కరోనా దోపిడీ..!

ABN , First Publish Date - 2021-05-20T05:39:47+05:30 IST

జంగారెడ్డిగూడెంలోని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు అధిక ఫీజులతో నిలువు దోపిడీ చేస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.

కరోనా దోపిడీ..!
జంగారెడ్డిగూడెంలోని పీవీఆర్‌ ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు (ఫైల్‌)

ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు

రెండు ఆసుపత్రులపై విజిలెన్స్‌ తనిఖీలు

అయినా ఆగని ఆగడాలు

జంగారెడ్డిగూడెంలోని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు అధిక ఫీజులతో  నిలువు దోపిడీ చేస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ వైద్యం అందించేందుకు ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితిలో అప్పు చేసి లక్షలు గుమ్మరించాల్సి వస్తోంది. పలువురు బాధితుల ఫిర్యాదులతో జిల్లా విజిలెన్స్‌ అధికారులు ప్రైవేట్‌ ఆసుపత్రులపై దాడులు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న దోపిడీని చూసి విజిలెన్స్‌ అధికారులే నోరెళ్లబెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

జంగారెడ్డిగూడెం, మే 19: జంగారెడ్డిగూడెం పట్టణం అటు ఏజెన్సీ మండలాలతో పాటు మెట్ట ప్రాంతంలో దాదాపు 150 గ్రామాలకు కేంద్రంగా ఉంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం నుంచి గిరిజనులు ఏ అవసరమైనా ఇక్కడికే వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు వెలిశాయి. ఏ చిన్న రుగ్మత వచ్చినా ఈ ఆసుపత్రులకు వచ్చి వైద్యం చేయించుకోవడం అలవాటైంది. కరోనా వ్యాప్తితో కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల ఆగడాలకు అడ్డే లేకుండా పోయిందని బాధితులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఐదు కొవిడ్‌ కేంద్రాలు

జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోపాటు చిరంజీవి, జాబిల్లి, వడ్లమూడి, పీవీఆర్‌ ప్రైవేట్‌ ఆసుపత్రులతో కలిపి మొత్తం 5 కోవిడ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు, చిరంజీవి ఆసుపత్రిలో 40 పడకలు, పీవీఆర్‌ ఆసుపత్రిలో 50 పడకలు, జాబిల్లి ఆసుపత్రిలో 30 పడకలు, వడ్లమూడిలో 15 పడకలతో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు నోడల్‌ అధికారులను నియమించారు. ఎటువంటి వైద్య సేవల కోసమైనా, ఆసుపత్రుల్లో ఫీజులు, ఇతర ఇబ్బందులను నేరుగా నోడల్‌ ఆఫీసర్‌లకు తెలియజేయవచ్చు. అయితే కొన్నిచోట్ల కరోనా బాధితులకన్నా ఆసుపత్రుల బాధితులే ఎక్కువగా ఉన్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

దాడుల్లో బయటపడిన అక్రమాలు

జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు జిల్లా విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ నెల 6న పీవీఆర్‌ ఆసుపత్రిపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. కేస్‌ షీట్లు సరిగా లేవని, పేషెంట్ల నుంచి తీసుకున్న సొమ్ముకు సరైన బిల్లులు లేవని, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ రికార్డులు లేవని గుర్తించినట్టు విజిలెన్స్‌ డీఎస్పీ రమణ వెల్లడించారు. మరుసటి రోజే ఆసుపత్రిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14న పట్టణంలోని చిరంజీవి కొవిడ్‌ కేంద్రంపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలించారు. వైరస్‌ బాధితుల నుంచి అఽధిక ఫీజులు వసూలు, ఆరోగ్యశ్రీ తిరస్కరించి ఫీజులు వసూలు చేశారని గుర్తించినట్టు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. దీనిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్‌ అధికారులు మీడియాకు తెలిపారు. అయినప్పటికీ అధిక ఫీజుల్లో మార్పు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు రూ.25 వేలకు పైగానే వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పరిస్థితి విషమించిందని ఒక ఇంజక్షన్‌కు రూ.80 వేలు వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు.


Updated Date - 2021-05-20T05:39:47+05:30 IST