ఇదేమి రాజ్యం

ABN , First Publish Date - 2021-10-20T05:52:09+05:30 IST

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ దాడులకు దిగడంతో మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్కంఠకు దారి తీసింది. వరుసగా జరుగుతున్న సంఘటనలు పార్టీ నేతలను గందరగోళ పరిచాయి.

ఇదేమి రాజ్యం
నరసాపురంలో కాగడాలతో నిరసన తెలుపుతున్న పొత్తూరి రామరాజు

టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ దాడులా.. ?

అరాచకం, విధ్వంసాలపై టీడీపీ నాయకుల ఆగ్రహం

రాష్ట్రపతి పాలన విధించాల్సిందే 

జిల్లా పార్టీ కార్యాలయాల వద్ద భద్రత  

నేడు బంద్‌కు టీడీపీ పిలుపు


రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ దాడులకు దిగడంతో మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్కంఠకు దారి తీసింది. వరుసగా జరుగుతున్న సంఘటనలు పార్టీ నేతలను గందరగోళ పరిచాయి. జిల్లాయేతర ప్రాంతాల్లో దాడులు, విధ్వంసం జరిగినా.. ఇక్కడ అలాంటి పరిస్థితి నెలకొంటుందన్న భయాందోళనలు తొంగిచూశాయి. ఎక్కడికక్కడ నేతలు పరస్పరం ఫోన్లు చేసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పార్టీ కార్యాలయాలకు స్వీయ రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కార్యకర్తలకు సూచనలు జారీ చేశారు.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) : టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపై మంగళవారం వైసీపీ దాడులకు దిగడంతో ఆ పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అధికార పార్టీపై నిప్పులు చెరిగాయి. ప్రజా స్వామ్యం ఖూనీ అవుతుందంటూ నినదించాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం ఏలూరులో పార్టీ కార్యాలయంతో పాటు మిగతా చోట్ల ఉన్న కార్యాలయాల వద్ద ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని నేతలు ఆరా తీశారు. ఎక్కడికక్కడ తాళాలు వేసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా చేసిన సూచనలతో కార్యాలయాల నిర్వాహకులు తక్షణం స్పందించారు. తెలుగుదేశం పార్టీకి నానాటికీ  పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తగ్గుతున్న గ్రాఫ్‌ను చూసి ఓర్చుకోలే వైసీపీ రాష్ట్రంలో ఈ విధంగా విధ్వంసాలకు ప్రోత్సహిస్తుందని టీడీపీ దుయ్యబట్టింది. ఇలాంటి అమానుష సంఘటనలు, పరిస్థితులు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని, అత్యంత దారుణంగా తాజా సంఘటనలను పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు జవహర్‌, గన్ని వీరాంజనేయులు, సీతారామలక్ష్మి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం జరగనున్న రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లాలో అందరు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందా అంటూ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అంటే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాయి. ప్రజల పక్షాన నిలుస్తాయి. ఇవి సహజ న్యాయసూత్రం. ఇప్పుడు దీనికి విరుద్దంగా పాలకపార్టీకి వ్యతిరేకంగా గళం విప్పితే అంతే సంగతులు. విధ్వంసం, విధ్వేషం. ప్రజాస్వామ్య పద్ధతులన్నీ రాష్ట్రంలో కాలరాచేశారు. అరాచకం రాజ్యమేలుతోంది. ప్రజలు దీనంతటిని గమనిస్తున్నారు. దీనిని చూస్తూ ఊుకోబోరు.’ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో అందరూ విసుగెత్తిపోయారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేసేందుకు తద్వారా భయభ్రాంతులను సృష్టించేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉండే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలే శ్రీరామరక్ష.. పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు చేస్తే భయపడబోము. కానీ ప్రజా స్వామ్యంగా విధ్వంసం చేస్తే ఇక సహించమని ఏలూరు కన్వీనర్‌ బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం, నిజాన్ని నిర్భయంగా ప్రకటించే వారిపై దాడులకు పూనుకోవడం, పార్టీ కార్యాలయాలపై విధ్వంసానికి దిగడం, అత్యంత అమానుషంగా జడ్పీ మాజీ ఛైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం కార్యాలయాలు, నేతలపై దాడులు చేస్తున్నారు. ఇప్పటిదాకా అక్రమ కేసులతోనే భయపెట్టాలని చూశారు. ఇప్పుడేమో అరాచక దాడులతో భయపెట్టాలనుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి. అరాచకం రాజ్య మేలుతుందని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. దాదాపు నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయా లకు ఎక్కడికక్కడ స్వీయ రక్షణ  ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీ దాడులకు పాల్పడితే అడ్డుకోవాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి పొద్దుపోయేంత వరకు నేతలు కార్యకర్తల మధ్య పరస్పర ఫోను సంభాషణలు నడిచాయి. టీడీపీ కేంద్ర కార్యాలయాలపై దాడులకు దిగడం, నేతలపై వైసీపీ గూండాలు విరుచుకుపడడానికి నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. భీమవరంలో మంగళవారం రాత్రి నరసాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తదితర నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 


