది ప్రాథమికోన్నత, 231 మంది ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 44 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న 92 మంది టీచర్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించలేదు. దీంతో తొలి విడతలో మొత్తం 463 మంది టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోని వెకెన్సీల్లో సర్దుబాటు చేయడానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.


Updated Date - 2021-10-21T05:09:15+05:30 IST