టీడీపీ శ్రేణుల ఆందోళన

భీమడోలు, అక్టోబరు 19: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడులను నిరసిస్తూ భీమడోలు జంక్షన్‌లో ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ రౌడీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై విధ్వంసం సృష్టిస్తే పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ది చెప్తారన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రమై భయంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు తెగబడ్డారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే  ఏలూరు, మొగల్తూరు, ఆకివీడు తదితర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. కాగా నరసాపురంలో కాగడాలు, కొవ్వొత్తులతో ఆందోళన చేశారు.


అరాచక పాలనకు పరాకాష్ఠ 

రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదో పరాకాష్ఠ. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీపై అక్కసుతో దాడులు చేస్తున్నారు. విధ్వంసాలకు ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడి ఘోరం. ప్రజల పక్షాన నిలుస్తున్న తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ వారి మద్దతు ఉంటుంది. దీనిని అణగదొక్కేందుకు, భయబ్రాంతులను చేసేందుకు ఎక్కడికక్కడ అరాచకం సృష్టించాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నోరు విప్పితే చాలు నేతల ఇళ్ళపై విధ్వంసం, పార్టీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులు. అల్లరి చిల్లర మూకలను పంపి అరాచకాలు. రాష్ట్రంలో అసలు పోలీసులు ఉన్నారా. ప్రజా స్వామ్యం ఎక్కడికి పోయింది.

– సీతారామలక్ష్మి, నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు

 

 నిప్పుతో చెలగాటమా 

ఇదేమి దమనకాండ. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులేంటి. నిజాలు నిర్భయంగా వెల్లడించడం నేరమా. ప్రజల పక్షాన ప్రతిపక్షం నిలవడం కూడా మీకు కష్టమేనా. ఎందుకీ దాడులు. మరెందుకీ కక్షపూరితం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు అత్యంత నీచం. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని అణిచివేయాలనుకుంటే నిప్పుతో చెలగాటమే.  

– గన్ని వీరాంజనేయులు, ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు


 రాష్ట్రపతి పాలన పెట్టాలి 

రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ధ్వంసమైంది. శాంతి భద్రతలు క్షీణించాయి. పాలన అదపు తప్పింది. గూండాలు, రౌడీలు రెచ్చిపోతున్నారు. పాలక పార్టీనే దాడులను ప్రోత్సహిస్తోంది. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంపై దాడి అమానుషం. జగన్‌ పార్టీ దమన కాండకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. టీడీపీ కార్యాలయాలు, నేత పట్టాభిలాంటి వారి ఇళ్ళపై దాడులకు పోలీసులే సమాఽధానం ఇవ్వాలి. రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోంది. దీని నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించేందుకు రాష్ట్రపతి పాలన విధించడమే శరణ్యం, జరుగుతున్న ఏకపక్ష దాడులపై ప్రజలు స్పందించాలి. 

– జవహర్‌, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు

Updated Date - 2021-10-20T05:52:09+05:30 IST